గుంటూరులో తొక్కిసలాట ముగ్గురు మృతి

గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్విర్యంలో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.  అంతకు ముందు ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పేదలకు జనతా వస్త్రాల పంపిణీ ప్రారంభించి వెళ్లారు. అనంతరం తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ 20లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.  ముఖ్యమంత్రి జగన్ కూడా తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోవడం బాధాకరం అని చంద్రబాబు అన్నారు. పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోనే    కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. పేదల ఇళ్లలో జరిగిన ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని...ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.

రాహుల్ కొత్త గురువు ఎవరంటే ?

రాహుల్ గాంధీలో మార్పువచ్చింది. భారథ్ జోడో యాత్ర అయనలో మార్పు తెచ్చింది.  గతంలో రాహుల్ గాంధీకి ఉన్న ఇమేజ్ ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా వరకు ఆయన్ని సీరియస్ రాజకీయ నాయకుడిగా గుర్తించలేదు. ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ మిత్ర పక్షాల నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించలేదు. పార్లమెంట్ లో కన్ను కొట్టడం, హటాత్తుగా లేచి వెళ్లి ప్రధాని మోడీ మీద పడి కౌగిలించుకోవడం వంటి పిల్ల చేష్టలు ఆయన ఇమేజ్ ని మరింతగా పలుచన చేశాయి, ఆలాగే ఎవరికీ చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేయడం, యూపీఎ హాయాంలో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆర్డినెన్సును  విలేకరుల సమావేశంలో  చించి  పడేయడం, వంటి చర్యలు కూడా ఆయన రాజకీయ అపరిపక్వతను దేశం ముందుంచింది. అందుకే ఆయనకు రాజకీయాలు తెలియవని, ఆయన ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరని, దేశ, విదేశీ జర్నలిస్టులు, విశ్లేషకులు తీర్పు నిచ్చారు. రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు లేవని నిర్దారించారు.  అలాగే, గడచిన ఏడెనిమిది సంవత్సరాలో కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిన డజన్ల కొద్ది సీనియర్  నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు  రాహుల్ గాంధీనే కారణమని, ఆరోపించారు. వెళుతూ వెళుతూ అక్షింతలు వేసి మరీ వెళ్ళారు.  అయితే భారత జోడు యాత్ర తర్వాత రాహుల్ గంధిలో గుణాత్మక మార్పు వచ్చిందని కొందరైనా ఆయన్ని రాజకీయ నాయకుడిగా గుర్తిస్తున్నారు. గతంలో  రాహుల్ గాంధీని, పప్పూ అని అవహేళన చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు  తమ మాటను వెనక్కి తీసుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అంతటి వాడు  భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, రాహుల్ గాంధీలో  పెద్దమనిషి  లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. నిజానికి, రాజకీయ అనుబంధాలు, అవరోధాల కారణంగా కొందరు రాహుల గాంధీ పెద్దరికాన్ని, నాయకత్వాన్ని ఇంకా గుర్తించలేక పోతున్నారు కానీ  రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది. ఆయన నేతగా ఎదిగారు  అనే వాళ్ళు లేక పోలేదు.   అదలా ఉంటే  భారత్‌ జోడో యాత్ర  నుంచి క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు విరామం తీసుకున్న రాహుల్ గాంధీ  శనివారం (డిసెంబర్ 31) ఢిల్లీలో మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ తనకు గురువు లాంటివని ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏదైనా, ఆయా ఏ బాటలో వెళుతున్నారో ఆ వ్యాఖ్యలు స్పష్టం చేసాయి. నిజానికి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ముందు నుంచి కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల మధ్య విద్వేషం రగిలిస్తోందని, భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రేమను పంచుతూ ..అందరినీ ఏకం చేసే ప్రయత్నం సాగిస్తోందని చెప్పు కున్నారు. నిజానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు  అదే  ట్యాగ్ లైన్  గా చెప్పుకుంటున్నారు. ఇప్పడు యాత్ర విరామ సమయంలో ఆయన, ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీని తాను గురువులా భావిస్తానని అన్నారు. బీజేపీ తనకు రోడ్‌ మ్యాప్ ఇస్తోందని పేర్కొన్నారు. బీజేపీని చూసే తాను ఎలా ఉండకూడదో, ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నాను అంటూ సెటైర్లు వేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తమపై ఎంత దూకుడుగా దాడి చేస్తే.. తమ పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకునేందుకు అంతగా సాయపడుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రను తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఒక సాధారణ యాత్రగా ప్రారంభించానని.. అయితే  అది క్రమంగా ప్రజల గొంతుకగా మారి, వారి భావోద్వేగాలను ప్రతిబింబింస్తోందని రాహుల్ తెలిపారు.  అయితే, రాహుల్ గాంధీ బీజేపీ,ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వలన  కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏదైనా ప్రయోజనం చేకురుతుందా? అంటే  ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రవచించే హిందూ జాతీయ వాదం ముందెన్నడూ లేనంతగా ప్రజామోదం పొందుతున్న సమయంలో హిందుత్వ భాజాలానికి వ్యతిరేకంగా సాగడం, ఒక విధంగా ఏటికి ఎదురీదటమే అవుతుందని, కొందరు రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా, రాహుల్ గాంధీ చెపుతున్న విషయాలు ప్రవచనంలా వినడానికి బాగుంటాయి కానీ, ఆచరణలో కష్టమని అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ప్రవచిస్తున్న హిందుత్వ వ్యతిరేక లౌకికవాదానికి, రాహుల గాంధీ చెపుతున్న కొత్త సిద్ధాంతానికి భాషలోనే కానీ, భావనలో పెద్దగా తేడా కనిపించడం లేదు. ప్రజలు వ్యతిరేకించిన హిందూ వ్యతిరేక లౌకిక వాదాన్నే రాహుల గాంధీ,  లౌకిక వాదం,సెక్యులరిజం పదాలు వాడకుండా కొంత భిన్నంగా ప్రెజెంట్ చేస్తున్నారు. అందుకే, కాంగ్రెస్ పార్టీ కూడా  భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ, వ్యక్తిగత ఇమేజ్ ని పెంచవచ్చు కానీ, కాంగ్రెస్ పార్టీకి జరిగేది, ఒరిగేది ఏదీ లేదని, ఏమీ ఉండదని అంటున్నారు.

హ్యాట్రిక్ లక్ష్యంగా మోడీ మంత్రివర్గంలో మార్పులు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణకు సిద్దమవుతున్నారా? కొత్త సంవత్సరంలో జనవరి 14 తర్వాత  పెద్ద మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు మోడీ, షా మంత్రాంగం సాగిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కమలదళం కీలక నేతలు. అంతే కాదు  ఈసారి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా కాషాయ కూటమి పెద్దలు చెబుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా, పార్టీ పదవుల్లోనూ సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగియనుంది. అదే సమయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జనవరిలో జరగనుంది. కాగా, వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు 2024లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. నిజానికి నడ్డాను  2024 ఎన్నికలవరకు అధ్యక్ష పదవిలో  కొనసాగిస్తారని, ఆ మేరకు నిర్ణయం జరిగిందని పార్టీలో  ప్రచారం జరిగింది. అయితే, అధికారిక  ప్రకటన ఏదీ వెలువడలేదు. అయినా, పాతికేళ్ళ తర్వాత తొలిసారిగా, అధ్యక్ష ఎన్నికలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, నడ్డాకు ఎక్స్ టెన్షన్ ఇవ్వడాన్ని, తప్పు పట్టే అవకాశఇం లేదు. అలాగే, నడ్డా స్వరాష్ట్రం హిమాచల్’లో బీజేపీ ఓటమికి ఆయనే కారణమనే విమర్శలు వినవచ్చాయి. ఈ నేపధ్యంలో నడ్డాను కొనసాగించే విషయంలో  పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.  అందుకే  2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో, పార్టీలో మార్పులు చేపట్టే విషయంలో పార్టీ పెద్దలు  విభిన్న స్థాయిల్లో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కొంతమంది కొత్త ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అలాగే, మహా రాష్ట్రలో శివసేన చీలిక వర్గం ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభించే ఆకాశం ఉందని అంటున్నారు. గతంలో శివసేన ఎన్డీఎలో  ఉన్నరోజుల్లో కేంద్ర మంత్రి వర్గంలో ముగ్గురు నలుగురికి  స్థానం దక్కింది. అలాగే, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కడుపుతున్న బీజేపీ నాయకత్వం, రాష్ట్రం నుంచి మరొకరికి మంత్రి వర్గంలో స్థానం కలిపించే అవకాశం ఉంది. అదే విధంగా ఏపీ నుంచి కూడా ఒకరికి స్థానం దక్కుతుందని అంటున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే విషయంలో స్పష్టత రాలేదు.  మరో వంక  పని తీరు ఆధారంగా కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న చర్చ కూడా సాగుతోంది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జులై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది.  12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. ఈసారి కూడా అంత పెద్ద ఎత్తున ఉద్వాసనలు ఉంటాయా, లేక కొద్ది మందితో సరిపెడతారా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే, ఏది జరిగినా, ఎన్నికల లెక్కలు ఆధారంగానే జరుగుతుందని, మోడీ సర్కార్ హ్యాట్రిక్  లక్ష్యంగానే మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. నిజానికి విపక్షాల బలహీనత, బీజేపీకి కలిసి వచ్చే అంశంగా అందరూ భావిస్తున్నా బీజేపీ నాయకత్వం మాత్రం మరోలా లోచిస్తోందని అంటున్నారు.  యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో బీజేపీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం పునరావృతమైంది. తాజాగా గుజరాత్‌లో కూడా భారీ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పరాజయం పాలైంది. మరో వంక మిత్ర పక్షాలు చాలా వరకు ఇప్పటికే దూరమయ్యాయి.. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడి కక్కడ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ పరిస్థితులు, పరిణామాలు అన్నింటినీ బేరీజు వేసుకుని  మోడీ హ్యాట్రిక్ లక్ష్యంగా బీజేపీ మంత్రి వర్గంలో, పార్టీలో మార్పులకు భారీ కసరత్తు చేస్తోందని అంటున్నారు.

