ఏపీకి చంద్రబాబే దిక్కు.. డీఎల్ రవీంద్రారెడ్డి

ఏపీకి చంద్రబాబే దిక్కు అంటూ వైసీపీ నాయకుడొకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గానికీ, జగన్ సొంత జిల్లాకు చెందిన ఆ నాయకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుత అస్తవ్యస్థ పరిస్థితి నుంచి ఏపీని గట్టెక్కించాలంటే చంద్రబాబే దిక్కు.. ఈ మాట అన్నది ఏ తెలుగుదేశం నాయకుడో కాదు.. సాక్షాత్తూ వైసీపీ నేత. రాయలసీమలో గుర్తింపు ఉన్న నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి. ఔను డీఎల్ రవీందరారెడ్డి బుధవారం (డిసెంబర్ 21) కడపలో మీడియా సమావేశం పెట్టి మరీ సొంత పార్టీపైనా, పార్టీ అధినేతపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ పై విమర్శించడానికి ఆయన ఎంచుకున్న భాష.. వైసీపీ నాయకులలో వస్తున్న మార్పునకు తార్కానంగా చెప్పుకోవచ్చు. ఎక్కడా పరిధి మీరకుండానే జగన్ అవినీతిని ఎండగట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడని అనుకోలేదని సున్నితంగానే అయినా నషాళానికి అంటేలా ఘాటుగా విమర్శించారు. ఇంత విమర్శలు గుప్పిస్తున్న తనను పార్టీ నుంచి బహిష్కరించడం వల్లే తాను ఇలా విమర్శలు గుప్పిస్తున్నానని అనుకుంటారో ఏమో అన్నట్లుగా తాను ఇప్పటికీ వైసీపీలోనే ఉన్నానని, వాళ్లేం తనను పార్టీ నుంచి తీసేయలేదనీ స్పష్టత ఇచ్చారు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచీ అవినీతి పాలనే సాగిస్తున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ   వచ్చే  ఎన్నికలలో సింగిల్ డిజిట్ స్థానాలలోనే గెలుస్తుందని జోస్యం చెప్పారు. 2019 ఎన్నికలకు ముందు తన ఇంటికి మనుషులను పంపి బతిమాలి పార్టీలో చేర్చుకున్నారని రివీల్ చేసిన డీఎల్ రవీంద్రారెడ్డి.. .జగన్ పాలన అవినీతి మయం అన్నారు. ఈ పార్టీలో ఉన్నందుకు తన మీద తనకే అసహ్యం వేస్తోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు తప్ప మరెవరూ రాష్ట్రాన్ని కాపాడలేరని డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఒంటరి పోరు సాగిస్తున్న డాక్టర్ సునీత ధైర్యాన్ని అభినందించాల్సిందే అన్నారు. జనవరి 3 నుంచీ వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మార్పులు ఉంటాయని అన్నారు. గత ఎన్నికల ముందు తనను బతిమలాడి జగన్ పార్టీలో చేర్చుకున్నారనీ, ఆ సందర్బంగా ఎంతో ఆదర్శవంతంగా మాట్లాడారనీ డీఎల్ వివరించారు. తనకు తండ్రిని మించిన పేరు తెచ్చుకోవాలన్న ఆకాంక్ష తప్ప మరే కోరికలూ లేవని జగన్ అన్నారనీ, కానీ పాలన మొదలు పెట్టిన క్షణం నుంచీ జగన్ పాలన అంతా అవినీతేనని డీఎల్ విమర్శించారు. జనసేనాని నిజాయితీ పరుడే కానీ పాలనాదక్షత ఉందని తాను భావించడం లేదన్నారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు కలిసి పని చేస్తే ఏపీకి మేలు జరుగుతుందన్నారు. 

నా కంటే పెద్ద మూర్ఖుడెవరు?.. ఎలాన్ మస్క్

ట్విట్టర్ సీఈవోగా తాను ఉండాలా? వద్దా అంటూ ఎలాన్ మస్క్ నిర్వహించిన పోల్ లో అత్యధికులు ఆయన సీఈవోగాతప్పుకోవాలని ఓటేశారు. దీంతో హతాశుడైన మస్క్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టడానికి నా కంటే మూర్ఖుడెవరైనా దొరకాలిగా.. దొరకగానే తప్పుకుంటానంటూ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ సీఈవోగా తాను తప్పుకునే ప్రశక్తే లేదని చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మస్క్ కంటే మూర్ఖుడు దొరికే అవకాశమే లేదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏ ముహూర్తాన ట్విట్టర్ పగ్గాలు తీసుకున్నాడో ఆ క్షణం నుంచీ అత్యంత వివాదాస్పదుడిగా మారిపోయాడు. కేవలం టెస్లా అధినేతగా ఉన్నంత కాలం ఎలాన్ మస్క్ విషయంలో ఎలాంటి వివాదాలూ లేవు. కానీ ఎప్పుడైతే ట్విట్టర్ పగ్గాలు అందుకున్నాడో ఆ క్షణం నుంచీ ప్రపంచంలో అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామిక వేత్తగా మారిపోయాడు. ట్విట్లర్ లో వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం నుంచీ ట్వీట్టర్ విధానాలలో మార్పులు చేయడం వరకూ, తన విధానాలను వ్యతిరేకించే జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ నుంచి తొలగించడం నుంచి.. ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతుందని ప్రకటించడం వరకూ ఎలాన్ మస్క్ ప్రతి చర్యా, ప్రతి అడుగూ వివాదాస్పదంగానే తయారైంది. అయితే తాజాగా ట్విటర్  వ్యవహారాలపై తనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండటంతో  ఎలాన్ మస్క్ అంతర్మథనంలో పడ్డారు. ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న మీమాంశలో పడ్డారు. తాను ట్వట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అంటే ట్విట్టర్ లో ఓ పోల్ పెట్టాడు. అందులో 58 శాతానికి పైగా ఎలాన్ మస్క్ వైదొలగాలనే ఓటు చేశారు. ఓ 42 శాతం మంది మాత్రం ఎలాన్ మస్క్ కు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఎలాన్ మస్క్ కొత్త సీఈవో తన కొంటే మూర్ఖుడు అయి ఉండాలని పేర్కొంటూ.. సీఈవోగా వైదలగడం లేదని స్పష్టం చేశాడు. 

