ఈటల వార్నింగ్.. గవర్నర్‌కు బీజేపీ రిక్వెస్ట్.. టీడీపీపై కేసులు.. టాప్‌న్యూస్ @1pm
posted on Nov 3, 2021 @ 1:10PM
1. హుజురాబాద్‌లో ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల భరతం పడతానని హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. తనను ఓడించేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్ నేతల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానని చెప్పారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసినవారి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. తనను గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. దళిత బంధు వాళ్ల దగ్గరకు ఎందుకు రాలేదో నిలదీస్తానన్నారు.
2. గవర్నర్ అప్రమత్తంగా ఉండకపోతే, ఆయనను.. ఆయన ఉండే ఇంటిని కూడా కూడా తాకట్టు పెట్టేస్తారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. సంతకం పెట్టే ముందు జాగ్రత్తగా చూడాలని గవర్నర్‌కు మనవి చేశారు. రుషికొండలో వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించడానికి సీఎం జగన్‌కి సమయం లేదని విమర్శించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నారన్నారు.
3. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు 48 మంది టీడీపీ కార్యకర్తలపై టెక్కలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మంగళవారం నందిగామలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ఆవిష్కరణ సందర్భంగా... ర్యాలీలో పాల్గొన్న టీడీపీ ముఖ్య నేతలపై టెక్కలి పోలీసులు కేసు పెట్టారు. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన, మోటార్ వాహన చట్టం కింద పలు సెక్షన్లు ఫైల్ చేశారు.
4. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమపై నమోదైన కేసులో సీఆర్పీసీలోని 41 ఎ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రిని దూషించారు అంటూ బోండా ఉమపై గుంటూరు అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై బోండా ఉమ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీలోని 41 ఎ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు.
5. హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌కు కేవలం 3వేల ఓట్లు రావడం పెద్ద షాక్ అన్నారు. కనీసం డిపాజిట్ కూడా రాలేదని, నాన్ లోకల్ వ్యక్తిని అభ్యర్థిగా పెట్టి బలిపశువును చేశారని అన్నారు. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, పొన్నం.. ఇలా కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీలో కాక పుట్టిస్తున్నాయి.
6. వైఎస్ షర్మిల 15వ రోజు ప్రజా ప్రస్థానం పాదయాత్ర నల్లగొండ జిల్లాలో కొనసాగుతోంది. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం కుర్మెడు గ్రామం నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. విరాట్ నగర్ కాలనీ, కూర్మపల్లి, సాయిరెడ్డి గూడెం, మోదుగుల మల్లెపల్లి, పి.కె.మల్లెపల్లి కిష్టారాయనపల్లి వరకూ పాదయాత్ర, మాట ముచ్చట కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు కిష్టారాయనపల్లిలో బస చేయనున్నారు షర్మిల.
7. నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెంలో నగర పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు.. రోడ్లపై గుంటల్లో నిలిచిన వర్షపు నీటిని బురదలో దాటేందుకు సర్కస్ ఫీట్లు చేశారు. రోడ్డు ప్రక్కన నడవలేక, బురద గుంటలు దాటలేక ఎమ్మెల్యేలు పడుతున్న ఇబ్బందులు రోడ్ల దుస్థితికి అద్దం పడుతున్నాయి. తాము నిత్యం పడుతున్న ఇబ్బందులేంటో ఇప్పుడు ఆ నేతలకు తెలిసొచ్చిందంటూ స్థానికులు చర్చించుకున్నారు.
8. కడప జిల్లాలోని వేంపల్లెలో టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి కొంత మంది వ్యక్తులు రాళ్లు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఇన్నోవా వాహనం, ఇంట్లోని వస్తువులను ధ్వంసమయ్యాయి. ఘటనపై బాధితుడు కృష్ణారెడ్డి వేంపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
9. అంతర్రాష్ట్ర సరిహద్దు దగ్గర తెలంగాణ రాష్ట్రం నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.62,280 విలువ చేసే 579 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం సీసాలు అమ్మిన తెలంగాణాకు చెందిన మద్యం షాప్ యాజమనులపై కేసులు నమోదు చేసినట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వర రెడ్డి తెలిపారు.
10. హైదరాబాద్ నార్సింగి పరిధిలో సినీ హీరో నాగ శౌర్య ఫామ్‌హౌజ్‌లో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిన ముఠాలో 29మందికి బెయిల్ మంజూరైంది. వారిలో మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్యతో పాటు పలువురు రియల్టర్‌లు, వ్యాపారులు ఉన్నారు. నిందితులను కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 29మందికి బెయిల్ మంజూరు కాగా.. ప్రధాన నిందితుడు సుమన్‌కు బెయిల్ నిరాకరించింది కోర్టు. సుమన్‌ను రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వగా.. అతన్ని లోతుగా విచారిస్తున్నారు పోలీసులు.