ఏపీలో బీఆర్ఎస్ ప్రవేశం వల్ల ఏం జరుగుతుందంటే?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో రాజకీయంగా ఎదిగిన కేసీఆర్.. అలా ఎదిగేందుకు  ఏపీపైనా, ఏపీ నేతలపైనా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనా తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పించారు. అవహేళన చేశారు. చులకనగా మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బవించి ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఎప్పుడు తన పరపతి కాస్త తగ్గిందని భావించినా కేసీఆర్.. ఏపీ వ్యతిరేకతనే  ఉత్ప్రేరకంగా చేసుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పండించి పబ్బం గడుపుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ రాష్ట్రంలో ప్రచారానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ.. మళ్లీ ఆంధ్రపాలకులు తెలంగాణపై కన్నేశారంటూ విమర్శలు గుప్పించారు. అంతెందుకు కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసీఆర్, ఇప్పుడు అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటున్నారు. ఇందుకు ఆ రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారా? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును మరిచి పోతారా? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్ కు ఆ రాష్ట్ర ప్రజలు రెడ్ కార్పెట్  వేసి స్వాగతం పలుకుతారా?  కేసీఆర్, నేను మరిపోయాను అంటే, ఏపీ ప్రజలు నమ్ముతారా? కేసేఆర్ నమ్మించగలరా? తాను తెలంగాణలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించారు. 2018 ఎన్నికలలో మరోసారి అధికారం చేపట్టేందుకు తెలంగాణ సెంటిమెంట్ నే ఆ శ్రయించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల పేరు చెప్పి.. తెలంగాణ రాష్ట్ర సమితిలోని తెలంగాణను తీసేసి.. భారత్ చేరిస్తే.. గత విమర్శలన్నీ మాయం అయిపోయినట్లేనా? పార్టీ పేరు మారినా.. నాయకుడు ఆయనేగా అని ఏపీ ప్రజలు నిలదీయరా? ఎవరో కొందరు నేతలో, పార్టీలో భారసకు ఏపీలో స్వాగతం పలికినంత మాత్రాన ప్రజలంతా సమ్మతం తెలిపినట్లేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ కు రాజకీయ టక్కుటమార గజ కర్ణ గోకర్ణ విద్యలు బాగా కొట్టిన పిండే అయినా,  ఏపీ ప్రజలను నమ్మించడం, వారి విశ్వాసం పొందడం సులభం అనుకుంటే అది పొరపాటే అవుతుంది.  నిజానికి, కేసేఆర్ ఏపీలో ఎంటర్ అవ్వాలంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక సారి కాదు, వెయ్యిసార్లు ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పవలసి ఉంటుందని ఏపీ జనం అంటున్నారు. మరి కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? ఏపీ ప్రజలకు క్షమాపణలు చెపుతారా? అలా చేస్తే భరాసకు తెలంగాణలో నూకలు చెల్లినట్లే అవుతుంది. ఇప్పటికే ఆయన పార్టీ పేరులోని తెలంగాణ తీసేసిన తరువాత అక్కడ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కనుక ఏపీ ప్రజలకు సారీ చెప్పి తెలంగాణ ప్రజలలో మిగిలిన కొద్ది పాటి విశ్వాసాన్నీ పోగొట్టుకునే సాహసం చేయరు.  సో .. ఆయన  ఏపీలో ప్రవేశానికి దొడ్డి దారిని వెతుక్కుంటున్నారు. ఏపీలోని పార్టీలలో అసంతృప్తులను, అవకాశాలు లేని వారిని ఎంచుకుని వారిని హైదరాబాద్ కు పిలిపించుకుని బీఆర్ఎస్ కండువా కప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే కొందరు నేతలు సోమవారం (జనవరి 2) హైదరాబాద్ లో బీఆర్ఎస్ కండువాలు కప్పుకోనున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం.. ఇది ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా.. ఆఖరికి కేసీఆర్ కూడా.. ఏపీ జనం విభజన వల్ల ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు, నష్టాలకు కాంగ్రెస్, కేసీఆర్ లే కారణమన్న భావనలో ఉన్నారు. విభజన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ కు విజయం సంగతి అలా ఉంచితే.. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. బీఆర్ఎస్ పేర కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టినా పరిస్థితి అందుకు భిన్నంగా ఉండదన్నది పరిశీలకుల విశ్లేషణ. బీఆర్ఎస్ ను వైసీపీ స్వాగతించడం, ఆ పార్టీ రాజకీయ వ్యూహమే తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో పోటీ చేసే పార్టీలు పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి లబ్ధి పొందాలన్న భావనతోనే వైసీపీ కేసీఆర్ కు స్వాగతం పలుకుతోంది. అయితే ఏపీలో బీఆర్ఎస్ కు పట్టు చిక్కడం అంత సులువు కాదని అంటున్నారు. కేసీఆర్ గతంలో ఆంధ్రులను చులకన చేస్తూ చేసిన, పేడ బిర్యానీ వంటి వ్యాఖ్యలను ప్రజలు మరిచిపోయే అవకాశం లేదంటున్నారు. అన్నిటికీ మించి ఏపీలో బీఆర్ఎస్ ప్రవేశం వల్ల తెలంగాణలో ఆ పార్టీకి ఉన్ప పట్టు సడిలడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించే అవకాశం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. 

జనసేనకు షాక్.. బీఆర్ఎస్ గూటికి తోట చంద్రశేఖర్

బీఆర్ఎస్ విస్తరణను  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపీ నుంచే ఆరంభించారు. ఇప్పటికే ఏపీలోని పలువురు నేతలపై దృష్టి సారించి  వారితో సంప్రదింపులు జరిపిన. కేసీఆర్.. పలువురు నేతల చేరికకు రంగం సిద్ధం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పొలిటికల్ ఎంట్రీతో తొలి షాక్ జనసేన పార్టీకే తగిలింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన క్షణం నుంచీ ఆ పార్టీ ఆంధ్రాలో అడుగుపెట్టడం ఖాయమన్న వార్తలు వినవస్తూనే ఉన్నాయి. ఆ పార్టీ ఏపీ బాధ్యతలు తలసాని శ్రీనివాస యాదవ్ కు అప్పగించారనీ కూడా ఒక సందర్భంగా పెద్దగా ప్రచారం కూడా జరిగింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రకటన చేసిన సందర్భంలోనే త్వరలో ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఘనంగా ఎంట్రీ ఇస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ తరువాత బీఆర్ఎస్ విస్తరణ అడుగులు పడలేదు. లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసుల వల్లనో లేక.. కేసీఆర్ అనుకున్న విధంగా ఎటువంటి మద్దతూ రాకపోవడం వల్లనో కానీ.. బీఆర్ఎస్ విస్తరణ అడుగులు ఆగిపోయాయి. తాజాగా కొత్త సంవత్సరం ఆరంభంలో అనూహ్యంగా బీఆర్ఎస్ లోకి  ఆంధ్రప్రదేశ్ నుంచి చేరికలు ఆరంభమయ్యాయి. అసలు   బీఆర్ఎస్ ప్రకటించిన క్షణం నుంచే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడితే ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీకి నష్టం అన్న చర్చలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ వల్ల తెలుగుదేశం నష్టపోతుందని కొందరూ, కాదు కాదు అధికార వైసీపీకే ఇబ్బందులు ఎదురౌతాయని మరి కొందరూ అంచనాలు వేశారు. ఒక దశలో వైసీపీ బీఆర్ఎస్ కు రాష్ట్రంలోకి వెల్ కమ్ చెప్పింది కూడా. అయితే కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ ఆంధ్రలో అడుగుపెట్టేస్తోంది. అయితే ఆ ఏపీ నుంచి ఆ పార్టీలోకి చేరుతున్న వారిలో తెలుగుదేశం, వైసీపీల నుంచి ఎవరూ లేరు కానీ అనూహ్యంగా జనసేన నుంచి కీలక నేతలు ఆ పార్టీలోకి జంప్ చేసేశారు.  ముఖ్యంగా  పార్టీ ఆవిర్భావం నుంచీ జనసేనతో ట్రావెల్ చేసినా గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరడం ఆ పార్టీకి ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం చేరువ కావడానికి దోహదం చేసే అవకాశం ఉంది. గతంలో ప్రజా రాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ లో పనిచేసిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. జనసేనలో కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా ఉన్న ఆయన.. జనసేనలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. తోట చంద్రశేఖర్ హైదరాబాద్ లో సోమవారం(జవవరి2) కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.  గుంటూరు నుంచి భారీ ర్యాలీతో తోట చంద్రశేఖర్ హైదరాబాద్ చేరుకుంటారు. పార్టీలో చేరిన రోజునే తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.   ఆయనే కాకుండా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా సోమవారం (జనవరి 2) కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. రావెల కిషోర్ బాబు  2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి  టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు.  2017లో మంత్రివర్గ విస్తరణలో పదవి పోవటంతో పార్టీకి రాజీనామా చేసారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. కొద్ది కాలం కిందట బీజేపీకి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థ సారథి కూడా బీఆర్ఎస్ లో చేరనున్నారు. అనంతరం కేసీఆర్ ఏపీ పర్యటన ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీ రాజకీయాలు బీఆర్ఎస్ ప్రవేశంతో మరింత వేడెక్కే అవకాశం ఉంది.    