రాహుల్ భారత్ జోడో యాత్రకు కోవిడ్ ప్రొటోకాల్..కేంద్రం హుకుం

కరోనా మహమ్మారి విజృంభణ ప్రపంచంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్త అందరిలోనూ భయాందోళనలను రేకెత్తించింది నిజమే. రాష్ట్రాలకు కేంద్రం కరోనా విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించింది. అదే సమయంలో భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగే అవకాశాలు తక్కువే అని ధైర్యమూ చెప్పింది. అయితే సక్సెస్ ఫుల్ గా జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విషయంలో మాత్రం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ప్రొటో కాల్ పాటించేటట్లయితే మాత్రమే యాత్రను కొనసాగించాలనీ, లేకుండా యాత్ర వాయిదా వేసుకోవాలనీ సూచన ప్రాయమైన హెచ్చరిక చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్ సుక్ మాండవీయ ఈ మేరకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు లేఖ రాశారు. ఆ లేఖలో యాత్రలో పాల్గొనే వారంతా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిండం, శానిటైజర్లు వాడటం వంటికి తప్పని సరి అని పేర్కొన్నారు. అలాగే ప్రికాషనరీ డోస్ తో సహా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు మాత్రమే యాత్రలో పాల్గొనాలని కండీషన్ పెట్టింది. అలా చేయడం కుదరదనుకుంటే యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఈ లేఖపై కాంగ్రెస్ భగ్గు మంది. రాహుల్ భారత్ జోడో యాత్రకు విశేష జనస్పందన లభిస్తుండటం.. ఒకరి తరువాత ఒకరుగా సెలబ్రిటీలు ఆయనతో అడుగులు కలపడంతో కేంద్ర ప్రభుత్వం  రాహుల్ యాత్ర విషయంలో అప్రమత్తమైంది. ప్రధాని మోడీయే స్వయంగా కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయవద్దని పార్టీ శ్రేణులను హెచ్చరించారు కూడా.  ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో కరోనా వ్యాప్తి సాకుగా తీసుకుని కేంద్రం రాహుల్ యాత్రపై ఆంక్షలు విధిస్తోందని విమర్శించింది.   ఇతర పబ్లిక్ ప్లేసుల్లో, సమావేశాల్లో ఏ ప్రొటోకాల్ రూల్స్ అమలవుతున్నాయని ప్రశ్నించింది. ఉన్నట్లుండి కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విషయంలోనే ప్రొటోకాల్ రూల్స్ గుర్తొచ్చాయా అని నిలదీసింది. . గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ చేపట్టిన ర్యాలీలు, సభల్లో కోవిడ్ ప్రొటోకాల్ ఫాలో అయ్యారా? రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు వస్తున్న స్పందన చూడలేకే కేంద్ర మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

మాస్కులతో ముఖాన్ని దాచుకోవలసిందేనా?

ప్రపంచ దేశాల్లో కరోనా విలవతాండవం మళ్లీ మొదలైంది. రెండున్నరేళ్లు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చైనా, జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్ దేశాల్లో కరోనా వైరస్  విజృంభిస్తుండడం మిగతా దేశాల గుండెల్లో గుబులు రేపుతోంది. మరోవైపు నిపుణులు.. కరోనా ఫోర్త్ వేవ్ కు ఇవి సంకేతాలంటున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు ఏ వేరియంట్ కు చెందినవో తెలుసుకోవాలని తెలిపింది. కరోనా పరీక్షల శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తాజా నివేదికల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వారానికి 35 లక్షల కరోనా కేసులు నమోదవుతుండటం.. మాయదారి మహమ్మారి ముప్పు ఇంకా తొలపోలేదనేందుకు అద్దంపడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. అందుకే కరోనా టెస్టుల శాంపిళ్లను ముందుగానే జీనోమ్ సీక్వెన్సింగ్ వల్ల కొత్త వేరియంట్ల ఉనికిని ప్రారంభంలోనే గుర్తించవచ్చని, తద్వారా అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న పరిస్థితులు భారత్ లో ఉండబోవని ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ గులేరియా అభిప్రాయపడ్డారు.  ఇలా ఉండగా ప్రపంచంలో కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుక్ మాండవీయ బుధవారం (డిసెబర్21) దేశంలో కోవిడ్ పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దేశంలో కోవిడ్ విజృంభించకుండా తీసుకోవలసిన చర్యలపై సమీక్షించారు. కొన్ని దేశాలలో కోవిడ్ వ్యాప్తి ఒక్క సరిగా పెరిగిన నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వారంతా మాస్కులు ధరించి హాజరు కావడం విశేషం. ఉన్నత స్థయి సమావేశంలో అందరూ మాస్కులు ధరించి ఉండటం చూస్తుంటే దేశం మరోసారి లాక్ డౌన్ కి సిద్ధపడాలా, లేక మళ్లీ మాస్కులు ధరించక తప్పని పరిస్థితులు ఎదురు కానున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

ఎర్రబెల్లి, ఉత్తమ్ రహస్య భేటీ మర్మమేమిటి?

తెలంగాణ రాజకీయాలలో తెరవెనుక డీల్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఒక వైపు తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షొభం తారస్థాయిలో ఉన్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకుడు టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత, మంత్రిఎర్రబెల్లి దయాకరరావుతో రహస్యంగా భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల కిందట  మునుగోడులో ఓ వివాహ వేడుకకు హాజరైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ ఏకాంతంగా దాదాపు మూడు గంటల పాటు భేటీ అయ్యారు. ఈ విషయాన్ని  గమనించిన కొందరికి వారు తమ భేటీ గురించి ఎక్కడా ప్రస్తావించవద్దని గట్టిగా హెచ్చరించినట్లు చెబుతున్నారు. ఇంత రహస్యంగా  అన్ని గంటల పాటు భేటీ అవ్వడం వెనుక మతలబేంటన్న సందేహాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా.. ఢిల్లీ నుంచి హుటాహుటిన  వచ్చిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా వివాహ వేడుకకు హాజరై, అక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుతో భేటీ అయ్యారు. భేటీ పూర్తి కాగానే నేరుగా హస్తినకు బయలుదేరి వెళ్లిపోయారు. ఎర్రబెల్లి, ఉత్తమ భేటీ జరుగుతున్న సమయంలోనే టీపీసీసీ భేటీ జరుగుతుండటం గమనార్హం. ఈ రహస్య భేటీ నేపథ్యంలోనే గతంలో ఉత్తమ్ కుమార్  రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరి స్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతిని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనే ఉత్తమ్ కుమార్ పై కేసీఆర్ కోవర్ట్ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఉత్తమ్ కుమార్ రహస్యంగా భేటీ అయిన ఎర్రబెల్లి దయాకరరావుపై కూడా గతంలో అంటే ఆయన తెలుగుదేశం తెలంగాణ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్న సమయంలో కేసీఆర్ కోవర్ట్ గా పని చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఆయన టీడీఎల్పీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే2014 ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలు మిత్ర పక్షాలుగా పోటీలోకి దిగాయి. ఆ ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీ కూటమి పరాజయం పాలైంది. గెలవాల్సిన స్థానాలలో కూడా కూటమి అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. అయితే ఇందుకు పొత్తలో భాగంగా సీట్ల పంపకాలలో జరిగిన పొరపాట్లే ఆ ఓటమికి కారణమని అప్పట్లో తెలుగుదుశం, బీజేపీలు భావించాయి. అయితే టీడీఎల్పీ నేతగా అప్పట్లో ఎర్రబెల్లి ఇరు పార్టీలనూ మిస్ గైడ్ చేసి బీజేపీకి బలం ఉన్న స్థానాలలో తెలుగుదేశం అభ్యర్థులు, తెలుగుదేశానికి బలం ఉన్న స్థానాలలో బీజేపీ అభ్యర్థులను రంగంలోకి దింపేలా చేశారని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎర్రబెల్లి కేసీఆర్ కోవర్టుగా పని చేశారని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆ తరువాత ఎర్రబెల్లి తెలుగుదేశంను వీడి.. గులాబి గూటికి చేరడం.. కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం తెలిసిందే. ఆ విధంగా కేసీఆర్ ఎర్రబెల్లి చేసిన ఉపకారానికి మంత్రిపదవితో బదులు తీర్చుకున్నారన్నమాట. ఇప్పుడు ఎర్రబెల్లి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రహస్య భేటీతో నాడు ఇరువురూ కేసీఆర్ కు కోవర్ట్ లుగా పని చేశారన్న విషయాలను గుర్తు చేస్తూ ఈ భేటీ వెనక మర్మమేమిటన్న చర్చ జరోందుకుంది. కాంగ్రెస్ సంక్షోభ సమయంలో అదును చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోంది. 

