మా తిండి ఖర్చు ఇంతే.. మంత్రిపై వాంఖడే భార్య సెటైర్లు..
posted on Nov 3, 2021 @ 2:42PM
మరాఠా రాజకీయం రంజుగా సాగుతోంది. డ్రగ్స్ కేసులో షారుక్‌ఖాన్ కొడుకు ఆర్యన్‌ఖాన్ అరెస్ట్ ఎపిసోడ్ పొలిటికల్‌గా కాక రేపుతోంది. ఎన్‌సీబీ వర్సెస్ మహారాష్ట్ర సర్కార్‌గా వివాదం మలుపు తిరిగింది. తమ ప్రభుత్వాన్ని బద్నామ్ చేసి.. ముంబై ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.. ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
పలువురిపై తప్పుడు కేసులు బనాయించి సమీర్ వాంఖడే కోట్లకు పడగలెత్తాడని మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. వాంఖడే 70 వేల విలువైన చొక్కా, లక్ష విలువైన ట్రౌజర్, లక్షల విలువ చేసే చేతి గడియారాలు ధరిస్తున్నాడని కామెంట్ చేశారు. అయితే ఆ ఆరోపణలను సమీర్ వాంఖడే కొట్టిపారేశారు. ఆయనకు వాటి గురించి పెద్దగా తెలిసుండదని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.
తాజాగా, వాంఖడే తరఫున ఆయన భార్య క్రాంతి రేడ్కర్ సైతం రంగంలోకి దిగారు. సమీర్‌కు సెటైరికల్‌గా కౌంటర్లు వేశారు. తాము తిన్న లంచ్ ఖరీదు ఇంతా అంటూ ఫోటోలతో సహా డీటైల్స్ వెల్లడించారు. మళ్లీ రేపు ఎప్పుడైనా తాము తినే తిండి గురించి ఎవరూ వ్యాఖ్యలు చేయకుండా ఆధారాలతో సహా ఈ ట్వీట్ చేస్తున్నానన్నారు వాంఖడే భార్య రేడ్కర్.
‘మేం ఈ రోజు మధ్యాహ్న భోజనంలో దాల్ మఖ్నీ, జీరా రైస్ తీసుకున్నాం. జీరా రైస్ ఇంట్లో తయారు చేసిందే. దాల్ మఖ్నీ బయటనుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం. దాని ధర రూ.190. మళ్లీ భవిష్యత్తులో ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారికి సాధ్యంకాని రీతిలో మేం ఆహారానికి ఖర్చు చేస్తున్నాం అనొచ్చు. అందుకే ఆధారాలతో సహా వెల్లడిస్తున్నాను’ అని ట్విటర్‌లో క్రాంతి రేడ్కర్ పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.