తిరుమలలో భక్తుల రద్దీ

ఆయన వడ్డీ కాసుల వాడు.. వడ్డీ సహా వాసులు చేస్తాడు. ఏ కారణంగా అయినా ఆయనకు ఇస్తానన్నది ఇవ్వక పోయినా, చెల్లించవలసినది చెల్లించక పోయినా వదిలి పెట్టడు. ధర్మ వడ్డీ లెక్కకట్టి మరీ వసూలు చేస్తాడు. ఇక మొక్కుకుని మరిచి పోయానంటే అసలే వదిలి పెట్టడు. ముక్కు పట్టుకుని ఈడ్చుకు వెళ్లి మొక్కులు రాబట్టు  కుంటాడు. తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామి వారి గురించి భక్తుల విశ్వాసం.  అయితే గడచిన రెండేళ్ళలో  కరోనా కారణంగా ప్రయాణ సదుపాయాలు లేక పోవడం వల్లనైతే నేమి, కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న కారణంగా 2020 మార్చి నుంచి ఆలయంలోకి భక్తులకు టీటీడీ అనుమతించక పోవడం వల్లనైతేనీమే, దాదాపు 83 రోజులపాటు శ్రీనివాసుడికి ఏకాంతంగానే సేవలు నిర్వహించడం వల్లనైతే నేమీ, ఏడు కొండలకు భక్తుల రద్దీ చాల వరకు తగ్గి పోయింది. అయితే, ఈ ఏడాది ( 2022)  కరోనా ప్రభావం తగ్గటంతో పూర్తి స్థాయిలో తిరుమల ఆలయంలోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. 2022 ఉగాది నుంచి కరోనా నిబంధనలు పూర్తిగా తొలగించారు. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది స్వామి వారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. అలానే కానుకలు, ముడుపుల, హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలోనే సమకూరింది.  సాధారణంగా టీటీడీ వార్షిక బడ్జెట్ హుండీ ఆదాయంపై‌ ఆధారపడి ఉంటుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను  రూ.3,116.25 కోట్లతో టీటీడీ బడ్జెట్ ను అంచనా వేసింది. తర్వాత దాన్ని రూ. 3,243. 19 కోట్లకు సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేశారు.. అంచనా కన్నా 50 కోట్ల రూపాయలు అధికంగా భక్తులు హుండీలో సమర్పించారు. తద్వారా రూ.1,285 కోట్లు సమకూరింది. ఇవి కరోనా రాక ముందు పద్దులు. కొవిడ్ వచ్చినప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2020-21వ వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 13 వందల కోట్లు అంచనా వేయగా.. టీటీడీ అంచనాలను తలక్రిందులు చేస్తూ 721 కోట్లు రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. దీంతో వార్షిక బడ్జెట్ ను సవరించి రూ. 2,553 కోట్లకు కుదించారు. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,837 కోట్ల రూపాయలు అంచనా వేశాయి పాలక వర్గాలు.  2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 21-22ఆర్థిక సంవత్సరానికి 2,937.85 కోట్ల రూపాయలకు పాలకమండలి సభ్యులు పచ్చజెండా ఊపారు.. కోవిడ్ ‌తరువాత భారీగా భక్తుల‌ సంఖ్య‌ పెరగడంతో‌ గతంలో‌ మాదిరే హుండీ ఆదాయంతో‌ పాటుగా, కళ్యాణ‌ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు, టీటీడీ భూములు లీజు‌ వంటి రూపాల్లో‌‌ ఆదాయం‌ పెరిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగటంతో పాటుగ హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు కానుకలు సమర్పించారు. ఈ క్రమంలో 2022 సంవత్సరానికి గాను శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, హుండీ ఆదాయ లెక్కలను టీటీడీ విడుదల చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,35, 58,325 కోట్ల మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే రూ. 1446 కోట్లు హుండీ, విరాళాల రూపంలో వచ్చాయి. 1,08,51,706 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. 11,42,78,291 శ్రీవారి లడ్డులను భక్తులకు విక్రయించారు. అయితే వెంకన్న దేవును ఆదాయం పెరిగిన స్థాయిలో భక్తుల సౌకర్యాలు పెరగడం లేదు. మరో వంక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీటీడీలో అన్యమతస్తుల ప్రమేయం,అన్యమతస్థులు అరాచకాలు పెరిగి పోయాయనే విమర్శలు ఎకువయ్యాయి. ఇక టీటీడీలో నిధుల  దుర్వినియోగం, ఆస్తుల విక్రయం వంటి ఆరోపణల గురించి అయితే చెప్పనే అక్కర లేదు. చివరకు వెంకన్న హుండీలో కానుకలు వేయవద్దని ప్రధాన అర్చకులే భక్తులకు విజ్ఞప్తి చేశారంటే .. పరిస్థితి ఏమిటో వేరే చెప్పనకరలేదని అంటున్నారు

పంత్ ను కాపాడిన డ్రైవర్ కు మాజీ క్రికెటర్ లక్ష్మణ్ కృతజ్ణతలు

ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ ను సకాలంలో రక్షించి ఆసుపత్రికి తరలించిన హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  అన్ని వర్గాలు సుశీల్ కుమార్ ను ప్రశంసించడమే కాదు.. కృతజ్ణతలు కూడా తెలుపుతున్నాయి.   కుటంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తూ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం (డిసెంబర్ 30) తెల్లవారుజామున 5.30 గంటలకు పంత్ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ-డెహ్రాడూన్‌ జాతీయ రహదారిలో రూర్కీ నర్సన్ సరిహద్దు వద్ద  అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైంది. తీవ్రంగా గాయాలు అయిన అతడు ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని మరింత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించనున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే రిషబ్ పంత్‌ కారు మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్‌ఇ 43 4మ్యాటిక్ కూపేలో మంటలు చెలరేగాయి. దాంతో కారు అద్దం పగలగొట్టి బయటకు వచ్చేందుకు పంత్ ప్రయత్నించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. కారు కిటికీలో నుంచి సగం బయటకు వచ్చిన పంత్‌ను బయటకు లాగాడు. ఓ బెడ్‌షీట్‌తో పంత్ శరీరాన్ని కప్పాడు. వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించి.. అందులో ఆసుపత్రికి పంపించాడు.ఇంతకీ ఈ డ్రైవర్ సుశీల్ కుమార్ కు క్రికెట్ తెలియదు. పంత్ ఎవరో కూడా తెలియదు. అయినా సమయానికి ఆపద్బాంధవుడిలా రిషబ్ పంత్ ను కాపాడాడు, మంచి మనసుతో, సేవా దృక్ఫథంతో యువ క్రికెటర్ ప్రాణాలు కాపాడిన సుశీల్ కుమార్ కు మాజీ క్రికెటర్ హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ణతలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.మీ నిస్వార్థ సేవకు మేమంతా రుణపడి ఉంటామని లక్ష్మణ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అలాగే ఆ బస్సు కండక్టర్ పరంజిత్ కూడా లక్ష్మణ్ ఆ ట్వీట్ లో ధన్యవాదాలు తెలిపాడు. 