పలుకే బంగారమాయెనా.. అనుమానాలకు తావిస్తున్న కేసీఆర్ మౌనం

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కేసీఆర్ పలుకే బంగారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మౌనం పలు అనుమానాలకు తావిస్తున్నదన్నచర్చరాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ ప్రస్తావిస్తూ కేసీఆర్ నోరు విప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును ఈడీ చార్జి షీట్ లో 18 సార్లు ప్రస్తావించిందనీ, అసలు హస్తినలోని ఒబెరాయ్ హోటల్ లో కవిత మీటింగ్ ల మతలబు ఏమిటో బయటపెట్టాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. ఈ కేసులో నిందితుడు సమీర్  మహేంద్రుతో కవిత లావాదేవీలేమిటన్నవీ వెలుగులోకి రావాలన్నారు. తెలంగాణలో మొదలైన కల్వకుంట్ల కుటుంబం అవినీతి హస్తన వరకూ విస్తరించిందనడానికి డిల్లీ కుంభకోణంలో కవిత ప్రమేయంపై బయటపడుతున్న వాస్తవాలే నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వాస్తవాలు బయటపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ పై దర్యాప్తు తరహాలో తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీ పైనా దర్యాప్తు జరగాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.   కవిత ఎందుకు అన్ని ఫోన్లు ధ్వంసం చేశారన్న ప్రశ్నా తలెత్తుతోంది. మాఫియా తరహాలో ఫోన్లు మార్చడం, ధ్వంసం చేయడం లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయానికి తిరుగులేని నిదర్శనం అన్న నమ్మకం అందరిలోనూ బలపడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

కవితదే ఇండో స్పిరిట్ కంపెనీ!?

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు ఇరుక్కున్నారా? ఈ కేసులో  దాఖలు  చేసిన చార్జిషీట్ లోదాఖలు చేసిన తాజా చార్జిషీట్‌లో ఈడీ ఈ విషయమే వెల్లడించింది.  ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిన ఇండో స్పిరిట్ కంపెనీకి   కల్వకుంట్ల కవితే ఓనర్ అని చార్జిషీట్ లో ఈడీ పేర్కొంది. మొత్తంగా ఈడీ తాజా చార్జ్ షీట్ లో కవిత పేరును 28 సార్లు పేర్కొంది.  శరత్ రెడ్డి, మాగుంట రాఘవ్ రెడ్డితో కలిసి కవిత లిక్కర్ వ్యాపారం చేశారని వివరించింది. ఈ వ్యాపారానికి అరుణ్ రామచంద్ర పిళ్లైను కవిత బినామీగా పెట్టుకున్నారని పేర్కొంది. ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జ్‌షీట్లో 28 సార్లు కవిత పేరును ప్రస్తావనకు వచ్చింది. కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూప్ దే ఈ కుంభకోణంలో  కీలక  పాత్ర అని ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దినేష్ అరోరా వాంగ్మూలం మేరకు హైదరాబాద్, ఢిల్లీ స్టార్ హోటళ్లలో పలుమార్లు సమావేశాలు జరిగాయి. కవిత పలుమార్లు ఫేస్ టైమ్ ద్వారా నిందితులతో మాట్లాడి కలసి వ్యాపారం చేస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సమీర్ మహేంద్ర కవితను ఆమె నివాసంలో కలిసి చర్చలు కూడా జరిపారని ఈడీ చార్జ్ షీట్ లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దక్షిణాది నుంచి ఆప్ కి చెందిన కొందరు నేతలకు హవాలా మార్గంలో ముడుపులు అందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పేర్కొంది.  ఓ వైపు సీబీఐ, మరో వైపు ఈడీ కేసులతో కల్వికుంట్ల  కవిత చిక్కుల్లో పడ్డారని న్యాయనిపుణులు పేర్కొన్నారు. ఈడీ తాజా చార్జిషీట్ ను బట్టి ఆమెను నిందితురాలిగా పేర్కొని అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. 

ఆరు రాష్ట్రాలలో బీఆర్ఎస్?

కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలో తన కార్యకలాపాలను విస్తరించడానికి ప్రణాళికలు, కార్యాచరణ సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించాలన్న వ్యూహంలో భాగంగా ముందుగా ఆరు రాష్ట్రాలను ఎంపిక చేసుకుంది.   ఇందు కోసం ముందుగా ఆ ఆరు  రాష్ట్రాలలోనూ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ బీఆర్ఎస్ కిసాన్ సమితిని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముందుగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ లలో బీఆర్ఎస్ కిసాన్ సెల్ లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ సారి రైతు రాజ్యం అన్ననినాదంతో ముందుకు పోవాలని అధికారికంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన నాడే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకే ఏపీ సహా ఆరు రాష్ట్రాలలో బీఆర్ఎస్ తన కార్యకలాపాలను విస్తరించ నుంది. ఏపీ సహా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా రాష్ట్రాలలో క్రిస్మస్ తరువాత ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ కిసాన్ సెల్ లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  

దిగ్విజయ్.. ట్రబుల్ షూట్ చేయగలరా?.. రాష్ట్ర కాంగ్రెస్ ను గాడిన పెట్టగలరా?

తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతోంది. ఇందుకు ప్రధాన కారణం పార్టీలో సీనియర్లమంటూ పెత్తనం చెలాయిస్తున్న వారే అని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఇంత కాలం పదవులు అనుభవించిన సీనియర్లు తరువాతి తరం నాయకత్వానికి స్వాగతం పలకడం లేదు సరికదా.. అడుగడుగునా అడ్డుపడుతున్నారు. దీంతో సహజంగానే పార్టీలో సీనియర్లు.. జూనియర్ల మధ్యా గ్యాప్ బాగా పెరిగిపోయింది. పెరిగి పోయింది అనడం కంటే ఇరువురి మధ్యా  అగాధం ఏర్పడింది అని చెప్పవచ్చు. యువ నాయకత్వాన్ని స్వాగతించలేక పోవడంతోనే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లోని సంక్షోభానికి కారణం. యువనాయకత్వానికి వ్యతిరేకొంగా గ్రూపులు కట్టి పార్టీలో చిచ్చుకు కారణమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నుంచీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమి నుంచి ఓటమి అన్నట్లు..దిన దినం దిగజారిపోతోంది.  రాష్ట్రంలో పార్టీ బలంగా మారేందుకు అన్ని అవకాశాలు ఉన్నా.. పార్టీలో కుమ్ములాటలతో ప్రజలలో పార్టీ  చులకన అవుతోంది.   తెలంగాణ కాంగ్రెస్ సారధిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత  పార్టీ ఒకింత పుంజుకుందన్న  మాట ఎవరూ కాదనలేరు. అయితే  అది ఎన్నికలో విజయం రూపంలో ఫలితం వచ్చేందుకు అవకాశం  లేకుండా పార్టీలో అంతర్గత విభేదాలు, రచ్చకెక్కి విమర్శలతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందా అన్నట్లు తయారైంది. ఇక తాజాగా పీసీసీ కమిటీల నియామకం వ్యవహారంలో పార్టీ సీనియర్లు బహిరంగంగా రేవంత్ పై తిరుగు బావుటా ఎగురు వేశారు. ఇందుకు ప్రతిగా రేవంత్ వర్గీయులు కూడా రాజీనామా ఆస్త్రాలు సంధించడంతో హై కమాండ్ రంగంలోకి దిగక తప్పని అనివార్యత ఏర్పడింది. అయితే పార్టీలో యువ రక్తాన్ని నింపాల్సిన అవసరం గురించి పదేపదే చెబుతూ వస్తున్న పార్టీ అధిష్ఠానం తెలంగాణలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడానికి మాత్రం వృద్ధ నేతనే పంపించింది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో దిగ్విజయ్ సింగ్ వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ కాంగ్రెస్ లోని ఒక వర్గం అసంతృప్తిగానే ఉంది. అప్పటికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ వలనే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అన్న విషయాన్ని ప్రజలకు బలంగా చెప్పడంలో విఫలమయ్యామని పలు సందర్భాలలో వీహెచ్ వంటి నాయకులు బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు పార్టీలో సంక్షోభ నివారణకు దిగ్గిరాజేనే హైకమాండ్ పంపడంతో ఆయన సీనియర్లను ఎంత వరకూ సముదాయించగలరన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అంతే కాకుండా డిగ్గి రాజా ఇప్పటి వరకూ యువ నేతలకు ప్రోత్సాహం ఇచ్చిన దాఖలాలు లేవు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో యువ నేతలు తిరుగు బావుటా ఎగుర వేసిన సందర్భాన్ని ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో అటు సీనియర్లకు, ఇటు జూనియర్లకూ సమ్మతం లేని దిగ్గిరాజాను అధిష్టానం దూతగా పంపడంతో ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దగలుగుతారా అన్నఅనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. 

175 ఔటాఫ్ 175.. జగన్ ధీమా వెనుక ఆ రెండే..!

175 అవుటాఫ్ 175 అంటూ ఎన్నికలకు సిద్ధమౌతున్న ఏపీ సీఎం జగన్ ది పగటి కల అనాలో, అతి విశ్వాసం అనాలో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సారి ఎన్నికలలో రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు 175 స్థానాలనూ మనమే గెలవాలి, ఆ అవకాశం మనకు మాత్రమే ఉంది.. అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ శ్రేణులను ఊదరగొట్టేస్తున్నజగన్ అందుకోసం ఎమ్మెల్యేలకు నిర్దేశించిన కార్యాచరణ ఏదైనా ఉందంటే.. అది గడప గడపకూ మాత్రమే. ఆ ఒక్క కార్యక్రమం మీరు ప్రజలెంత ఈసడించుకున్నా..వ్యితిరేకించినా, ముఖం మీదే తలుపులేసినా లెక్క చేయకుండా పూర్తి చేయండి. ప్రతి గడపకూ మీరు వెళ్లండి.. మిగిలినదంతా నేను చూసుకుంటాను అంటున్నారు.  అయితే   గడపగడప కార్యక్రమానికి వస్తున్న స్పందనతో ఎమ్మెల్యే, మంత్రులు మాత్రం తమ ఇంటి గడప దాటడానికే జంకు తున్నారు. పొరపాటున ఎవరైనా వెళ్లినా మంత్రులు, ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా   ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ముఖం మీదే ఇంటి తలుపులు వేసేస్తున్నారు. మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇలా రాష్ట్రం మొత్తం ప్రభుత్వ వ్యతిరేకతే కనిపిస్తున్నది. పాపం ఎమ్మెల్యేలు, మంత్రులకు ప్రజల నుంచి తాము ఎదుర్కొంటున్ నిరసన గురించి చెప్పుకునే అవకావంకూడా లేదు. ఎందుకంటే 175 అవుటాఫ్ 175 గ్యారంటీ అన్న ధీమాతో ఉన్న జనగ్ చెప్పడమే తప్ప  వినడమన్నది మానేసి చాలా కాలమైంది. పరిస్థితి చూసిన చాలా మంది వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికలు పార్టీకి గండమేనని భావిస్తున్నారు. అంతర్గత సంభాషణల్లో ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు.   ఇంతకీ ప్రజలలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నా.. జగన్ గెలుపు ధీమాతో ఎలా ఉండగలుగుతున్నారు. ఆయన ధీమా వేనుక, ధైర్యం వెనుక ఉన్నదేమిటి? అంటే రెండే కారణాలు.  ఔను ఎవరు ఔనన్నా మూడు రాజధానులు, బటన్ నొక్కి అమలు చేస్తున్న సంక్షేమం. వచ్చే ఎన్నికలలో ఈ రెండింటినే ఆయన తన గెలుపు మంత్రాలుగా నమ్ముతున్నారు. అందుకే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ వ్యతిరేకిస్తున్నా.. జనం అమరావతే రాజధానిగా ఉండాలని నినదిస్తున్నా  జగన్ లెక్క చేయకుండా మొండిగా మూడు రాజధానులంటూ ముందుకు సాగుతున్నారు. ఇక సంక్షేమం పేర రాష్ట్రాన్నిఆర్థిక సంక్షోభంలో నెట్టేసి, ఉద్యోగులకు వేతనాలు సైతం సమయానికి ఇవ్వకుండా, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఉచిత పథకాలను కొనసాగిస్తూ విజయం తథ్యమన్న కలల లోకంలో విహరిస్తున్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరే విషయంలో  వాలంటీర్లు, అతి చేస్తున్నా కూడా జగన్ పట్టించుకోవడం లేదు. ఇక హేతు రహితంగా జగన్ సాగిస్తున్న సంక్షేమ రాజకీయం రాష్ట్రానికి చేస్తున్న చేటును ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు.  ఒక్కొక్కరికి ఇంత లెక్కన అందరికీ డబ్బు పంచుతున్నాను..  ఓటెందుకు వేయరని తన పార్టీ నాయకులనే కాదు ప్రజలనూ దబాయిస్తున్నారు.  ‘సంక్షేమమే’  వచ్చే ఎన్నికలలో గెలుపు తీరాలకి చేర్చుతుందని నమ్ముతున్నారు.  మూడు రాజధానులు..   రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు రాజధాని తెస్తా అంటుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ప్రచారం చేసుకోవడం ద్వారా మూడు ప్రాంతాలలోనూ జనం తన వెనుకే ఉంటారన్నది జనగ్ భావనగా కనిపిస్తోంది.  అయితే జగన్ మూడు రాజధానుల అస్త్రం బూమరాంగ్ అయిన సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. ఈ రెంటి మీద నమ్మకం పెట్టుకుని ఎన్నికలకు సమాయత్తమౌతున్న జగన్ ను ఇవి రెండు..కేవలం ఇవి రెండూ మాత్రమే గట్టెక్కిస్తాయా? అంటే ఔనని తలూపడం కష్టం. 

