ఈటల గెలుపునకు స్ట్రాంగ్ రీజన్ ఇదే!.. రాజేందర్‌నే రారాజు చేసిన హుజురాబాద్
posted on Nov 2, 2021 @ 6:08PM
హుజురాబాద్ ఈటలకే ఈల కొట్టింది. రాజేందర్‌నే రారాజును చేసింది. కన్నబిడ్డనే కడుపున పెట్టుకుని కాపాడింది. ఈటల రాజేందర్ చావోరేవో తేల్చుకున్నారు. బలమైన శక్తులతో పోరాడి.. రాజకీయంగా గట్టిగా నిలబడి.. విజయం సాధించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో మంచి మెజార్టీతో గెలిచారు. తన గెలుపుతో హుజురాబాద్‌లో తొలిసారి కాషాయ జెండా రెపరెపలాడించారు. అయితే, ఈ విజయం అంత సునాయాసంగా రాలేదు. చాలా కష్టపడ్డారు. చాలా కష్ట పెట్టారు. అనేక కష్ట నష్టాలకు ఓర్చారు. రాజ్యంపై బలంగా పోరాడి.. కసిగా గెలిచి చూపించారు. ఈటల విజయానికి అనేక అంశాలు కలిసొచ్చాయి. కేసీఆర్‌పై వ్యతిరేకతతో పాటు ఈటలపై అభిమానమూ ఈ విజయానికి కారణమయ్యాయి.
ఈటల గెలుపునకు ప్రధాన కారణం ఆయనపై వెల్లువెత్తిన సానుభూతి. చంపుకుంటారో.. సాధుకుంటారో మీ ఇష్టం అంటూ ప్రజలను వేడుకున్నారు ఈటల. తమ బిడ్డకు ఎంత కష్టం వచ్చిందంటూ.. ఇంత కష్టం తీసుకొచ్చారంటూ.. జనాలు ఈటలపై సానుభూతి కురిపించారు. సొంతబిడ్డను కడుపులో పెట్టుకొని.. గెలిపించారు. ఈటలను ఒంటరి చేసేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలన్నిటినీ చూసిన హుజురాబాద్ అసహ్యించుకుంది. ఈటల సైతం పోకడలకు పోకుండా.. సింపుల్‌గా ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. తాను మాత్రమే మీవాడినని.. మీలో ఒకడని.. తనను గెలిపించుకునే బాధ్యత మీదేనంటూ.. మనం మనం హుజురాబాద్ సెంటిమెంట్ రాజేశారు. అది బాగా ప్రభావం చూపింది అంటున్నారు. ఈటల మనోడు.. కేసీఆర్ కుట్రలకు బలైనోడు అంటూ.. జనమంతా రాజేందర్‌ను అక్కున చేర్చుకున్నారు. ఓట్లేసి గెలిపించుకున్నారు. కేసీఆర్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.
ఈటలకు టీఆర్ఎస్ అంటించిన అవినీతి మకిలి తేలిపోయింది. ఈటల అవినీతి చేసి ఉంటే ఇన్నాళ్లు ఎందుకు చర్యలు తీసుకోలేదన్న దానికి టీఆర్ఎస్ నుంచి సమాధానం లేదు. పార్టీలో కొందరి పెత్తనాన్ని సహించలేక ప్రశ్నించడం వల్లనే ఈటలను టార్గెట్ చేశారని భావించారు. టీఆర్ఎస్ నేతలంతా ఈటలపై మూకుమ్మడిగా మాటల దాడి చేయడంతో ఆయన ఒంటరివారయ్యారనే సానుభూతి కలిగేలా చేసింది. అందుకే పథకాలు, పైసలతో ప్రలోభ పెట్టినా హుజూరాబాద్ ప్రజలు ఈటల వెంటే నిలిచారు.. గెలిపించుకున్నారు.