వైసీపీలో అసంతృప్తి.. నేతల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు, చేయని ప్రయత్నం లేదు. నిజానికి, ఓటమి అంచున నిలిచినా , దింపుడు కళ్ళెం ఆశతో ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడంలేదు. తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని కోరుకుంటున్నారు. కోరుకోవడం కాదు, 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అనే లక్ష్యంతో ముందుకు సాగండి అంటూ, అతి విశ్వాసాన్ని ఉద్భోదిస్తున్నారు. ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లి, ప్రతి ఫ్యామిలీకి చేసిన మేళ్లను చెప్పుకోవాలని, తరుము తున్నారు. అయితే నిజంగా ప్రతి గాడపకు మేలు జరిగిందే నిజం అయితే, ఇంతలా హైరాన పాడడం ఎందుకు? అంటూ అటు ప్రజలు, ఇటు ప్రతి పక్ష నాయకులు, కార్యకర్తలు కూడా నవ్వు కుంటున్నారనుకోండి అది వేరే విషయం.   అలాగే చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందని    జగన్మోహన్ రెడ్డి  తనకు తాను తగిలించుకున్న భుజ కీర్తులను ఎత్తి చూపుకుంటున్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని  చేసిన పనులను గడపగడపకు ప్రజల వద్దకు తీసుకెళ్లడి చాలు అంటూ కార్యకర్తలలో విశ్వాసం కలిగించేందుకు చాలా చాలా శ్రమిస్తున్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని(అతి ఎంత అక్రమ విజయమో వేరే చెప్పనక్కరలేదు) భూతద్దంలో చూపించి తెలుగు దేశం అధినేత్ చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం  కుప్పంలోనే గెలిచి నప్పుడు, మిగిలిన  నియోజక వర్గాల్లో గెలవడం ఎంత పని,  175కు 175 నియోజక వర్గాల్లోనూ గెలుస్తాం ..  గెలుస్తున్నాం .. అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయితే, జగన్ రెడ్డి కుప్పం గెలుపును ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకోవడం  అది చూసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుకోవడం, తల్లి తండ్రులను హత్య చేసిన హంతకుడు,  తల్లి తండ్రులు లేని అనాధను కరుణించి కాపాడండని న్యాయస్థానాన్ని వేడుకున్నట్లు ఉందని అంటున్నారు.  నిజమే అద్దాల మేడలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటే కనవచ్చును, కానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం  ఆ భరోసా కనిపించడం లేదు. గతంలో   అభ్యర్ధి ఎవరైనా,   అన్నకు ఓటేయండి.. అన్నను అధికారంలోకి తీసుకువద్దాం!`` అని, అన్ని నియోజక వర్గాల్లో జగన్ రెడ్డే, వైసీపీ అభ్యర్ధి అన్నట్ల్గు  ప్రచారం చేసిన కార్యకర్తలు, ఇప్పుడు మౌనంగా ఉండి పోతున్నారు. జగన్ రెడ్డి ఏమి చేశారంటే, చెప్పేందుకు సమాధానం లేక గడపగడప కర్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు  2019 ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వైసీపే వెంట నడిచిన వైసీపీ కార్యకర్తలు చాలా వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  98 శాతం వరకు ఇచ్చిన హమీలను నేరవేర్చామని చెప్పుకోవడం, అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు వడ్డాణం చేయించానన్నట్లుగా ఉందని కార్యకర్తలే వాపోతున్నారు. ప్రజల సంగతి తర్వాత, కార్యకర్తలకు ఇచ్చిన హమీలకే దిక్కు లేదని నేతలను నడిరోడ్డు మీద నిలదీస్తున్నారు.  అలాగే కులం, మతం ఇతర ఇంటర్నల్ లింకుల కారణంగా ఇంకా వైసీపీని మోస్తున్న కార్యకర్తలు అయితే, ఇక ఇప్పడు చేయగలిగిందేమీ లేదనీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోతున్నారు.  మరో వంక నాయకుల్లోనూ ఇంతకాలం అణచి పెట్టుకున్న అసంతృప్తి  అగ్నిగోళంలా భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తుపాకిలోంచి  తూటాలా ధిక్కారం దూసుకోస్తోంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.  ఉమ్మడి కృష్ణాను తీసుకుంటే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, గుంటూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి,   ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, తాడికొండ లో ఉండవల్లి శ్రీదేవి,  కర్నూలులో  ఎస్వీ మోహన్ రెడ్డి    రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి, రాయచోటిలో  శ్రీకాంత్రెడ్డి,  గిద్దలూరులో అన్నా రాంబాబు బాపట్లలో కోన శశిధర్,  శ్రీకాకుళం కిల్లి కృపారాణి, పేరాడ తిలక్.. ఇలా.. కీలక నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకరిద్దరు మినహా వీరంతా కూడా   ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంట నడిచిన వారే, అయన విజయం కోసం కష్టపడిన వారే. ఆయన కోసం.. ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్నవారే. అప్పులు చేసి మరీ ఖర్చు చేసిన వారే. అయితే..ఇప్పుడు వీరికి ప్రాధాన్యం లేకుండా పోవడం.. జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం.. వారు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగడం వంటివి ఇప్పుడు వీరిని మనోవేదనను కలిగిస్తున్నాయి. దీనికి తోడు.. నియోజకవర్గాల్లో అభివృద్ధిలేక పోవడం కూడా.. వారిని తీవ్ర సంకట స్థితికి చేర్చింది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు పెరుగుతున్నాయి. నిజానికి, వైసీపీలో ఏ ఇద్దరు కలిసినా ... జగన్ రెడ్డి మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదనే విషయాన్నే చర్చించుకుంటున్నారు. ఇటు కార్యకర్తల్లో, అటు నాయకుల్లోనూ భాగ్గుమనేదుకు సిద్డంగా ఉన్న అసంతృప్తి గురించే మాట్లాడు కుంటున్నారు. నిజానికి ఇప్పటికే చాల వరాకు జిల్లాల్లో అసంతృప్తి కర్యకలాపాలు జోరందుకున్నాయి... ఎన్నికలు దగరయ్యే కొద్దీ పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న అసంతృప్తి భగ్గుమంటోందని, వైసీపీ ముఖ్య నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు  వెనకాడుతున్నారు.. పిల్లి మేడలో గంట కట్టేది ఎవరని వేచి చూస్తున్నారు.

ఏపీలో బీజేపీ ట్రిపుల్ గేమ్.. సంపర్క్ యాత్రల మర్మమేంటో?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ డబుల్ గేమ్ కాదు త్రిబుల్ గేమ్ ఆడుతోంది. ఒక వైపు జనసేన మిత్రపక్షమని చెబుతోంది. మరో వైపు తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్న సంకేతాలు ఇస్తోంది. అంతే కాకుండా అధికార వైసీపీకి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ రకమైన తీరుతో బీజేపీ రాష్ట్రాన్ని ఏం  చేద్దామనుకుంటోంది, ఏం సాధించాలనుకుంటోంది అన్నది పక్కన పెడితే.. రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణకు రోడ్ మ్యాప్ ప్రకటించేసింది. జనవరి 26 తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత  పాదయాత్రలకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించి సన్నాహకంగా   జనవరి 8న  కర్నూలులో, హిందూపురంలో బహిరంగ సభలు నిర్వహించనుంది. ఆ సభలలో సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.  జనవరి 26 తర్వాత రాష్ట్రంలో   13 వేల గ్రామాల్లో బీజేపీ చేపట్టే సంపర్క పాదయాత్రలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేసేలా   కార్యాచరణ రూపొందించేసింది. అయితే రాష్ట్రంలో బీజేపీ ఏం చేసినా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న జగన్ అనూకూల వైఖరి, కొందరు బీజేపీ రాష్ట్ర నేతల తీరు కారణంగా ఆ పార్టీని జనం విశ్వసించడం లేదు. జగన్ సర్కార్ పై ఎంత ఘాటు విమర్వలు చేసినా జనం పట్టించుకోవడం లేదు. దీంతో జనవరి 26 తరువాత నుంచి బీజేపీ రాష్ట్రంలో  చేపట్టనున్న సంపర్క పాదయాత్రలలో రాష్ట్రంలో బీజేపీ ఏం చేసినా, ఏ మాట్లాడినా జగన్ కు ప్రయోజనం చేకూర్చేందుకేనని అత్యధికులు విశ్వసి స్తున్నారు. దీంతో ఇప్పుడు బీజేపీ రూటు మార్చి సంపర్క యాత్రలలో వైసీపీ సర్కార్ వైఫల్యాలనే టార్గెట్ చేయనుంది. కనీసం అలా ప్రకటించింది. కానీ ఇంత కాలంగా రాష్ట్ర బీజేపీ చేస్తూ వచ్చిన వ్యవహారం అంతా జగన్ సర్కార్ వైఫల్యాలను చూసీ చూడనట్లు వదిలేయడమే. అదే బీజేపీ కార్యక్రమాలలో విపక్షాన్నే టార్గెట్ చేస్తూ విమర్శించడం మాత్రమే. అందుకే సంపర్క్ యాత్రలలో కూడా అధికార పార్టీపై పైపై విమర్శలకు మాత్రమే బీజేపీ పరిమితమౌతుందనే అంతా భావిస్తున్నారు. ఇందుకు వారు ఇటీవల ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటనలో ప్రధాని మోడీతో దాదాపు గంట పాటు భేటీ అవ్వడం, ఆ తరువాత అమిత్ షాతోనూ సమావేశం కావడాన్ని తార్కాణంగా చూపుతున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో, కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం అసాధారణమేమీ కాదు. కానీ ఏపీ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం, లెక్కలకు అందని అప్పుల తీరు తెలిసీ రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలిగేలా.. మచిలీపట్నం,రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం పేరిట రూ.12 వేల కోట్ల ఋణం పొందేందుకు జగన్   హస్తిన పర్యటన ఇలా ముగిసిందో లేదో అలా అనుమతి వచ్చేయడం.. ఆ రుణం ఇచ్చేందుకు, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ( ఆర్ఈసీ), పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ ( పీఎఫ్ సీ) సూత్ర ప్రాయంగా అంగీకరించడాన్ని తార్కాణంగా చెబుతున్నారు. ఈ ఆమోదం లభించిన రుణంలో ఓ 24వందల కోట్ల రూపాయలు ఆర్సీసీ వెంటనే ఏపీ మ్యారిటైం బోర్డుకు అందజేయడానికి అంతా సిద్ధమైపోవడం.. కేంద్రం, జగన్ సర్కార్ ల మధ్య ఉన్న అవినాభావ అనుబంధానికి నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ రుణమే కనుక అందకుంటే ఏపీ సర్కార్ రోజువారీ కార్యక్రమాల కొనసాగింపునకు కూడా ఒక్క రూపాయి లేక విలవిలలాడే పరిస్థితి ఎదురయ్యేది. బడ్జెట్ ఆమోదం వరకూ అంటే మార్చి వరకూ ఏపీ సర్కార్ ఖజానా ఖాళీగానే ఉండే పరిస్థితి అన్నమాట. ఆ పరిస్థితి నుంచి ఏపీ గట్టెక్కేందుకు కేంద్రం తన వంతు సహకారం అందించింది. ఇటువంటి వెసులు బాటు బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో కేవలం ఏపీకి మాత్రమే లభిస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణను ఆర్థిక చక్రబంధంలో బిగించేసి వేడుక చూస్తున్న మోడీ సర్కార్ ఏపీకి మాత్రం కోరిందే తడవుగా వరాలిచ్చేసి ఆదుకుంటోంది. నిజానికి ఏపీతో పోలిస్తే తేలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉంది. అయినా రాజకీయ కారణాలతో ఆ రాష్ట్రాన్ని మోడీ, షా ద్వయం ఇబ్బందుల్లోకి నెట్టి వేడుక చూస్తోంది. ఈ కారణంగానే   ఏపీలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు, చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా విశ్వాసాన్ని పొందడం లేదు. రాష్ట్రంలో సొంత బలం ఇసుమంతైనా లేని బీజేపీ.. ఇతర పార్టీల బలహీనతల ఆసరాగా పరాన్న జీవిగా ఉన్నా కూడా చక్రం తిప్పేయాలని చూస్తోందని పరీశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మిషన్ 90 సక్సెస్ అవుతుందా?