ఈడీ చార్జి షీట్ లో 22 సార్లు కవిత పేరు

దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ తాజా  సమర్పించిన చార్జిషీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కనీసం 22 సార్లు ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగిసినట్లేనని న్యాయ నిపుణులు  అంటున్నారు. తొలుత ఈ లిక్కర్ స్కాం లో కవిత ప్రమేయంపై ఆరోపణలు మాత్రమే అనుకున్నారు. కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలు దూకుడు పెంచిన తరువాత ఈ కేసులో కవిత పాత్ర కీలకమన్న విషయం వెలుగులోకి వస్తోంది. తొలుత ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎంత మాత్రం సంబంధం లేదంటూ బల్ల గుద్ది మరీ చెప్పిన కవిత.. దర్యాప్తు సాగుతున్నకొద్దీ ఆమె మాటల్లో మునుపటి ధీమా కనిపించడం లేదు.   చీటికీ మాటికీ  ప్రగతి భవన్ కు వెళ్లి ఈ కేసు విషయంలో న్యాయనిపుణులతో సంప్రదించడం, తండ్రితో మంతనాలు జరపడంతో కేసు కవితకు ఉచ్చు బిగించిందన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఈడీ తాజా చార్జి షీట్ తో ఆ విషయం  నిర్ధారణ అయినట్లేనని చెప్పవచ్చు. ఈ కేసులో ఈడీ తాజా ఛార్జిషీట్‌లో కీలక విషయాలను ప్రస్తావించింది. ఇండోస్పిరిట్స్ సంస్థ అసలు భాగస్వాములు కవిత,  మాగుంట రాఘవ్ రెడ్డిలేనని , ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. దిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్‌ ఆద్మీ పార్టీతో పాటు అత్యధికంగా లబ్ధి పొందిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఒకరు అని ఈడీ పేర్కొంది.  సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఈ ఛార్జి షీట్లో కవితతోపాటుగా వైసీపీ ఎంపీ మాగుంట శీనివాస్ రెడ్డి, అతడి కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పాత్రలను చెప్పింది. అయితే ఈ కేసులో బోయినపల్లి అభిషేక్‌, బుచ్చిబాబు, అరుణ్‌పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగానే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్టు కోర్టుకు తెలిపింది. ఛార్జిషీట్ ప్రకారం.., కవిత నేరుగా దిల్లీలోని స్టార్ హోటళ్లలో, హైదరాబాద్‌లోని తన నివాసంలో లేదా కాల్స్ ద్వారా వారిని కలుసుకోవడం ద్వారా నిరంతరం టచ్‌లో ఉన్నారని ఈడీ పేర్కొంది. సాక్ష్యాలను చెరిపేసేందుకు దాదాపు డజను మొబైల్ ఫోన్‌లను కవిత ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

టికెట్ల కోసం ఎమ్మెల్యేల నుంచి జగన్ సొమ్ములు వసూలు!

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరగడం  ఖాయమని వైసీపీ రెబల్ ఎంపి  రఘురామకృష్ణం రాజు అన్నారు . కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటు, లేదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కలిసి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయన్నారు.  2024 లో పార్లమెంట్ ఎన్నికల తో పాటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు దాదాపు మృగ్యమన్నారు. .   రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మూమూలుగా అయితే ఎంపీలను, ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్ చులకనగా చూస్తారనీ, వారికి ఇసుమంతైనా గౌరవం ఇవ్వరనీ, అయితే ముందస్తు ఎన్నికలు తరుముకు వస్తున్నాయి కనుక  ఎమ్మెల్యేలకు ఇప్పుడు కాసింత గౌరవం ఇచ్చి సమీక్షలు నిర్వహిస్తున్నారని రఘురామ కృష్ణం రాజు అన్నారు.  అంతే కాకుండా ఎన్నికల నిమిత్తం జగన్ రెడ్డి ఎమ్మెల్యేలను కొంత మొత్తం ఇవ్వాలని కోరుతున్నట్లు తన  వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్న వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం జగన్ కోరిన విధంగా సొమ్ము ఇచ్చేందుకు సుముఖంగా లేరన్నారు. సొమ్ము ముట్ట చెప్పి టికెట్లు తెచ్చుకున్నా గెలిచే అవకాశాలు లేవని ఎమ్మెల్యేలకు ఇప్పటికూ పూర్తిగా అర్ధం కావడమే కారణమన్నారు.  జగన్ రెడ్డి గృహ సారథులు పేరిట గృహ హింసకులను రంగంలోకి దింపుతున్నారని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ను నియమించిన జగన్ సర్కార్ వారికి అదనంగా మరో ఇద్దరు గృహ సారథులను నియమిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను గుర్తించి వారి ఓటును తొలగించేలా చేయడమే వీరి పని అని ఆరోపించారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల నిర్వహణ కోసం ప్రజాధనం ఖర్చు చేయడం తగదని రఘురామ కృష్ణం రాజు అన్నారు. సొంత సొమ్ముతో జరుపుకోవలసిన జన్మదిన వేడుకలకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము కేటాయించడమేమిటని ప్రశ్నించారు. 

