మా పార్టీలో చేరండి.. మోదీకి విదేశీ ప్రధాని రిక్వెస్ట్..
posted on Nov 3, 2021 @ 1:23PM
నరేంద్ర మోదీ. ఇది పేరు కాదు పవర్. అత్యంత జనాకర్షణ ఉన్న నాయకుడు-పాలకుడు. భారత్‌లో తిరుగులేని నేత. ఆయన ఇమేజ్ కేవలం ఇండియాకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవిదేశాల్లోనూ మోదీకి మంచి క్రేజ్ ఉంది. మన ప్రధాని ఏ దేశంలో అడుగుపెట్టినా.. అక్కడి భారతీయులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. అంతటి జనాదరణ చూసి.. ఆయా దేశాల అధ్యక్షులు అవాక్కవుతుంటారు. ఎన్నారైల్లోనే కాదు.. ఫారెనర్స్‌లోనూ మోదీకి బాగానే పాపులారిటీ ఉంది. ప్రజల్లోనే కాదు.. పలు దేశాధ్యక్షుల్లోనూ మోదీకి అభిమానులు ఉన్నారు. ఆ కోవలో ఒకరే.. ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్.
తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని.. మన మోదీకి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ అనడం కంటే.. రిక్వెస్ట్ చేశారనడం కరెక్ట్. ఇంతకీ ఆయనేం అడిగారు.. ఈయనేం చెప్పారంటే...
భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌లో మంచి ప్రజాదరణ ఉందని చెప్పారు నాఫ్తాలీ బెన్నెట్. అందుకే, మోదీ తమ యామినా పార్టీలో చేరాలని ఇజ్రాయెల్ ప్రధాని ఆహ్వానించారు. మోదీ తమ పార్టీలో చేరితే.. ఆయన ఇమేజ్ కలిసొచ్చి.. తాము ఈజీగా నెగ్గుతామనేది ఆయన భావన. ఇజ్రాయెల్ అధినేత సరదాగానే ఈ ప్రపోజల్ తీసుకొచ్చినా.. ఆ అంశం మోదీకి ఉన్న పాపులారిటీకి, క్రేజ్‌కు నిదర్శనం. ఇండియాలోనే కాదు.. ఏ దేశమేగినా.. మోదీ ఇమేజ్ అదుర్స్..అంటున్నారు.
హైటెక్ పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలపై సహకారాన్ని విస్తరించుకోవడంపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదితో 30 ఏళ్లు పూర్తవుతున్నందువల్ల భారత్ రావాలని బెన్నెట్‌ను మోదీ ఆహ్వానించారు. రెండు దేశాల మధ్య మైత్రిని మోదీ బలోపేతం చేశారని ఇజ్రాయెల్ ప్రధాని కొనియాడారు.
‘‘నేను ఒకప్పుడు హైటెక్ కంపెనీని నడిపేవాడిని. ఆ తర్వాత అమెరికాలోని ఒక భారతీయ కంపెనీలో దాన్ని విలీనం చేశా. అనంతరం ఇరు దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు కలిసి పనిచేసి, అద్భుత ఆవిష్కరణలు చేశారు. మీ నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉంది’’ అంటూ రెండు దేశాల ఆవిష్కర్తల మధ్య అద్భుత సమన్వయం ఉందంటూ స్వీయ అనుభవాన్ని వివరించారు ఇజ్రాయెల్ ప్రధాని.