మిషన్ 90  టైటిల్ బాగుంది. కానీ, కమల దళం నిర్దేశించుకున్న లక్ష్యం నెర వేరుతుందా? అంటే అదంత ఈజీ టాస్క్ కాదు. మరి అ విషయం కమలనాథులకు తెలియదా అంటే, తెలుసు. అయినా, మోడీ షా నాయకత్వంలో బీజేపీ  ఎప్పుడు, ఎక్కడ నేల చూపులు చుడదు. తలెత్తి చూసే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటుంది తప్ప  తల దించుకుని చూసే అలోచన కార్యకర్తలలో రానీయదు. అవును, బీజేపీ విధానాలను కమ్యూనిస్ట్ శంఖంలో పోసి విశ్లేషించే ఒక మేధావి, మాజీ ఎమ్మెల్సీ అన్నట్లుగా, మోడీ షా  జోడీ నాయకత్వంలోని బీజేపీ, పులి మీద  స్వారీ చేసేందుకు ఇష్టపడుతుందే  కానీ  పిల్లి మీద స్వారీ చేయదు.   పశ్చిమ బెంగాల్ లో జరిగింది అదే..  200 ప్లస్ టార్గెట్ గా ఎన్నికల బరిలో దిగింది. కేంద్ర హోం మంత్రి అమిత షా, ఒకటికి వందసార్లు, బీజేపీ 200 సీట్ల మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, వచ్చితీరాలని పార్టీ నాయకులు, కార్యకర్తల మెదళ్ల లో ఒక సెల్ఫ్ టార్గెట్ ను ఇంజెక్ట్ చేశారు. నిజమే,పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రకటిత లక్ష్యాన్ని చేరుకోలేదు. కానీ అప్రకటిత లక్ష్యాన్ని చేరుకుంది.  కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా, సింగిల్ సీటు రాలేదు. బీజేపీ ఫిక్స్ చేసుకున్న  200 టార్గెట్ ను కాదు, ప్రశాంత్ కిశోర్ విసిరిన 100 సీట్ల ఛాలెంజ్ ని చేరుకోలేక పోయింది. అయినా  సింగిలే డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు చేరింది.  77 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష హోదాను కైవసం చేసుకుంది. అంతకు ముందు 2016 ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది కేవలం 3 అసెంబ్లీ సీట్లు, ఆ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్లు కేవలం 10.16 శాతం. అదే 2021కి వచ్చే సరికి, సీట్ల సంఖ్య 3 నుంచి 77కు పెరిగితే, ఓట్ల శాతం 10.16 నుంచి 38.13 శాతానికి చేరింది.   అలాగని పశ్చిమ బెంగాల్ స్టొరీనే తెలంగాణలో రీపీట్  అవుతుందా అంటే, కావచ్చు, కాకపోవచ్చును. కానీ, హైదరాబాద్ శివారులో జరిగిన బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్, విస్తారక్, ప్రభారీ  కన్వీనర్ల సమావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని, సిద్దం చేసుకున్న రోడ్ మ్యాప్ ను సింపుల్ గా తీసి పారేయడం సరికాదని  పరిశీలకులు భావిస్తున్నారు. అవును  బీజేపీ హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్ట్ మేథావులు కూడా  బీజేపీ సక్సెస్ అవుతుందా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణను కైవసం చేసుకునేందుకు బీజేపీ బెంగాల్ తరహా వ్యూహంతో పావులు కడుపుతోందని  మాత్రం  గట్టిగా నమ్ముతున్నారు.   ఈ వ్యూహంలో భాగంగా కొత్త ఏడాదిలో పది  నెలల రోడ్ మ్యాప్ తో  వరుస కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమవుతున్నది. పది నెలల రోడ్ మ్యాప్ లో మొదటి నాలుగు నెలలలో  రాష్ట్ర ప్రభుత్వ  వైఫల్యాలను జనంలో ఎండగట్టడంతోపాటు రాష్ట్రానికి కేంద్రం ఏ పథకం కింద ఎన్ని నిధులు ఇచ్చిందో  ప్రజలకు వివరించనుంది. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు ‘పల్లె గోస.. బీజేపీ భరోసా’ పేరుతో పది వేల గ్రామ సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ప్రధాని మోడీని హైదరాబాద్ కు ఆహ్వానించి, ఏడు లక్షల మంది బూత్ కమిటీ సభ్యులతో సమ్మేళనం నిర్వహించాలని భావిస్తున్నది. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 5 వరకు అసెంబ్లీ స్థాయిలో  ఆ తర్వాత జిల్లా స్థాయిలో సభలు నిర్వహించేందుకు ప్రణాళికను రెడీ చేసుకుంది. వీటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తీసుకురావాలనే ఆలోచనలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఉంది.   రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై  ఏప్రిల్ లో చార్జిషీట్ విడుదల చేయాలనుకుంటున్నది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆహ్వానించి భారీ బహిరంగ సభను నిర్వహించాలని యోచిస్తున్నది. హైదరాబాద్ శివారులో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పాలక్, విస్తారక్, ప్రభారీ, కన్వీనర్ల సమావేశంలో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్  చేసిన దిశా నిర్దేశంతో నేతలు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా  బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉధృతంగా పోరాడాలని బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించామని పార్టీ ప్రకటించింది. సో.. చివరకు ఏమి జరుగుతుంది  అనేది పక్కన పెడితే, జాతీయ స్థాయిలో బీజేపీని ఢీ కొనేందుకు బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నది. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ను అష్టదిగ్బంధనం చేసి  రాష్ట్రానికే పరిమితం చేసే వ్యూహంతో బీజేపీ పావులు కదుపుతోంది. యాదృచ్చికమే కావచ్చును కానీ  ఎమ్మెల్యేల బేరసారాల కేసులో  కేసీఆర్ టార్గెట్ చేసిన బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్  సారధ్యంలో బీజేపీ  కేసీఆర్ హటావో .. తెలంగాణ బచావో   వ్యూహరచన జరిగిందిని ఇకపై కూడా  మిషన్ 90 కి కర్త, కర్మ, క్రియగా ఆయనే వ్యవహరిస్తారని అంటున్నారు.అంతేకాదు,  బీఎల్ సతోష్  హైదరాబాద్ నడిగడ్డ నుంచే కేసీఆర్  కు సవాలు విసిరి వెళ్ళారు.  సో.. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ యుద్ధం ముందు ముందు మరింతగా రక్తి కడుతుందని, రసవత్తరంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఓటమి భయంతో ధర్మాన నోట ఉత్తరాంధ్ర ఉద్యమం

అధికార దాహం తలకెక్కితే, ఏమి జరుగుతుందో అనేక వేర్పాటువాద ఉద్యమాలు నిరూపించాయి. అందుకు కళ్ళ ముందు కనిపిస్తున్నసాక్ష్యం  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. నిజానికి తెలంగాణ ఉద్యమం ప్రధానంగా  ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిందే అయినా,  చివరకు రాజకీయ అవతారం ఎత్తిన తర్వాత, ముఖ్యంగా రాష్త్రం ఏర్పడిన తర్వాత  ఏమి జరిగిందో, ఏమి జరుగుతోందో  ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుష్కరకాలం పైగా జరిగిన మలి దశ ఉద్యమంలోనే 1200 మందికి పైగా యువతీ, యువకులు ప్రాణ త్యాగం చేశారు. అమర వీరులయ్యారు. కానీ, అంత మంది బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం,ఇప్పడు ఎట్లుంది .. అంటే .. అమర వీరుల ఆశయాలను ఏ మేరకు నిజం చేసింది? అంటే ... అమరుల అత్మఘోషే సమాధానం అవుతుంది. నిజమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏవో కొన్ని మేళ్ళు జరిగింది నిజమే కావచ్చును, అయినా ఇందుకేనా త్యాగాలు చేసింది? ఇందుకేనా తెలంగాణ తెచ్చుకుంది అనే నిర్వేదం మాత్రం సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది.  ఇక అవశేష ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ బేహారులు మరో ప్రాంతీయ ఆందోళన తెర తీస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలమాట వినిపిస్తున్న సమయంలో రాజకీయ బేహారులు రంగ ప్రవేశం చేశారు. మూడు రాజధానుల వివాదాన్ని తెరమీదకు తెచ్చి, ప్రాంతీయ విద్వేషాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే ప్రయత్నం మొదలైంది. ఇంకా చిత్రం ఏమంటే, ఆ రెచ్చగొట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందే వైసీపీ కావడం. నిజమే మూడు రాజధానుల పేరిట ప్రాతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతున్నా, ఇప్పుడు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు  ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం  డిమాండ్ ను తెర మీదకు తెచ్చారు.అమరావతినే రాజధాని అని చంద్రబాబు అంటున్నారని.. అలా అయితే మా విశాఖను మాకిచ్చేయాలని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామని ఆయన ప్రకటించేశారు.  ఎచ్చెర్లలో వైసీపీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబు ఇటీవలి పర్యటనలో.. ఒకే రాజధాని అమరావతి ఉండాలని ప్రజలతో నినాదాలు చేయించిన అంశాన్ని గుర్తు చేసుకుని ఆవేశాన్ని అభినయించారు.  ఉత్తరాంధ్ర పర్యటనలోనే  అమరావతి రాజధాని అని చంద్రబాబు నాయుడు చెప్పడం మన చేతులతో మన కళ్ళని పొడిచే ప్రయత్నమని ధర్మాన అభివర్ణించారు. అయితే ఇది ధర్మాన వ్యక్తిగత అభిప్రాయమా? వైసేపీ విధానమా? అనేది స్పష్టం కావలసి ఉంది. అయితే, మూడు రాజధానుల విషయంలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని గమనిస్తే, ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ గొట్టి పబ్బం గడుపుకునే వ్యూహం దాగుందనేది కాదన లేని నిజం. అందుకే ఇది ధర్మాన సొంత అభిప్రాయం, అయినా, జగన్ రెడ్డి వ్యూహమే అయినా, ఇప్పటికే రాష్ట్ర విభజనతో అన్ని విధాల నష్టపోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి అనర్ధమే అవుతుందని విజ్ఞులు, విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఒక సారి ప్రాతీయ విద్వేషాగ్ని రాజుకుంటే, ఆర్పడం అంత తేలిగ్గా అయ్యే పని కాదని, అందుకు మళ్ళీ తెలంగాణనే కళ్ళముందున్న ప్రత్యక్ష సాక్ష్యమని అంటున్నారు. పన్నెండేళ్ల అశాంతి అలజడి, పన్నెండు వందల ప్రాణాలు బలి, చివరకు మిగిలింది అదే రాజకీయ అరాచకం అని గుర్తు చేస్తున్నారు. అదలా  ఉంటే, ధర్మాన ప్రసాద్ రావు .. రాజకీయ ప్రయోజనాల కోసం అగ్గిరాజేస్తున్నారని ప్రజలు, ప్రజాసంఘాలు మేథావులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. నిజానికి, ఒకప్పుడు, మూడు రాజధానుల ఆలోచను ధర్మాన చాలా గట్టిగా వ్యతిరేకించారు.  అమరావతి ఒక్కటే రాజధాని అనే విధానాన్ని, ‘ఏకైక రాజధాని . .. అమరావతి’ నినాదాన్ని గట్టిగా సమర్ధించారు. కానీ ఇప్పడు అదే ధర్మాన రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదని అంటున్నారు. అయితే తెలంగాణ అనుభవం తర్వాత ప్రజలు మరో ప్రాంతీయ ఆందోళనను ఎట్టి పరిస్థితిలోనూ సమర్ధించరని అంటున్నారు. ప్రస్తుతానికి అది నిజమే కావచ్చును కానీ, ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూడవలసి ఉందని అంటున్నారు. మరో వంక ఓటమి భయంతోనే  వైసీపీ, ప్రాంతీయ విద్వేషాలను రగిల్చే ప్రయత్నం చేస్తోందనే అంటున్నారు. గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి అధికారం కోసం హైదరాబాద్ లో మత  కలహాలను రెచ్చగొడితే, ఇపుడు జగన్ రెడ్డి అధికారాన్ని నిలుపుకునేందుకు.. ప్రాతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని అంటున్నారు.

జీతాలడిగితే శత్రువులేనా? జగన్ సర్కార్ పై ఉద్యోగులు ఫైర్

ఆడ లేక మద్దెలు ఓడు అన్నట్లు తయారైంది ఏపీలో జగన్ సర్కార్ పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, విధ్వంసక  పాలన, అన్నిటినీ మించి ఆర్థిక అరాచకత్వం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగా  రాష్ట్రం దివాళా అంచుకు చేరింది. ఇంత కాలం అప్పులు చేసి పబ్బం గడుపుకున్న జగన్ సర్కార్ కు రానున్న మూడు నెలల కాలం.. అంటే బడ్జెట్ వరకూ చిల్లు కానీ కూడా ఖర్చు చేయడానికి సొమ్ములు లేని పరిస్థితిలో ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కాదు కదా, రోజువారీ ఖర్చులకు కూడా ఖజానాలో సొమ్ములు లేని పరిస్థితి. ఈ పరిస్థితి ఎదురు  కావడానికి జగన్ సర్కార్ విధానాలే కారణమనడంలో సందేహం లేదు. అయినా వాస్తవాలను దాచి పెట్టి మసిపూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నిస్తోంది. సమయానికి జీతాలందని ఉపాధ్యాయుులు వేతనాలెప్పుడని నిలదీస్తుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వేతనాలివ్వండి అని ఉద్యోగులు అడుగుతుంటే.. ప్రభుత్వం మాత్రం అలా అడిగినందుకు ఉద్యోగులపై కారాలూ మిరియాలూ నూరుతోంది. అసలు వారి పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరిస్తోంది. వారికి ఇవ్వాల్సిన రాయితీలు, అలవెన్నుల మాట దేవుడెరుగు జీతాల కోసమే దేబిరించాల్సిన పరిస్థి కల్పించింది. అక్కడితో ఆగకుండా వేతనాలు అడిగినందుకు ఎదురు అసలు మీరు పని చేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తోంది. సమయపాలన ఏదీ అంటూ నిలదీస్తోంది. జనవరి 1నుంచి ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ కు అమలు చేస్తోంది. తన తప్పు కప్పిపుచ్చుకుని ఎదురు ఉద్యోగులను పని చేయకుండా జీతాలు తీసుకుం టున్నారన్నట్లుగా మీరు ఏ రోజు సమయానికి వచ్చారని నిందలేస్తోంది. ఈ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్సు ను ఉద్యోగులు తమ ఫోన్లలో యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. పది నిముషాలు ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించి వేతనాలు కట్ చేస్తామనిన హెచ్చరిస్తోంది. పది నిముషాలు ఆలస్యం చేస్తే ప్రభుత్వం జీతం కట్ చేస్తుంది సరే.. మరి వేతనం ఆలస్యంగా ఇస్తున్న ప్రభుత్వానికి ఏం కట్ చేయాలన్న ప్రశ్న ఎదురౌతోంది. పవర్ కట్ చేయడమొక్కటే మార్గమని అధిక శాతం మంది ఉద్యోగులు అంటున్నారు. హాజరు విషయంలో ఇంత కచ్చితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరి వేతనాలు ఇచ్చే విషయంలో ఎందుకు అంత కచ్చితంగా ఉండటం లేదని ఉద్యోగులు అంటున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొదటి నుంచీ కక్ష పూరితంగనే వ్యవహరిస్తోంది. వేతనాలు జాప్యం, పీఎఫ్ తదితర ప్రయోజనాల విషయంలోనూ అలసత్వం, ఏకంగా ఉద్యోగుల పీఎఫ్ ను వాడేసుకుని తిరిగి ఇవ్వకపోవడం వంటి చర్యలతో ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. తమ హక్కుల పరిరక్షణ కోసం, వేతనాల కోసం ఉద్యమిస్తే కేసులు పెట్టివేయడం, అణచివేతకు గురి చేయడం వంటి చర్యలతో దమనకాండకు తెగపడుతోంది. సమస్యలు పరిష్కరించడం మాట అటుంచి వారిపై ఒత్తిడి పెంచి ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వ తీరు మారకుంటే సంక్రాంతి తరువాత నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. హక్కుల పరిరక్షణ కోసం తగ్గేదేలే అని ఉద్యోగులు అంటున్నారు. ముందు ముందు ప్రభుత్వం ఉద్యోగుల మధ్య అగాధం మరింత పెరగడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగితే ప్రభుత్వానికి చిక్కులు తప్పవంటున్నారు. 

రాహుల్ భారత్ జోడో యాత్రలో గులాంనబీఆజాద్.. హోం కమింగ్ కు సంకేతమేనా?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సత్ఫలితాలను ఇస్తోంది. పార్టీ అధిష్ఠానంతో విభేదించి బయటకు వెళ్లిన వారు ఒక్కొక్కరుగా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది. రాహుల్ పాదయాత్రతో పార్టీకి పునర్వైభవం సిద్ధిస్తుందని అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. అలాగే కాంగ్రెస్ కు ఏ మాత్రం పట్టు లేని రాష్ట్రాలలో కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన లభించడం, జనం పెద్దగా రావడం దేశంలో కాంగ్రెస్ కు జనాదరణ పెరుగుతోందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఈ కారణంగానే పార్టీకి దూరమైన నాయకులు కూడా ఒక్కరొక్కరుగా ఘర్ వాపసీకి రెడీ అవుతున్నారని చెబుతున్నారు. గతంలో నేరుగా రాహుల్ గాంధీపైనే విమర్శలు గుప్పిస్తూ అప్పటి అధినేత్రి సోనియాగాంధీకి బహిరంగ లేఖ రాసి మరీ పార్టీ నుంచి బయటకు వెళ్లి సొంత కుంపటి పెట్టుకున్న గులాం నబీ ఆజాద్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో  యాత్ర జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించగానే గులాం నబీ ఆజాద్  ఆయనతో అడుగు కలుపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా పార్టీలో అసమ్మతి వాదులుగా ముద్ర పడిన జీ-23 నాయకులు కూడా ఒక్కరొక్కరుగా తమ రాహుల్ నాయకత్వాన్ని ఆమోదిస్తూ పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. ఆ కారణంగానే జీ-23 నాయకుడు  అఖిలేష్ ప్రసాద్ సింగ్ ను బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ హై కమాండ్ నియమించింది. అలాగే మరో అసమ్మతి నాయకుడు భూపీందర్ సింగ్ హుడాకు హర్యానా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. ఇక పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొంది.. అధిష్టానం వైఖరిపై అసంతృపతి వ్యక్తం చేసి పార్టీ వీడిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అడుగులు కూడా మళ్లీ కాంగ్రెస్ దిశగానే పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీఆజాద్ డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే నాలుగు నెలల వ్యవధిలోనే ఆయన కాంగ్రెస్ దేశంలో బీజేపీని ఎదుర్కొనగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. అంతకు ముందు రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా ఆ యాత్ర కన్వీనర్ దిగ్విజయ్ సింగ్ గులాం నబీ ఆజాద్ ను కోరారు. అలాగే ఎంపీ అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. గులాంనబీ ఆజాద్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలను బట్టి త్వరలో గులాం నబీ ఆజాద్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు, 

ముగిసిన రాష్ట్రపతి శీతాకాల విడిది

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి విదితమే. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేశారు.  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు.  శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట వైమానిక స్థావరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. రాష్ట్రపతికి మంత్రులు, అధికారులు వీడ్కోలు పలికారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 26వ తేదీన హైదరాబాద్ కు వచ్చిన సంగతి విదితమే. నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి ఇక్కడ విడిది చేశారు. ఆ నాలుగు రోజులూ ఆమె బిజీగా గడిపారు.   డిసెంబర్ 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థను విజిట్ చేశారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. అలాగే ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 28న భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. అక్కడ ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. అలాగే వరంగల్ లోని రామప్ప ఆలయాన్ని దర్శించారు. గురువారం (డిసెంబర్ 27) నారాయణమ్మ కాలేజ్ ను విజిట్ చేశారు. ఆ తర్వాత ముచ్చింతల్ లోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. శనివారం( డిసెంబర్ 29) ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి ముర్ము దర్శించుకున్నారు . మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ముర్ము.. 3గంటల 40 నిమిషాలకు హకీంపేట నుంచి ఢిల్లీ పయనమయ్యారు.

ఏపీలో ముందస్తు తథ్యం.. మేలోనే ముహూర్తం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. వచ్చారు. అయితే ఎందుకు వెళ్లారు? వెళ్లి ఏమి చేశారు? ఎవరిని కలిశారు, ఏమి మాట్లాడారు? ఏమి సాధించారు, ఏమి తెచ్చారు? అంటే  మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టం. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.  గతంలో ఆ ఇద్దరికి ఇంకొందరు కేంద్ర మంత్ర్రులకు అనేక మార్లు ఇచ్చిన, వినతి పత్రం అనబడే కోర్కెల చిట్టా   డేట్ మార్చి మరో మారు కేంద్ర నాయకులకు సమర్పించారు. నిజానికి ప్రదాని మోడీ, హోం మంత్రి అమిత్ షాకు ఇచ్చిన వినతి పత్రంలో ఏదైనా ఒకటీ అరా కొత్త కోర్కెలు ఉంటే ఉన్నాయేమో కానీ, మిగిలివన్నీ సేమ్ టూ సేమ్  అదే ఇది ఇదే అది. మూడున్నరేళ్ళుగా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లి పెద్దలకు ‘సమర్పించు’ కుంటున్న వినతులే ఇందులోనూ ఉన్నాయి.  అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది, ఇప్పటికే అనేక మార్లు సమర్పించిన వినతి పత్రాన్ని మరోమారు సమర్పించడానికి కాదు ముందస్తు ఎన్నికలకు ‘పెద్దల’ అనుమతి తీసుకునేందుకేనని అంతర్గత వర్గాల సమాచారం. నిజానికి, ప్రజలు వైసీపీకి ఐదేళ్లకు అధికారం ఇచ్చినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అరాచక పరిపాలన, అన్నిటినీ మించి ఆర్థిక రంగంలో క్రమశిక్షణ రాహిత్యం పుణ్యాన మూడున్నరేళ్ళకే రాష్ట్రం దివాళా అంచులకు  చేరుకుంది.  పూర్తి కాలం బండి లాగడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి అయ్యే పని కాదని ఇప్పటికే తేలిపోయింది. అందుకే,. ముందస్తుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  నిజానికి మిగిలిన కాలం సంగతి ఎలా ఉన్నా, ముందున్న మూడు నెలలు మహా గడ్డు కాలం. జీతాలకు కాదు కదా, కనీసం చాయి బిస్కెట్  వంటి రోజువారీ ఖర్చులకు కూడా ఖజానాలో కాసులు లేవు. అందుకే  ఈ మూడు నెలలు కొత్త అప్పుల కోసం కేంద్రం కరుణించి అనుమతి ఇస్తే మార్చిలో బడ్జెట్ ఓకే చేసుకుని, మే  ఎన్నికల కసరత్తు ప్రారంభించాలనే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.  అందుకే ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి మోడీ, షాలకు పరిస్థితిని వివరించి...ఈ మూడు నెలలు ఆదుకుంటే ... కొత్త బడ్జెట్  ఆమోదం పొందిన తర్వాత కొత్త అప్పులతో ‘సంక్షేమ’ పథకాలు కొనసాగించి అక్టోబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళతానని, అందుకు అనుమతించాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే  అందుకు మోడీ, షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే, మచిలీపట్నం,రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం పేరిట రూ.12 వేల కోట్ల ఋణం ఇచ్చేందుకు, గ్రామీణ విధ్యుదీకర్ణ సంస్థ ( ఆర్ఈసీ), పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ ( పీఎఫ్’సీ) సూత్ర ప్రాయంగా అంగీకరించి నట్లు తెలుస్తోంది. ఇందులో 20 శాతం అంటే, అంటే దాదపు రూ.2.400 కోట్లు తక్షణం ఏపీ మ్యారిటైం బోర్డుకు ఆర్ఈసీ ఇస్తుందని అధికార వర్గాల సమాచారంగా తెలుస్తోంది. ఏ నేపధ్యంలోనే వైసీపీ సర్కార్ నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం మార్చిలో ముగిసిన తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు చోట చేసుకోబోతున్నాయని చెప్తున్నారు. అందుకు తగినట్లుగానే ప్రభుత్వం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది.  ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పూర్తి స్థాయిలో  ఎన్నికల మూడ్  లోకి వెళ్లిపోయారని అంటున్నారు. ఓ వంక మార్చిలో  గడప గడప చివరి రివ్యూ తర్వాత అభ్యర్ధులను ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా పేర్కొన్నారు. మరో వంక ఆయన ప్యాలెస్ గడప దాటి, బయటకు వచ్చారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాలను గమనిస్తే, ఎలక్షన్ టోన్  స్పష్టంగా వినిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూనే,  ప్రతిపక్ష పార్టీలు నాయకులు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీలో కీలక నేతలు అంతర్గతంగా సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బయటికి మాత్రం ముందస్తు ఎన్నికల సమస్యే లేదని ప్రకటనలు గుప్పిస్తున్న నేతలు అంతర్గంతగా మాత్రం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సన్నిహితుల ద్వారా  తెలుస్తోంది.  అదలా ఉంటే మంత్రి బొత్స సత్యనారాయణ  శుక్రవారం(డిసెంబర్ 29) విజయనగరం జిల్లా రాజాం నియోజక వర్గం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు. ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు, ఇద్దరు గృహ సారథులను నియమించాం..వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళబోతున్నాం  అని కుండబద్దలు కొట్టారు. అంతే కాదు,జనవరి 1 నుంచి కన్వీనర్లు., గృహ సారథులు క్రియాశీలంగా వ్యవహరిస్తారని చెప్పారు. అంటే కొత్త సంవత్సరం తొలి రోజు నుంచే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నామని బొత్స చెప్పకనే చెప్పారు.   అదలా ఉంటే  జగన్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జనవరి 8న ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. జనవరి 26 తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న గ్రామీణ ప్రాంత  పాదయాత్రలకు సన్నాహకంగా, జనవరి 8న  కర్నూలులో.. హిందూపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో అమిత షా పాల్గొంటారని పార్టీ ప్రకటించింది. అలాగే, జనవరి 26 తర్వాత రాష్ట్రంలోని  13 వేల గ్రామాల్లో బీజేపీ చేపట్టే సంపర్క పాదయాత్రలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. సో .. అటు వైసీపీ, ఇటు బీజేపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ కదలికలు ముందస్తు ఎన్నికలకు స్పష్టమైన సంకేతాలని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే, ఏపీలో ముందస్తు ఎన్నికలు తథ్యమని  ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందుగానే పసిగట్టారు. వచ్చే ఏడాది మే లేదా అక్టోబర్‌లో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మరోమారు ముందస్తు ప్రస్తావన చేశారు. ఓటమి భయంతోనే జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారం 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఓటమి భయంతో ముందస్తుకు వెళ్లనున్నారని అన్నారు. మరో వంక ముందస్తు ఎన్నికలను ముందుగా పసిగట్టిన చంద్రబాబు నాయుడు, ఇప్పటికే జిల్లాల పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. బాదుడే బాదుడు.. ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. సో.. అటు అధికార పార్టీ అడుగులను గమనించినా , ఇటు ప్రతిపక్షం దూకుడు  గమించినా , ముందస్తు ఎన్నికలు తథ్యం ... అంటున్నారు విశ్లేషకులు.