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు మృతి

టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూశారు. పెళ్లి నిశ్చయమై శుభ లేఖలు  పంచడానికి వెళ్లి  గుండెపోటుకు గురైన చంద్రమౌళి రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం      (డిసెంబర్ 21)కన్నుమూశారు.   ఆదివారం గుండెపోటుకు గురైన చంద్రమైళి  చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు ఎక్మో సహా పలు ఇతర చికిత్సలు అందించినా ఫలితం లేకపోయింది. చంద్రమౌళికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, టిటిడి చెన్నై సలహామండలి అధ్యక్షుడు శేఖరరెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలో వీరి వివాహం జరగాల్సిఉంది. ఆ వివాహ శభ లేఖలు పంచడానికి ఆదివారం కారులో బయలు దేరిన చంద్రమౌళి  గుండె పోటుకు గురయ్యారు.

ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులకు చెల్లు చీటీ!

వచ్చే విద్యా సంవత్సరం  నుంచి ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ లు ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసింది.  కేంద్ర ప్రభుత్వం  1నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఇచ్చే స్కాలర్ షిప్ లకు చెల్లు చీటీ పాడేసింది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లు ఇవ్వలేమని పేర్కొంటూ బడ్జెట్ లో ఆ మేరకు నిధుల కేటాయింపు నిలిపివేయాలని నిర్ణయించింది. ఇంత వరకూ ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్పులు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు ఇచ్చే వారు. ఇకపై ఇవి  9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే పరిమితమౌతాయి.   విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నిర్బంధ ఉచిత విద్య అందిస్తోంది కాబట్టి, 8వ తరగతి వరకు స్కాలర్‌ షిప్స్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర సామాజిక న్యాయ, గిరిజన సంక్షేమ శాఖలు  చెబుతున్నాయి   విపక్షాలు అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ వ్రాతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

రోహిత్ రెడ్డిని రెండో రోజూ విచారించిన ఈడీ.. గుట్కా వ్యాపారాలతో సంబంధాలపై అనుమానం

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ.. రెండో రోజూ విచారించింది. అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులు, కంపెనీల వివరాలపై ఆరా తీసింది. అలాగే వ్యక్తిగత, వ్యాపార వివరాలపై ప్రశ్నలు సంధించింది. బ్యాంకు ఖాతాల సమాచారం సేకరించిన ఈడీ అధికారులు అనుమానాస్పద లావాదేవీలపై రోహిత్ రెడ్డిని తాము ముందుగానే సేకరించిన  సమాచారంతో... రోహిత్ ఇచ్చిన వివరాలను పోల్చి చూస్తుకుని తేడాలపై ప్రశ్నలు గుప్పించారు.   ఎవరెస్ట్ ఇన్ ఫ్రా కంపెనీ ఆర్థిక వివరాలు, ఆస్తుల గురించి కూడా ప్రస్తావించారు. ఇలా ఉండగా గుట్కా వ్యాపారంతో రోహిత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు లావాదేవీలున్నట్లుగా ఈడీ అనుమానిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను రోహిత్ రెడ్డి నించి సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. లాకర్లు, బ్యాంకుల ఖాతాల వివరాలు, అలాగే 2104, 2018 ఎన్నికల అఫివిట్లో చూపిన ఆదాయ వివరాలు, ఆస్తుల పెరుగుదల తదితర అంశాలపై రోహిత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. సోమవారం (డిసెంబర్ 19) దాదాపు ఆరుగంటల సేపు రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ అధికారులు మంగళవారం మధ్యాహ్నం 3గంటల నుంచి సుదీర్ఘంగా విచారించారు. మొదటి రోజు ఈడీ కోరిన ఏ సమాచారం తీసుకెళ్లని రోహిత్ రెడ్డి.. రెండో రోజు మాత్రం   కొన్ని ఆస్తులు, బ్యాంకు లావాదేవీల సమాచారం ఈడీకి అందజేశారు.  తొలి రోజు నాటకీయ పరిణామాల మధ్య రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు మణికొండలోని తన నివాసం నుంచి బయలు దేరిన రోహిత్ రెడ్డి.. నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇవాళ ఈడీ విచారణకు హాజరుకాలేనని పేర్కొంటూ పీఏతో ఈడీకి సమాచారం పంపారు. అయ్యప్ప మాలలో ఉన్నానని.. నోటీసుల్లో పేర్కొన్న సమాచారం మొత్తం ఇవ్వడానికి గడువు కావాలని కోరారు. ఈ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు విచారణ నిమిత్తం  రావాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో.. ప్రగతి భవన్ నుంచే నేరుగా రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.   

600 కేజీల బర్త్ డే కేక్.. లారీపై ఊరేగింపు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం డిసెంబర్ 21( బుధవారం). ముఖ్యమంత్రిగా ఆయన జరుపుకుంటున్న నాలుగో పుట్టిన రోజు. అదే కాదు.. ఈ ఏడు ఆయన జరుపుకుంటున్న పుట్టిన రోజుకు మరో ప్రత్యేకత ఉంది అదేమిటంటే..   ఆది ఆయన 50వ జన్మదినం. దీంతో వైసీపీ శ్రేణులు రెండు రోజుల ముందు నుంచే సంబరాలు ఆరంభించేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ఆటల, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారు. అన్నిటికీ మించి ఆయన బర్త్ డే సందర్బంగా 600 కేజీల కేక్ తయారు చేయించి దానికి లారీపై ఊరేగించారు. గొల్లపూడిలోని మైలురాయి సెంటర్ లోని బాబూ జగజ్జీవన్ రాం విగ్రహం నుంచి గ్రామ సచివాలయం వరకూ లారీపై ఊరేగించి అనంతరం కేక్ ను కట్ చేశారు.  ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?.. చార్జిషీట్ లో పేరు

ఢల్లీ లిక్కర్ స్కామ్ చార్జిషీట్ లో ఈడీ కవిత పేరు ప్రస్తావించింది. దీంతోఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందని చెప్పవచ్చు. ఈ కుంభకోణంలో ఈడీ, సీబీఐల దూకుడు గమనిస్తే కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే న్యాయనిపుణులు సైతం అంటున్నారు.  ఈ కుంభకోణంలో ఇప్పటికే కవితకు సన్నిహితులుగా ఉన్నవారిని విచారించి, కొందరిని అరెస్టు చేసిన సీబీఐ కవితను కూడా  ఆమె నివాసంలో సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను విచారించిన సీబీఐ.. ఆ విచారణ ముగిసిన అనంతరం ఆమెకు మరో నోటీసు జారీ చేసింది. తొలి నోటీసు సీఆర్పీసీ 160కింద ఇచ్చిన సీబీఐ.. ఆ నోటీసు మేరకు విచారణ పూర్తయిన తరువాత ఇచ్చిన నోటీసు సీఆర్పీసీ 91 కింద ఇచ్చింది. అంటే తొలి నోటీసులో ఆమె వివరణ తీసుకుందుకు మాత్రమే నంటూ ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ విచారణ జరుపుతామని పేర్కొన్న సీబీఐ.. ఆమె   ఎంపిక చేసుకున్న విధంగా ఆమె నివాసంలోనే విచారించింది. అయితే రెండవ సారి జారీ చేసిన నోటీసులో మాత్రం ఆమెకు అటువంటి వెసులు బాటు ఇవ్వలేదు. ఈ సారి  సీబీఐ తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆమె విచారణ నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది. తొలి నోటీసు మేరకు ఆమె నివాసానికి వెళ్లి దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు..మలి నోటీసుకు సంబంధించి మాత్రం సమయం, తేదీ, ప్రాంతం తరువాత తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ నోటీసులు విచారణకు వచ్చేముందు ధ్వంసం చేసి ఫోన్లు, లిక్కర్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లు  అన్నిటినీ తమకు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా పరిగణిస్తారు. మలి నోటీసు మేరకు కవితను విచారించిన అనంతరం ఆమెను లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా చేర్చే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.  ఇక ఫోన్ల ధ్వంసం సంబంధించిన కచ్చితమైన   నిర్దారణకు వచ్చిన తరువాతనే  సీబీఐ అధికారులు ఆమెను సీఆర్పీసీ 91 కింద నోటీసు జారీ చేశారని భావిస్తున్నారు. సీబీఐ కోరిన మేరకు కవిత ఆ వివరాలన్నీ అందించితే ఒక ఇబ్బంది, అందించకుంటే మరో ఇబ్బంది అన్నట్లుగా ఆమె ఇరుక్కున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్త మౌతోంది. అయితే మలి నోటీసు మేరకు ఆమెను ఎప్పుడు విచారిస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.  ఎందుకంటే త్వరలోనే విచారణకు ఎక్కడకు హాజరు కావాలి, ఏ తేదీన హాజరుకావాలి, ఏ సమయంలో హాజరు కావాలని అన్న వివరాలను త్వరలోనే తెలియజేస్తామని సీబీఐ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.   ఈ కేసులో ఇప్పటి వరకూ సీబీఐ విచారణ తీరును గమనిస్తున్న వారు కవితను సీబీఐ హస్తినకు పిలిపించుకుని విచారణ జరిపే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు. ఇక తాజాగా ఈ కుంభకోణంలో సమీర్‌ మహేంద్రు కేసులో ఈడీ   చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ ఆ చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు పేర్కొంది. కవిత తన 10 సెల్‌ఫోన్లను ధ్వంసం చేసుకున్నట్లు ఈడీ నిర్ధారించింది. కవితతో పాటు చార్జిషీట్ లో మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, అభిషేక్ రావు పేర్లను కూడా చేర్చింది. కాగా ఈ చార్జిషీట్ లో  ఒబేరాయ్ హోటల్‌లో సమావేశం జరిగినట్లు ఈడీ  వెల్లడించింది.   ఒబేరాయ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌లో కవిత, అరుణ్‌ పిళ్లై, దినేష్‌ అరోరా, విజయ్‌నాయర్‌ పాల్గొన్నట్లు  పేర్కొంది.  

ఖమ్మంలో తెలుగుదేశం సభ.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలంగాణపై దృష్టి కేంద్రీక‌రించారు. ఒక వైపు ఏపీలో రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తూనే.. మరో వైపు తెలంగాణ‌లోని టీడీపీ క్యాడ‌ర్‌లోనూ జోష్ నింపి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో టీడీపీకి కంచుకోట‌గా చెప్పుకొనే ఖ‌మ్మం జిల్లా నుంచి చంద్ర‌బాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చే కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.  ఖ‌మ్మం  స‌ర్దార్ ప‌టేల్ స్టేడియంలో బుధవారం (డిసెంబర్ 21) బ‌హిరంగ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే తెలంగాణ టీడీపీ నేత‌లు బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. చంద్ర‌బాబు భారీ కాన్వాయ్ తో హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి రోడ్డు మార్గం ద్వారా ఖ‌మ్మం వెళ్తారు. ఖ‌మ్మం జిల్లా సరిహద్దులో  కూసుమంచి వ‌ద్ద టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల‌ను బ‌హిరంగ స‌భ‌కు త‌ర‌లించేలా ఇప్ప‌టికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖ‌మ్మంలో బ‌హిరంగ స‌భ‌ను విజ‌య‌వంతం చేయడం ద్వారా తెలంగాణ టీడీపీలో జ‌వ‌స‌త్వాలు నింపేందుకు చంద్ర‌బాబు త‌న తొలి అడుగు వేయ‌నున్నారు. చంద్ర‌బాబు స‌భ విజ‌య‌వంతం అయితే తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటుచేసుకోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు బ‌హిరంగస‌భ‌లో చేయ‌బోయే ప్ర‌సంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.  చంద్ర‌బాబు త‌న స్పీచ్‌లో తెలంగాణలోని టీడీపీ శ్రేణుల‌కు ఎలాంటి దిశానిర్దేశం చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. చంద్ర‌బాబు బ‌హిరంగ స‌భ‌పై ఇప్ప‌టికే బీఆర్ఎస్ ఓ క‌న్నేసి ఉంచిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రోవైపు బీజేపీ కూడా  ఖ‌మ్మంలో జ‌రిగే చంద్ర‌బాబు స‌భ‌పై ఫోక‌స్ పెట్టింది. తెలంగాణ‌లో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య రాజకీయ పోరు రసతవ్తరంగా ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంటే కేసీఆర్ ముచ్చటగా మూడో సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం కావడం, రాజకీయంగా క్రియాశీలం కావడం కేసీఆర్ కు ఒకింత ఇబ్బందే. ఇంత వరకూ తెలంగాణ సెంటిమెంట్ పేరుతో కేసీఆర్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ క్రియాశీలం కాకుండా అడ్డుకోగలిగారు. కానీ ఇప్పుడు తెరాస పేరు మార్చి బీఆర్ఎస్ గా నామకరణం చేసి జాతీయ రాజకీయాలు అనడంతో ఆయన తెలంగాణ సెంటిమెంట్ అంటూ మాట్లాడే అవకాశం కోల్పోయారు. ఎందుకంటే పార్టీ పేరు నుంచే తెలంగాణను తీసేసిన కేసీఆర్ ఇక తెలుగుదేశం పార్టీని నిందించడానికి ఆంధ్రాపార్టీ, వలస పాలన అన్న మాటలు అనే అవకాశం లేకుండా పోయింది. ఇక టీఆర్ఎస్ కాదు కాదు.. బీఆర్ఎస్‌ విషయానికి వస్తే ఆ పార్టీలో  స‌గానికిపైగా క్యాడ‌ర్ టీడీపీ నుంచి వెళ్లిందే. ఇక ప్రస్తుతం కీలకంగా ఉన్న నేతలలో కూడా అత్యధికులు తెలుగుదేశం నుంచి వచ్చిన వారే. అందుకే ఇప్పుడు తెలుగుదేశం కనుక తెలంగాణలో బలపడితే భారీగా నష్టపోయేది బీఆర్ఎస్ మాత్రమే.  ఇక బీజేపీ అయితే ఖమ్మం సభ విజయవంతమైతే.. బీజేపీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు చేయి చాస్తుంది. అందుకు ప్రతిగా ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం కలిగే విధగా పొత్తుకు సై అనే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఏపీలో జనసేన, బీజేపీలు తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచే అవకాశాల కనిపిస్తున్నాయి. ఖమ్మంలో తెలుగుదేశం సభ విజయవంతం అయితే  ఆ అవకాశాలు మరింత మెరుగౌతాయి. దీంతో తెలుగుదేశం పార్టీకి ఏపీలో, బీజేపీకి తెలంగాణలో బాగా కలిసివస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  అంటే ఇక్కడ తెలంగాణ‌లో బీజేపీ బ‌లం పెర‌గ‌డంతో పాటు, ఆంధ్రాలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ   టీడీపీకి అనుకూలంగా మార‌డం ద్వారా టీడీపీకి ప్రయోజనం చేకూరుతుందన్న మాట. ఈ వ్యూహంతోనే చంద్రబాబు ఖ‌మ్మం సభను విజయవంతం చేసి తెలుగుదేశం సత్తా చాటాలన్న పట్టుదలతో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ ఎప్పుడంటే..?

తెరాస స్థానంలో భార‌తీయ రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్‌) అవ‌త‌రించింది. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కాలు మోపేందుకు బీఆర్ఎస్ ను దేశ‌వ్యాప్తంగా  బ‌లోపేతం చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇప్ప‌టికే ఢిల్లీ కేంద్రంగా పార్టీ కేంద్ర కార్యాలయాన్నిఏర్పాటు చేయ‌డంతో పాటు, ప‌లు క‌మిటీల‌ను సైతం నియ‌మించారు. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల నుంచి సీఎం కేసీఆర్ కు మ‌ద్ద‌తు ల‌భించ‌డంతో ఆ రాష్ట్రాల్లో మ‌ద్ద‌తు ఇచ్చే పార్టీల‌తో క‌లిపి బీఆర్ఎస్‌ను బ‌లోపేతంపై ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించారు. ఇక సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ త్వ‌ర‌లో బీఆర్ఎస్ కాలు మోపేందుకు సిద్ధ‌మైంది. క్రిస్మ‌స్ త‌రువాత ఏపీలో బీఆర్ ఎస్ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించేలా కేసీఆర్ ఇప్పటికే ఓ ప్ర‌ణాళిక సిద్ధం చేశారు. ఆ ప్రణాళికలో భాగంగానే బీఆర్ఎస్ ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు అప్పగించారు. ఏపీలో ప్ర‌స్తుతం అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు బీజేపీకి అనుకూలంగానే  ఉన్నాయి. ఈ క్ర‌మంలో బీజేపీ వ్యతిరేక వర్గాన్ని క‌లుపుకొని బీఆర్ఎస్‌ను ఏపీలో విస్త‌రించాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. క్రిస్మ‌స్ త‌రువాత బీఆర్ఎస్ ఏపీ కిసాన్ సెల్ ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్‌తో ఉత్త‌రాంధ్ర‌కు చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు, రైతు సంఘాల నేత‌లు, వివిధ సంఘాల నేత‌లు   మంత‌నాలు జ‌రిపిన‌ట్లు చెబుతున్నారు. వీరంద‌రితో క‌లిపి కిసాన్ సెల్ క‌మిటీని ఏర్పాటు చేయ‌డం ద్వారా ఏపీలో అడుగు పెట్టాల‌ని కేసీఆర్ ప్లాన్‌గా క‌నిపిస్తోంది. కేసీఆర్ ఏపీలో ముఖ్యంగా తెలుగుదేశం ను టార్గెట్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. టీడీపీలోని కీల‌క నేత‌లతో కేసీఆర్‌కు ఎప్ప‌టినుంచో మంచి సంబంధం ఉంది. ఈ క్ర‌మంలో వారిలో కొంద‌రిని బీఆర్ ఎస్‌లోకి తీసుకొస్తారన్న ప్రచారం తెలుగు రాష్ట్రాలలో గత కొంత కాలంగా     జ‌రుగుతోంది. క్రిస్మ‌స్ త‌రువాత కేసీఆర్ నేరుగా ఏపీకి వెళ్లి కిసాన్ సెల్ ను ఏర్పాటు చేస్తారా? లేదా అక్క‌డి నేత‌లే కిసాన్ సెల్ గా ఏర్పాట‌వుతారా అన్న విషయంలో స్పష్టత లేదు. కానీ  కేసీఆర్ ఏపీకి వ‌స్తే రాజ‌ధానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కేసీఆర్ ఏపీ రాజ‌ధానిపై ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారని అంటున్నారు.  క్రిస్మ‌స్ త‌రువాత కిసాన్ సెల్ ఏర్పాటుతో ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న కేసీఆర్‌.. జ‌న‌వ‌రి త‌రువాత భారీ బ‌హిరంగ స‌భ‌ను  నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతుంది.