కేసీఆర్ కు మరో గండం.. వేములవాడలో ఏం జరుగునో?
posted on Nov 3, 2021 @ 2:34PM
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం రాగానే తెలంగాణలోమరో ఉప ఎన్నిక రాబోతుందనే చర్చ సాగుతోంది. ఈటల రాజేదంర్ విజయంతో సంబరాలు చేసుకుంటున్న కమలనాధులు.. త్వరలో మరో ఉప ఎన్నిక రావడం ఖాయమని, కేసీఆర్ షాక్ తప్పదని చెబుతున్నారు. దీంతో తెలంగాణలో రాబోయే ఉప ఎన్నిక ఎక్కడన్న చర్చ జనాల్లో నడుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న వేములవాడ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై కోర్టులో కేసు కొనసాగుతోంది. దీనిపై చెన్నమనేని రమేశ్‌కు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అక్కడ మళ్లీ ఉప ఎన్నిక ఖాయం. ఇదే విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.
చెన్నమనేని రమేశ్ పౌరసత్వం కేసు విచారణ హైకోర్టులో జరుగుతోంది. పలు సార్లు వాదనలు జరిగాయి. కేంద్ర హోంశాఖ కూడా కౌంటర్ వేసింది. చెన్నమనేనికి వ్యతిరేకంగా కేంద్రం కౌంటర్ వేయడంతో.. ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోవండ ఖాయమని అంటున్నారు. కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయమూర్తి సైతం తెలంగాణలో మరో ఉప ఎన్నికకు సిద్ధం కావాలని అన్నట్టుగా వ్యాఖ్యానించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని, భారత పౌరసత్వం లేకుండా ఎమ్మెల్యే అయ్యే అవకాశమే లేదని కామెంట్ చేసింది.
హుజురాబాద్ ఫలితం తర్వాత చెన్నమనేని కేసును ప్రస్తావిస్తూ వేములవాడలో ఉప ఎన్నిక రాబోతుందని చెప్పారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. అక్కడ కూడా తామే కచ్చితంగా గెలుస్తామని అన్నారు. సీనియర్ న్యాయవాదిగా ఉన్న రఘునందన్ రావు ఈ విషయం చెప్పడంతో వేములవాడలో ఉప ఎన్నిక ఖాయమే అంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉండే వేములవాడ స్థానానికి ఉప ఎన్నిక వస్తే.. అది కేటీఆర్‌కు పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంటుంది.
2018లో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు తెలంగాణలో నాలుగు సార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, నోముల నర్సింహయ్య మరణంతో దుబ్బాక, నాగార్జునసాగర్, ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో దుబ్బాక, హుజూరాబాద్ స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన దుబ్బాక తమ ఖాతాలో వేసుకున్న బీజేపీ.. తాజాగా హుజూరాబాద్‌లోనూ విజయం సాధించి గులాబీ పార్టీని సవాల్ చేస్తోంది.
అయితే పార్టీకి షాక్ తగిలిన వెంటనే తనదైన శైలిలో వ్యూహాలు రచించి అంతా తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉంటారు కేసీఆర్. దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోవడంతో.. తర్వాత జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై ఫోకస్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని ఓడించేలా ఎత్తుగడలు వేశారు. ఇప్పుడు హుజురాబాద్ లో ఓడిపోవడంతో... వేములవాడ ఉప ఎన్నికపై కేసీఆర్ సీరియస్ వర్క్ చేస్తారని అంటున్నారు. హుజురాబాద్ ఓటమితో గులాబీ పార్టీలో నిస్తేజం అలుముకుంది. పార్టీ లీడర్లు ఢీలా పడ్డారు. దీంతో కేడర్ లో జోష్ నింపే ప్లాన్స్ కేసీఆర్ చేస్తారని, అందుకు వేములవాడను ఉపయోగించుకుంటారని అంటున్నారు. ఎలాగూ చెన్నమనేనిపై కేసు ఉన్నందున.. తీర్పు వచ్చే వరకు ఆగకుండా అతనితో రాజీనామా చేయింది...ఉప ఎన్నిక వచ్చేలా గులాబీ బాసే వ్యూహరచన చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తంగా వేములవాడకు ఉప ఎన్నిక వస్తే మరోసారి తెలంగాణ రాజకీయాలు వేడెక్కనున్నాయి. సీఎం కేసీఆర్, కేటీఆర్ కు సవాల్ గా మారనున్నాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమంటున్న కాంగ్రెస్ కు అత్యంత కీలకంగా మారబోతోంది.