సొంత విమానాలు, చాపర్లపై సీఎంల మోజు

పార్టీ అధినేతలూ, ముఖ్యమంత్రులకు ఇటీవలి కాలంలో సొంత చాపర్లు, విమానాల మీద మోజు పెరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కనీసం పట్టించుకోకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇలా చాపర్లు, విమానాల కొనుగోలుకు వినియోగించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.  తెరాసను భారాసగా మార్చేసి జాతీయ రాజకీయాలలోకి దూకేసిన కేసీఆర్ ఇక  దేశ వ్యాప్తంగా చేసే పర్యటనల కోసం.. అవును కేవలం ఆయన పర్యటనల కోసమే రూ.80 కోట్లతో సొంత చార్టెడ్ విమానాన్ని కొనుగోలు చేయనున్నారు. ఇప్పటి వరకూ దేశంలో  ఏ రాజకీయ నాయకుడూ చేయని సాహసం ఇది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నెల నెలా ఒకటో తేదీకి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని ఎత్తి చూపుతూ విపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా ఆయన సొంత విమానం కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. పైగా ఆ విమానం ఖర్చు పార్టీ నేతలు కొందరు బరిస్తారంటున్నారు. అయితే లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె పేరు బయటకు రావడంతో... ఇక ఇలా కాదు.. నాకు విమానం వాళ్లూ, వీళ్లూ కొనిచ్చేదేమిటి..తానే కొనేస్తే పోలా అనుకున్నారు. కాగా ఇలా ప్రత్యేక విమానంలో, అంటే సొంతంగా తన కోసమే ఏర్పాటు చేసుకున్న విమానంలో జాతీయ పర్యటనలు చేసిన చరిత్ర గతంలో మోడీకి మాత్రమే ఉంది. అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోడీ 2014 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా దేశ మంతటా ప్రత్యేక విమానంలో పర్యటనలు చేశారు. అయితే ఆ విమానాన్ని ఆయన కొనుగోలు చేయలేదు. ఆయనకు సన్నిహితుడిగా, మిత్రుడిగా ఉన్న ఓపారిశ్రామిక వేత్త మోడీ కోసం దానిని సమకూర్చారు.   ఇప్పుడు తాజాగా నితీష్ కుమార్ కూడా ప్రభుత్వంలోని వీవీఐపీలు తిరిగేందుకు జెట్ విమానాలు, చాపర్లు కొనాలని నిర్ణయించారు. ఈ కొనుగోలు ప్రభుత్వం తరఫున చేయాలని నిర్ణయించేశారు. కేసీఆర్ సొంత విమానం కొనడంపై ఎలాగైతే విమర్వలు వెల్లువెత్తాయో, ఇప్పుడు నితీష్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ప్రభుత్వం జెట్ విమానాలు, చాపర్లు కొనుగోలు చేయాలన్న నిర్ణయంపై కూడా అలాగే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం 250కోట్ల రూపాయల ఖర్చుతో జెట్  విమానాలు, చాపర్లు కొనుగోలు చేయడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. 

మారియన్ బయోటెక్ లో ఉత్పత్తి నిలిపివేత

ఉజ్బెకిస్థాన్ లో 18 మంది చిన్నారుల మరణాలకు కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడా ఫార్మా కంపెనీ మారియన్ బయోటెక్ లో ఉత్పత్తి నిలిచిపోయింది. కేవలం దగ్గు మందులే కాకుండా అన్ని రకాల మందుల ఉత్పత్తి నిలిచిపోయింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీవో) మారియన్ బయోటెక్ ప్లాంట్ ను తనిఖీ చేసి,  ఔషధ తయారీని నిలిపివేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.  కాగా మారియన్ బయోటెక్ లో ఉత్పత్తిని నిలిపివసినట్లు  ఆ సంస్థ కూడా ధృవీకరించించింది.   మారియన్ బయోటెక్ కు చెందిన డాక్-1 అనే దగ్గు మందును   తీసుకున్న  18 మంది  మరణించినట్టు ఉజ్బెకిస్థాన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, ఔషధ నియంత్రణ, ప్రమాణాల మండళ్లు స్పందించాయి.  డాక్-1 దగ్గు మందు శాంపిళ్లను రీజినల్ డ్రగ్ లేబరేటరీకి పంపించినట్టు మాండవీయ ప్రకటించారు. వచ్చిన నివేదిక ఆధారంగా   చర్యలు తీసుకుంటామన్నారు.  దగ్గు మందు సిరప్‌లో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్‌ ఉన్నట్టు లేబరేటరీ పరీక్షల్లో వెల్లడైనట్లు ఇప్పటికే ఉజ్బెకిస్థాన్ ప్రకటించింది.   దగ్గు మందులో ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్టు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. దీంతో డాక్ 1 మ్యాక్స్ ట్యాబ్లెట్లు, సిరప్ ను  అన్ని మందుల షాపుల నుంచి విత్ డ్రా చేస్తున్నట్లు పేర్కొంది. 2022లో ఇలా భారత్ లో తయారైన దగ్గు మందు సేవించి చిన్నారులు మరణించటం ఇదే మొదటి సారి కాదు.   ఇంతకు ముందు అంటే అక్టోబర్ లో అక్టోబర్‌లో   గాంబియాలో 70 మంది చిన్నారులు మేడ్ ఇన్ ఇండియా కాఫ్ సిరప్ కారణంగా మరణించారు. దీనికి కారణమైన హర్యానా లోని మైడెన్ ఫార్మాను అప్పట్లో కేంద్రం సీజ్ చేసింది కూడా.   ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు భారతీయ కంపెనీ   దగ్గు మందు కారణంగా పిల్లలు మరణించినట్లు అధికారిక ధృవీకరణ లేదు. తాజాగా  ఉజ్బెకిస్థాన్‌లో దగ్గు మందు తాగి  చిన్నారులు మృతి చెందడంపై తదుపరి పరిశోధనలకు సహకరించేందుకు డబ్ల్యుహెచ్ ఓ చర్యలకు ఉపక్రమించింది.  చ 

మీ అమ్మ మాకూ అమ్మే.. మోడీకి మమత సంతాప సందేశం

రాజకీయ పక్షాలు శత్రువుల్లా కాకుండా ప్రత్యర్థులుగా వ్యవహరించాలి. అయితే తెలుగు రాష్ట్రాలలో ఆ పరిస్థితి ఇసుమంతైనా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీల మధ్య శత్రుత్వం ఉందా అన్నట్లుగా వారి విమర్శలు, వ్యాఖ్యలు ఉంటున్నాయి. వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ విమర్శలు కాదు దూషణలకు పాల్పడుతున్నారు. కానీ రాజకీయాలకు అతీతంగా ఒక మానవీక కోణం ఉందన్నసంగతిని మరచిపోతున్నారు. మంచి జరిగినప్పుడు అభినందించడం.. ఏదైనా విషాదం జరిగినప్పుడు సానుభూతి వాక్యాలు చెప్పడం.. విజ్ణత అనిపించుకుంటుంది.  అలాటి విజ్ణతను   పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చూపారు. తల్లిని కోల్పోయిన విషాదంలో ఉండి కూడా ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ లో  హౌరా నుంచి న్యూ జల్పాయిగురి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోడీకి పంపింన సంతాప సందేశంలో హృద్యంగా స్పందించారు. తల్లి పోయిన బాధలో ఉన్నారు. అయినా పశ్చిమ బెంగాల్ కు వందే భారత్ రైలును ప్రారంభించారు. అందుకు దన్యవాదాలు అని పేర్కొన్నారు. తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న మీకు ప్రగాఢ సాను భూతి. మీకు తల్లి మాకు కూడా తల్లే.. మీకు భగవంతుడు ఈ విషాదాన్ని తట్టుకునే మనో బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.. దయచేసి కొంత విశ్రాంతి తీసుకోండి అని ట్వీట్ చేశారు.   మీకు ఈ రోజు ఎంతో విచారకరమైనది. అయినప్పటికీ, ఈ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరు కావడం అదొక గౌరవం.   మీ పని ద్వారా మీ అమ్మగారి పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారు  అని మమతా బెనర్జీ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.  

మాణికం ఠాకూర్ కు ఉద్వాసన

కొత్త సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులకు హైకమాండ్ శ్రీకారం చుట్టనుందా అన్న ప్రశ్నకు పార్టీ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభానికి కారణమైన సీనియర్, జూనియర్ల మధ్య అగాధాన్ని పూడ్చేందుకు మధ్యే మార్గంగా కీలక మార్పులకు శ్రీకారం చుట్టనుందని  అంటున్నారు. సీనియర్లలో అసంతృప్తి ఒకింత తగ్గించి, అదే సమయంలో  జూనియర్లను చిన్నబుచ్చకుండా పార్టీలో మార్పులు, చేర్పులూ చేసేందుకు పార్టీ హైకమాండ్ కసరత్తు చేసిందని చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో ఈ మార్పులు జరుగుతాయని చెబుతున్నారు.  ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్లకు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణికం ఠాగూరుకు కొత్త సంవత్సరం తొలి నెలలోనే ఉద్వాసన పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ లో అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని నియమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నాయి. అసలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా ఇటీవల రాష్ట్ర పార్టీలో సంక్షోభ నివారణకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ నే నియమించాలన పార్టీ హైకమాండ్ భావించినా అందుకు డిగ్గీ రాజా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మరో సమర్ద నేత కోసం అన్వేషణ మొదలైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   సీనియర్లతో పాటుగా పార్టీ మారిన నేతలు కూడా మాణికం ఠాకూర్ పై  తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, అలాగే    పార్టీలో సంక్షోభ నివారణ కోసం రాష్ట్రానికి వచ్చిన డిగ్గీ రాజా ఎదుట సీనియర్లు  ఠాగూర్‌పై ఫిర్యాదులు చేయడంతో అధిష్ఠానం  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా కొత్త వ్యక్తిని నియమించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  పార్టీలో విభేదాల పరిష్కారం విషయంలో మాణికంఠాకూర్ విఫలమయ్యారన్న అభిప్రాయం పార్టీ హైకమాండ్ లో వ్యక్తం అవుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ పై కూడా సీనియర్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయనను మార్చే విషయంలో ఏఐసీసీ సుముఖంగా లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.   ప్రస్తుతం సీనియర్ల తిరుగుబాటు నేపథ్యంలో వారిని చల్లబరిచేందుకు  రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న మాణిక్కం ఠాగూర్‌ను తప్పించడమే మార్గమని పార్టీ హైకమాండ్ భావిస్తోందంటున్నారు  డిగ్గీ రాజా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన నేపథ్యంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకులు  రణదీప్ సుర్జేవాలా,  పీ పన్నాలాల్ పునియా పృథ్వీరాజ్ చౌహాన్​ పేర్లు హైకమాండ్ పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద మాణికం ఠాకూర్ ను మార్చడం ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ సంక్షోభానికి తెరపడుతుందని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది.