నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

 సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ  ఇక లేరు. గత కొంత కాలంగా అస్వస్థతతో తీసుకుంటున్నా ఆయన శుక్రవారం (డిసెంబర్ 23)  ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  కృష్ణా జిల్లా కౌతవరం లో  జన్మించిన సత్యనారాయణ గుడివాడ లో గ్రాడ్యుయేషన్ చేశారు. నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వెండితెరపై తొలిసారిగా   సిపాయి కూతురు  సినిమాలో  నటించారు. ఆ తర్వాత పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో హీరోగా, విలన్‌గా నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి నటులతో సత్యనారాయణ నటించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలుశనివారం  నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కైకాల ప్రవేశించారు.  తెలుగు దేశం పార్టీలో చేరి   1996లో   మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత 1998లో  లోక్ సభకు మళ్లీ ఎన్నికలు జరగ్గా    పోటీ చేసి. కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన అటు రాజకీయాలలోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ వివాద రహితుడిగా పేరొందారు.

డిగ్గీ ప్రవచనాలతో అసమ్మతి అగ్గి చల్లారేనా ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం దూతగా మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ హైదరాబద్ వచ్చారు. గాంధి భవన్ లో గంటల తరబడి చర్చలు జరిపారు. విస్వసనీయ  సమాచారం మేరకు ఒక్కొక్కరిని పిలిచి  ఏమిటి విషయం, అని ప్రశ్నించారు. మీరేమిటి, మీరు చేస్తున్నదేమిటి? తెలంగాణలో భారాస ప్రభుత్వాన్ని, ఓడించడానికి మీ వద్ద ఉన్న వ్యూహం ఏమిటి? అంటూ, దిగ్విజయ సింగ్, ప్రతి ఒక్కరినీ పరిపరివిధాల ప్రశ్నించారు. అందరి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.  అలాగే, ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న విబేధాలు భగ్గుమనేందుకు కారణమైన  కమిటీలపై వ్యక్తమైన అసంతృప్తి పైనా ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచి ఆరా తీశారు. కొందరికి కొంత ఘాటుగా చురకలు అంటించినట్లు తెలుస్తోంది. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటి?  పార్టీని రక్షించాల్సిన మీరే.. సమస్యగా మారితే ఎలా? అంటూ కొందరు సీనియర్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏవైనా సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేతల అభిప్రాయాలను ఆయనే స్వయంగా నమోదు చేసుకున్నారు. అంతే కాదు పార్టీలో జూనియర్‌, సీనియర్‌ పంచాయితీ మంచిది కాదు. సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలి.. మీడియా ముందు మాట్లాడటం సరికాదు. కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో అధిష్ఠానం గమనిస్తోంది. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే .. హై కమాండ్‌ చూస్తూ ఊరుకోదు. బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏమిటి? పార్టీ బలోపేతం కోసం మీ పాత్ర ఏంటి.. మీరు ఏం చేశారు? అంతర్గత సమస్యపై మీ అభిప్రాయం .. పరిష్కారం కోసం మీ సలహా ఏంటి? అని దిగ్విజయ్‌ సింగ్‌ నేతలను ప్రశ్నించినట్టు  సమాచారం. సరే..లోపల జరిగిన సంగతులు ఎలా ఉన్నా గాంధీ భవన్ ప్రాంగణంలో మీడియా కెమెరాల సాక్షిగా జరిగిన సంఘటనలు గమనిస్తే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుల మధ్య సాగుతున్న, ‘వార్’  డిగ్గీ రాజా ధర్మ ప్రవచనాలతో ముగిసేలా లేదని మాత్రం అందరికీ అర్థమైందని, కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా మీడియా ముందుకొచ్చి మరీ ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవడం కాదు, రేవంత్ రెడ్డిని విలన్ లా  చిత్రించేందుకు ఓయూ విద్యార్థి నేతలు ఏమాత్రం వెనకాడలేదు. తగ్గేదే లే అంటూ దూసుకు పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంతవరకు నాలుగు గోడల వరకే పరిమితం అయిన యుద్ధం ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారింది. కొందరు కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారంటూ నాయకులపై విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇటీవల సీనియర్‌ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్‌ పై ఓయూ విద్యార్థి నేతలు భౌతిక దాడికి ప్రయత్నించారు. దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అనంతరం గాంధీభవన్‌ నుంచి  బయటకు వస్తున్న అనిల్‌ పై ఓయు విద్యార్థి నేతలు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న మల్లు రవి, ఇతర సీనియర్‌ నేతలు విద్యార్థులను అడ్డుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఎంతోకాలంగా కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేస్తున్నామని.. అయినా, కమిటీల్లో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్‌ కాంగ్రెస్‌ అంటూ నినాదాలు చేశారు.  ఈ పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కేంద్ర బిందువుగా సాగుతున్న రచ్చకు, రేవంత్ రెడ్డి మాత్రమే సమాధానం ఇవ్వగలరని కొందరు సీనియర్ నాయకులు  అంటున్నారు. నిజంగా ఆయనకు  కాంగ్రెస్ పార్టీని రక్షించే యోచనే ఉంటే, ఆయన చేసిన తప్పులను ఒప్పుకుని, పదవి నుంచి తప్పుకుంటే హుందాగా ఉంటుందని అంటున్నారు. రేవంత్ సృష్టించిన సమస్యకు ఆయనే పరిష్కారం చూపాలని అంటున్నారు. అయితే, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని అనుకోలేమని, మరి కొందరు నాయకులు పేర్కొంటున్నారు. సో .. మొత్తంగా చూస్తే,కాంగ్రెస్ లో  పాత కొత్త నేతల మధ్య భగ్గుమంటున్న విబేధాలు ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా లేవనే పరిశీలకులు అంటున్నారు.

పెన్సిల్ పొట్టు గొంతులోకెళ్లి చిన్నారి మృతి

పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని పిల్లలు.. వారి అమాయకత్వంతో ఒక్కో సారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అందుకే చిన్నారులను ఎప్పుడూ తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పటి కప్పుడు వారు ఏం చేస్తున్నారు? అన్నది ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఇళ్లల్లో ఆడుకునే టప్పుడు, చదువుకునేటప్పుడూ కూడా పిల్లలను గమనిస్తూనే ఉండాలి. ఆరేళ్ల పిల్ల హోం వర్క్ చేసుకుంటూ తెలియకుండానే చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఆ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హమీర్ పూర్ కొత్వాలి ప్రాంతం పహాడీ వీర్ గ్రామానికి చెందిన నందకుమార్ కు ముగ్గురు పిల్లలు. అందరిలోకీ చిన్న పిల్ల ఆర్తిక (6) తన అన్న, అక్కతో కలిసి టెర్రస్ పై చదువుకుంటోంది. ఆ క్రమంలో తన పెన్నిల్ చెక్కుకుందామనుకుంది. షార్పనర్ ను నోట్లో పెట్టుకుని పెన్సిల్ చెక్కుకుంది. ఈ క్రమంలో పెన్సిల్ పొట్టు నోట్లోకి వెళ్లి గొంతులో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరైంది. తల్లి దండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే ఆ పాప మరణించింది. 

కేంద్ర కేబినెట్ లోకిబీసీ నేత.. కిషన్ రెడ్డి కి చెక్ చెప్పేందుకేనా?

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు గంగాపురం కిషన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. అవును. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజక వర్గంలో, స్థానిక కార్యక్రమాల్లో తప్పించి, రాష్ట్ర స్థాయి రాజకీయ, పార్టీ  కార్యకలాపాలలో పెద్దగా ఎక్కడా కిషన్ రెడ్డి కనిపించడం లేదు. అలాగే తెలంగాణ రాష్ట్ర బీజీపీలో ఆయన వర్గంగా ముద్రపడిన ముఖ్య నాయకుల వాయిస్ కూడా ఎక్కడా అంతగా వినిపించడం లేదు. అయితే ఇది యాదృచ్చికంగా జరుగుతోందా లేక పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నట్లుగా కేంద్ర నాయకత్వం ఉద్దేశపూర్వకంగానే కిషన్ రెడ్డి పవర్  కట్ చేసిందా? అంటే రెండవదే నిజమని అందుకే, ఆయన సైలెంటై పోయారని  పార్టీ వర్గాల సమాచారంగా ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు ఎలా ఉన్నా  భారాస నేతలతో ఆయన రహస్య సంబంధాలు వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరోవంక  తెలంగాణలో గెలుపు కోసం పటిష్ట వ్యూహంతో పావులు కదుపుతున్న బీజేపీ కేంద్ర నాయకత్వం  బీసీ ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకుని  ఆ వర్గాల ప్రజలను అక్కున చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో బీసి నాయకులకు పెద్ద పీట వేయలానే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. నిజానికి, గత జులైలో హైదరాబాద్ లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు ముందు నుంచే బీజేపీ జాతీయ నాయకత్వం బీసీ ఓటు బ్యాంక్  టార్గెట్ గా పావులు కదుపుతోంది. బండి సంజయ్ కి పార్టీ అధ్యక్ష బాద్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం, బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ బీజేపీ బీసీ మోర్చా జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో పాటుగా, ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్య సభకు పంపింది. అలాగే ఎమ్మెల్యే ఈటల  రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించడంతో పాటుగా, భవిష్యత్ లో ఆయనకు మరింత ‘ముఖ్య’ బాధ్యతను అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.  అదలా ఉంటే ఇప్పడు  ఢిల్లీ నుంచి గల్లీ వరకు వినిపిస్తున్న మరో  టాక్  నిజమైతే  తెలంగాణ నుంచి మరో బీసీ నేతకు కీలక పదవి  దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్త సంవత్సరం తొలి నెలలో సంక్రాంతి పండగకు కొంచెం అటూ ఇటూగా జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లేదా రాజ్య సభ ఎంపీ లక్ష్మణ్ లలో ఒకరికి  బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది. నిజానికి, ఈ ఇద్దరితోనూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడివిడిగా చర్చలు జరిపారు. దీంతో ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరికీ ఇచ్చినా ఆశ్చర్య పోనక్కరలేదని అంటున్నారు.  అదలా ఉంటే  బీజేపీ జాతీయ నాయకత్వం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భారాస నాయకత్వంతో లోపాయికారీ, రహస్య సంబంధాలు కొనసాగిస్తున్నరనే అనుమానంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన  ప్రాధాన్యతను తగ్గించే నిర్ణయం కూడా తీసుకుందని అంటున్నారు.అందుకే ఢీ అంటే ఢీ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితపై మాటకు మాట తూటాకు తూటా అన్నట్లుగా డైరెక్ట్ గా ఎటాక్  చేస్తున్న ధర్మపురి అరవింద్ కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కలిపించే అవకాశాలున్నాయని అంటున్నారు.  ఇంత వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి  కిషన్ రెడ్డి ఒక్కరే మంత్రిగా ఉన్నారు. అయినా  కేంద్ర పథకాలు,రాష్ట్రానికి వస్తున్న కేంద్ర  నిధుల విషయంలో భారాస మంత్రులు, నాయకులు ప్రతి నిత్యం చేస్తున్న  తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో అయన విఫల మయ్యారని, అంతే కాకుండా కేసీఆర్, కేటీఆర్ తో రహస్య వ్యవహారాలు సాగిస్తున్నారనే పక్కా సమాచారంతోనే ఆయన ప్రాధాన్యతను తగ్గించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని అంటున్నారు. అలాగే, ధర్మపురి అరవింద్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కలిపించడం ద్వారా, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ చక్రం తిప్పగల సామర్ధ్యమున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు,  మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) సేవలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగించుకునే ఆలోచన ఉందని పార్టీ వర్గాల సమాచారం. అలాగే కేంద్రంలో కీలక పదవులతో పాటుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా బీసీ నేత పేరును ప్రకటించే అవకాశం లేక పోలేదని అంటున్నారు. అయితే చివరకు ఏమి జరుగుతుంది? ఎవరిని ఏ పదవి వరిస్తుంది అనేది వేచి చూడవలసిందే...రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చ అని కదా అంటారు.

భారత్ తో రెండో టెస్ట్.. తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోరుకే కుప్పకూలిన బంగ్లాదేశ్

రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మీర్ పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య గురువారం(డిసెంబర్ 22) ప్రారంభమైన రెండో టెస్టు   తొలి ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. రెండు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టులో పరాజయం పాలై 1-0తో వెనుక బడిన  బంగ్లాదేశ్ రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ సమం చేయాలన్న లక్ష్యంతో టాస్ గెలిచి రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత బౌలర్లు విజృంభించడంతో  277 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లా బ్యాటర్లలో మామినుల్ హల్ (84) మాత్రమే రాణించాడు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, అశ్విన్ లు చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా ఉనాద్కత్ కు రెండువికెట్లు దక్కాయి. తరువాత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్ట పోకుండా 19 పరుగులు చేసింది. 

తెలంగాణ సర్కార్ కు ఎన్ జీటీ భారీ జరిమానా.. ఎందుకంటే?

జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలంగాణ సర్కార్ కు భారీ జరిమానా విధించింది. డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవనిపేర్కొంటూ సర్కార్ కు 900 కోట్ల రూపాయల జరిమానా విధించింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ గతంలో ఆ ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చినా.. ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొంది. పర్యావరణ అనుమతులులేకుండా ప్రాజెక్టు నిర్మించినందుకు మొత్తం నిర్మాణ వ్యయంలో 1.5 శాతం జరిమానా విధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్   చెన్నై బెంచ్ తీర్పు ఇచ్చింది.  తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టారని కోస్గి వెంకటయ్య అనే వ్యక్తి ఎన్జీటీలో పిటిషన్  వేసిన సంగతి విదితమే. ఆయనతో పాటు.. ఏపీ ప్రభుత్వం, కర్నూలుకు చెందిన చంద్రమౌళేశ్వర రెడ్డి అనుబంధ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వానికి ఈ జరిమానా విధించింది. గతంలో ఏపీలో కూడా పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులకు కూడా  పర్యవరణ అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారంటూ జాతీయ హరిత  ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించిన సంగతి విదితమే.

కరోనా వచ్చినా నో లాక్ డౌన్

కరోనా మహమ్మారి మరో మారు, ప్రపంచవ్యాప్తంగా కలకలం, కలవరం సృష్టిస్తోంది. పొరుగుదేశం, కరోనా పుట్టిల్లు చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న బీఎఫ్‌7 రకానికి చెందిన ఒమిక్రాన్‌ కేసులు భారత్ దేశంలోనూ నమోదు కావడంతో భారత వైద్యమండలి ప్రజల్ని అప్రమత్తం చేసింది. కొవిడ్‌ నియంత్రణ పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని కోరింది.  బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ను కచ్చితంగా ఉపయోగించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలని కోరుతూ ప్రకటన విడుదల చేసింది. శానిటైజర్‌ ఉపయోగించాలని చెప్పింది.  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ  లోక్‌సభలో మాట్లాడుతూ.. భారత్‌లో కొవిడ్‌ కేసుల పెరుగుదలపై కేంద్రం ఓ కన్నేసి ఉంచిందని చెప్పిన గంటల వ్యవధిలోనే ఐఎంఏ ఈ ప్రకటన జారీ చేయడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్‌గా నమూనాలను సేకరించి, పరీక్షించాలని మాండవీయ ఆదేశించిన నేపథ్యంలో ఆ ప్రక్రియ కూడా   గురువారం(డిసెంబర్ 22)  నుంచి ప్రారంభమైంది. మరోవంక  చైనా, జపాన్‌, అమెరికా సహా పలు దేశాల్లో కలవరం సృష్టిస్తున్న అధిక వ్యాప్తి సామర్థ్యంగల ఒమిక్రాన్‌ ఉపరకం బీఎఫ్‌.7 కేసులు భారత దేశంలోనూవెలుగు చూసిన నేపథ్యంలో.. తాజా పరిణామాలు మరో వేవ్‌కు దారి తీసి, దేశాన్ని మళ్లీ లాక్‌డౌన్‌లోకి నెడతాయా? అన్న కలవరం నెలకొంది. అయితే భారత వైద్య సంఘానికి చెందిన డా.అనిల్‌ గోయల్‌ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే దేశ జనాభాలో అర్హులైనవారిలో 95 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన నేపథ్యంలో.. లాక్‌ డౌన్‌ వంటి పరిస్థితి రాదని ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారతీయుల రోగనిరోధక శక్తి చైనీయుల కంటే అధికంగా ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. భారత్‌ తప్పనిసరిగా మళ్లీ ‘టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్‌’ (టిటిటి) విధానానికి మారాలని డా.గోయల్ ఈ సందర్భంగా సూచించారు. ఇప్పటికే భారత్‌ 200 కోట్లకుపైగా డోసులు అందించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ వంటి పరిస్థితి తలెత్తదు  అని చెప్పారు. మరో వైపు.. పౌరులంతా తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వినియోగం, శానిటైజర్ల వాడకం, వ్యక్తిగత దూరం పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనలతో వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది. ప్రపంచ దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఇప్పటికే ఆదేశించారు. వీలైనంత వరకు ప్రజలు జన సమూహాలకు దూరంగా ఉండాలని, వివాహాలు, రాజకీయ, సామాజిక సమావేశాలను వాయిదా వేసుకోవడం మంచిదని ఐఎంఏ సూచించింది. అత్యవసరమైతే తప్ప, సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని ప్రజలను కోరింది. జ్వరం, గొంతు నొప్పి, జలుబు, విరేచనాలు తదితర సమస్యలేమైనా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరింది. కొవిడ్‌ ప్రికాషనరీ డోసు (ముందస్తు డోసు)ను వీలైనంత తొందరగా తీసుకోవాలని సూచించింది. వివిధ దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రజలను భారత వైద్య మండలి అప్రమత్తం చేస్తోంది. తక్షణమే కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రజల్ని కోరుతోంది. గడిచిన 24 గంటల్లో అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, ప్రాన్స్‌, బ్రెజిల్‌ తదితర దేశాల్లో 5.37లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. భారత్‌లోనూ 145 కొత్తగా కేసులను గుర్తించారు. ఇందులో 4 కేసులు చైనాలో భయాందోళనలు సృష్టిస్తున్న బీఎఫ్‌7 రకానికి చెందినవి అని ఐఎంఏ ప్రకటనలో పేర్కొంది.2021 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్‌, అంబులెన్స్‌ సర్వీసులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, సంబంధిత విభాగాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐఎంఏ తన ప్రకటనలో పేర్కొంది. మరోవైపు చైనా నుంచి వచ్చే ప్రయాణికులు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండేలా కేంద్ర చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

పడి లేచిన కెరటం తెలంగాణ టీడీపీ !

తెలంగాణలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) తుడిచి పెట్టుకు పోయింది. టీడీపీ ఎమ్మెల్యేలను కారు ఎక్కించి, అసెంబ్లీలో తెలుగు దేశం వాయిస్ వినిపించకుండా చేయడంలో నిన్నటి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేటి భారత్ రాష్ట్ర సమితి (భారాస)సక్సెస్ అయింది. సంబురాలు చేసుకుంది. అలాగే, బీజేపీ నాయకులు కూడా టీడీపీ నేతలను తమవైపుకు తిప్పుకుని, వాపు చూసి బలమని సంబురాల్లో మునిగిపోయారు. అయితే అటు భారాస ఇటు బీజేపీ సంతోషం మూడునాళ్ళ ముచ్చటగా తేలిపోయింది. నిజానికి, తెలంగాణలో టీడీపీని ప్రజలు తిరస్కరించలేదు. విభజన నేపధ్యంగా, సెంటిమెంట్ ప్రభంజనంగా  జరిగిన 2014 ఎన్నికల్లోనూ తెలుగు దేశం పార్టీని తెలంగణ ప్రజలు ఆదరించారు.మిత్ర పక్షం బీజేపీతో కలిపి 20 (టీడీపీ 15, బీజేపీ 5) అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత, అధికారంలోకి వచ్చిన తెరాస  ముఖ్యమంత్రి కేసీఆర్, రాజకీయ పునరేకీకరణ పేరిట, సెంటిమెంట్ ను జోడించి తెలుగు దేశం పార్టీ శాసన సభ్యులు ఒక్కొక్కరినీ చేరదీసి చివరకు తెలుగు దేశం శాసన సభా పక్షం  టీడీఎల్పీని  తెరాస ఎల్పీలో  విలీనం చేసుకున్నారు. ఆ తర్వాత మారిన  రాజకీయ పరిణామల నేపధ్యంలో  2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ముందస్తుఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలు మాత్రమే గెలిచారు, గెలిచిన ఇద్దరూ తెరాస తీర్ధం పుచ్చుకోవడంతో తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి తెర పడిందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే  ఎప్పుడూ ఓటమిని అంగీకరించని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక్కసారి తెలంగాణపై దృష్టిని కేంద్రీకరించడంతో సీన్ మారిపోయింది. బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఖమ్మంలో నిర్వహించిన శంఖారవం సభ తెలంగాణ రాజకీయాలను కొత్త మలుపు తిప్పింది. పడి లేచిన కెరటంలా పసుపు పచ్చ జెండా మళ్ళీ రెపరెప లాడింది. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు సాగిన చంద్రబాబు శంఖారావం యాత్రకు గ్రామగ్రామాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. హరతులిచ్చారు. దీంతో తెలంగాణ పొలిటికల్ నెరేషన్ మారిపోయిందని పరిశీలకులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంతవరకు తెలుగు దేశం పార్టీ ఉనికిని గుర్తించేందుకు కూడా ఇష్టపడని భారాస నాయకత్వంలో ఒక విధంగా వణుకు మొదలైంది. సైకిల్ జోరు పెరిగితే  కారుకు బ్రేకులు తప్పవని భారాస నాయకత్వం గుర్తించింది. అదే భయం మంత్రి హరీష్ రావు స్పందనలో వినిపించింది.   ఇంతవరకు తెలుగు దేశం పార్టీని ఆంధ్రా పార్టీగా ముద్రవేసి  తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించి పబ్బం గడుపుకున్న  తెరాస ఇప్పుడు భారాసగా రూపాంతరం చెందిన నేపధ్యంలో వ్యూహాత్మకంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం జాతీయ పార్టీగా అడుగులు వేస్తున్న భారాస నేతలకు మింగుడు పడడంలేదు. మింగలేక కక్కలేక, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  ఈ నేపధ్యంలోనే మంత్రి హరీష్ రావు తమ భయాన్ని కప్పిపుచ్చుకుంటూ, టీడీపీ ఖమ్మం సభ సక్సెస్ ను చులకన చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో భారాస జెండా ఎగరేసేందుకే రాష్ట్రంలో నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను తోలుకు పోయిన హరీష్ రావు నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గన్నట్లు ఖమ్మం సభకు పక్క రాష్ట్రం నుంచి జనాలను తరలించారని ఆరోపించారు. భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో సహచర మంత్రులు పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన హరీష్ రావు చంద్రబాబు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తున్నారని.. తెలంగాణ ప్రజలు వాటిని నమ్మరని  అన్నారు. తెలంగాణలో తమకు బలముందని చూపించి బీజేపీతో పొత్తు కోసమే ఆయన ఈవిధంగా డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.  అయితే చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు సాగించిన రోడ్ షో, ఖమ్మం బహిరంగ సభ సక్సెస్  అయిందని అందుకే భారాస నాయకులు ఉమ్మడి రాష్ట్రం ముచ్చట్లు, పొరుగు రాష్ట్రం ముచ్చట్లు తీస్తున్నారని అంటున్నారు. నిజానికి, మొదటి నుంచి కూడా తెలుగు దేశం పార్టీకి తెలంగాణలో మంచి క్యాడరుంది. అందుకే నాయకులు వెళ్ళిపోయినా క్యాడర్ మాత్రం టీడీపీ పునర్జీవనాన్ని గట్టిగా కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు సభ అనూహ్యంగా సక్సెస్ అయింది. అందుకే భారాస, బీజేపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. భయం వెన్నులో వణుకు పుట్టిస్తోందని, పరిశీలకులు అంటున్నారు.

ఇవేం పోలికలు..పొగడ్తలకు హద్దూ పద్దూ ఉండక్కర్లేదా?

అభిమానం ఉండటం వేరు..  అది వెర్రి తలలు వేయడం వేరు. జాతి మొత్తాన్ని ఏకతాటిపై నడిపిన అహింసామూర్తి మహాత్మాగాంధీని..  రాజకీయ పదవుల కోసం నిత్యం వ్యూహాలు, ఎత్తులలో మునిగిపోయే వారెక్కడ. తమ అభిమాన నాయకులను మహాత్ములతో పోల్చి పొగడ్తలు గుప్పించడం నాయకులకు సర్వ సాధారణమైపోయింది. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్   భారత జాతిపిత మహాత్మాగాంధీ అయితే అభినవ భారత జాతి పిత నరేంద్రమోడీ  అంటూ  ఆకాశమే హద్దుగా తన కవితా ప్రతిభను ప్రదర్శించారు. నాగపూర్ రచయతల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చేసిన అభివన జాతి పిత వ్యాఖ్యలు రాజకీయ కాక సృష్టిస్తున్నాయి. విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతుంటే.. నెటిజన్లు విపరీంగా  ట్రోల్ చేస్తున్నారు.  స్వాతంత్ర సమరయోధులను, జాతీయ చిహ్నాలను అవమాన పరిచేలా అమృత ఫడ్నవీస్ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.  ‘ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ భావజాలం వ్యాప్తి కోసం గాంధీజీని మళ్లీ మళ్లీ చంపేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయని దుయ్యబడుతున్నారు.   అయితేఅమృతా ఫడ్నవిస్‌ ఇలా  మోదీని పొగడ్తలతో ముంచెత్తడం ఇది మొదటి సారి కాదు,  2019లో ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా పంపిన ట్వీట్‌లో ‘మన దేశ పితామహుడు నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు’  ట్వీట్ చేశారు.  ఆ కాలానికి ఛత్రపతి శివాజీ, నేటి కాలానికి డా. బీఆర్‌ అంబేద్కర్‌,  ఆధునిక కాలానికి  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఐకాన్‌లంటూ గతంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు టీ కప్పులో తుపానులా చప్పున చల్లారిపోతాయా?

ట్రబుల్ షూటర్ గా రంగంలోకి దిగిన దిగ్విజయ్ సింగ్ సీనియర్లు, జూనియర్ల మధ్య పొరపొచ్చాలను పరిష్కరించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురాగలుగుతారా? అన్న ప్రశ్నకు జవాబు మరి కొద్ది సేపటిలో లభించే అవకాశాలు ఉన్నాయి. దిగ్విజయ్ సింగ్ బుధవారం (డిసెంబర్ 22) ఉదయం నుంచీ పార్టీ నేతలతో వరుస ఫేస్ టు ఫేస్ చర్చిస్తున్నారు.   తొలుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో, వీహెచ్‌ హనుమంతరావు, దామోదర రాజనర్సింహా, రేణుకాచౌదరితో ఫేస్‌ టు ఫేస్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, పార్టీలో ఇటీవల సంభవించిన పరిణామాలపై దిగ్గీ రాజాకు రహస్య నివేదికలను అందజేసినట్లు చెబుతున్నారు.  పార్టీలో  గత కొంత కాలంగా జరిగిన, జరుగుతున్న   పరిణామాలను దిగ్విజయ్‌కు వివరించినట్లు దామోదర రాజ నర్సింహ తెలిపారు. ఇలా ఉండగా జగ్గారెడ్డి మాతరం గాంధీ భవన్ లో కాకుండా ముందుగానే డిగ్గీరాజాను ఆయన బస చేసిన హోటల్‌లోనే కలిసి తాను చెప్పదలచుకున్న విషయాలను చెప్పారు. పార్టీలో సంక్షోభం సమసి పోతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.   సీనియర్లకు గౌరవం ఇవ్వాలని,  సోషల్‌ మీడియాలో   తప్పుడు ప్రచారం ఆపాలనీ తాను దిగ్విజయ్ కు చెప్పినట్లు వీహెచ్ అన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమనీ, ఏకాభిప్రాయ సాధన కోసం పార్టీ హైకమాండ్ దూతగా దిగ్విజయ్ ప్రయత్నిస్తున్నారనీ మల్లు రవి అన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకుఐక్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. 

కరోనాపై మోడీ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం

చైనా, జపాన్, అమెరికా సహా పలు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్ 7 కేసులు శరవేగంగా  వ్యాపిస్తున్న నేపథ్యంలో  భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేవారు మాస్కులు ధరించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుక్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించగా.. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, నిపుణుల సూచనలను.. మోదీకి  ఈ సమావేశంలో వివరించారు.  కరోనా ముప్పు తొలగిపోయిందనుకుంటుంటే..  బీఎఫ్ 7 వేరియంట్ రూపంలో అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఏపీలోని కోనసీమ జిల్లా ఒమిక్రాన్ కేసును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 

కాంగ్రెస్ కలహాలు కమలానికి కలిసొస్తాయా ?

తెలంగాణ కాంగ్రస్ లో ముదురుతున్న అంతర్గత కలహాలు, సీనియర్, జూనియర్, అసలు, నకిలీ విబేధాలు  బీజేపీకి కలిసొస్తాయ?  బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న కమల దళం  నిజంగా  భారాసకు ప్రధాన ప్రత్యర్ధి , ప్రత్యామ్నాయం  కాగలుగుతుందా?  ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కమలం ఖాతాలో చేరిపోతుందా? అంటే, రాజకీయ విశ్లేషకులు అవునని అంటూనే అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు  అభిమానులు మాత్రం అనుమానం లేదు  ఎన్నికలు ఎప్పుడు జరిగినా  అధికారంలోకి వచ్చేది కమల దళమే అంటున్నారు. అలాగని, బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోనూ కొత్త పాత విబేధాలు లేక పోలేదు. అయితే, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం, కాంగ్రెస్ అధిష్టానం కంటే బీజీపీ కేంద్ర నాయకత్వం బలంగా ఉండడం ఆపార్టీకి కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మరోవంక చిన్న పామునైనా  పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం, బీఆర్ఎస్ ను మొగ్గలోనే తుంచేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుఔతున్న కేసీఆర్ కు  అసెంబ్లీ ఎన్నికల్లోనే  చెక్  చెప్పేందుకు మోడీ షా జోడీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలోనే వచ్చే ఎన్నికల్లో తమదే అధికారమని ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ  చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని కాషాయ శ్రేణుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 80 స్థానాలకుపైగా గెలుస్తామనే విశ్వాసంతో ప్రధాని మోదీ ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ధర్మపురి అర్వింద్ కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణలోని రాజకీయ పరిణామాలు, బీజేపీ పరిస్థితి గురించి అర్వింద్‌ను అడిగి మోడీ వివరాలు తెలుసుకున్నారు. ప్రధానితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ధర్మపురి అర్వింద్.. తెలంగాణలో 80కిపైగా సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందంటూ మోదీ సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని మోదీ సూచించారని, తనపై బీఆర్ఎస్ నేతల దాడి గురించి కూడా తెలుసుకున్నట్లు అర్వింద్ స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ గెలుపుపై మోడీ ధీమాతో ఉన్నారని తెలిపారు.  అయితే  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలతో కొట్టు మిట్టాడుతున్నా, కాంగ్రెస కు ఇంచుమించుగా అన్ని నియోజవర్గాల్లో,ఒకటి రెండు మార్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన, గెలిచిన బలమైన అభ్యర్దులున్నారు. క్యాడరుంది. ఓటు బ్యాంకు ఉంది. అదే బీజేపీ విషయానికి వస్తే, ఒక 25 -30 నియోజక వర్గాలు మినహా మిగిలిన మూడింట రెండు వంతుల నియోజక వర్గాల్లో అభ్యర్ధులే లేని పరిస్థితి ఉందని అంటున్నారు. అందుకే  కమలం పార్టీ నాయకత్వం కాంగ్రెస్ అంతర్గత కలహాలను ఆసరాగా చేసుకుని, ఆ పార్టీ నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అలాగే బీఆర్ఎస్ లోని అసంతృప్తులను తమ వైపుకు తెచ్చుకునే ప్రయత్నాలూ సాగిస్తోంది. ఒక విధంగా పశ్చిమ బెంగాల్ ఫార్ములానే బీజేపీ తెలంగాణలోనూ ఫాలో అవుతోందని అంటున్నారు. అధికారంలోకి వచ్చే ప్రయత్నం సాగిస్తూనే  అసెంబ్లీ ఎన్నికల్లో వ్యాజ్యం సాధించినా లేకున్నా లోక్ సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఖాళీ చేయాలనే దిశగా పావులు కదుపుతోందని అంటున్నారు.   అదలా ఉంటే,  ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో ఇంకా సందిస్గ్ధత తొలిగి పోలేదు.  ఆయినా. రాజకీయ పార్టీలన్నీ, ఎలక్షన్  మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ప్రధాన పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అంతర్గత కలహాలకు చుక్క పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపారు. సో... కాంగ్రెస్ అంతర్గత కలహాల పై ఆశలు పెంచుకున్న బీజేపీ కలలను కాంగ్రెస్ పార్టీ నిజం చేస్తుందా? అంటే, అందుకు ఇప్పటికిప్పుడు స్పష్టమైన సమాధానం ఇవ్వడం కుదరదని పరిశీలకులంటున్నారు. మరో వంక తెలుగు దేశం పార్టీ బుధవారం (డిసెంబర్ 21) ఖమ్మంలో నిర్వహించిన శంఖారావం సభ తెలంగాణలో  టీడీపీ, డౌన్ బట్ నాట్ అవుట్ అని నిరూపించింది. అలాగే  కొత్తగా తెర పైకి వచ్చిన వైఎస్సార్‌టీపీ,  బీఎస్పీ వంటి పార్టీల ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇంకా స్పష్టం కావలసి ఉందని అంటున్నారు. అలాగే, ఎత్తులు పొత్తులు ఎప్పుడు ఏవిధంగా మారతాయో చూడవలసి ఉందని  విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజ్ మహల్ మూసేస్తారా?

ప్రపంచంలోని ఎడు  వింతల్లో ఒకటైన తాజ్ మహల్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాజ్ మహల్ ఇకపైన పర్యాటకుల సందర్శనకు అందేబాటేలో ఉండదా? అంటూ ఔననే అంటోంది ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. కారణమేమిటంటే..ఏళ్ల తరబడి ఆస్తి పన్ను, నీటి పన్ను, సేవా పన్ను బకాయిలు పేరుకు పోవడం. వీటిని పక్షం రోజులుగా చెల్లించకుంటే.. తాజ్ మహల్ కు తాళం వేసేస్తామని యోగి సర్కార్ తాఖీదు ఇచ్చింది. దేశ ప్రతిష్టకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడాన్ని మూసివేయడమే లక్ష్యం అన్నట్లుగా ఆ తాఖీదు ఉంది. ఇంతకీ విషయమేమిటంటే తాజ్ మహల్ బాగోగులు చూసుకునే పురావస్తు శాఖ ప్రభుత్వానికి తాజ్ మహల్ కు సంబంధించి 5 కోట్ల సేవా పన్ను, 2 కోట్ల నీటి పన్ను, అలాగే ఒకటిన్నర కోట్ల ఆస్తి పన్ను బకాయిపడింది. దీనిని పదిహేను రోజుల్లోగా చెల్లించాలని   ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్, కంటోన్మెంట్ బోర్డు జమిలిగా తాఖీదులు జారీ చేశాయి.  అయితే ఇందుకు పురావస్తు శాఖ శసేమిరా అంటోంది. పురాతన కట్టడాలకు, చారిత్రక కట్టడాలకు టాక్సులు కట్టడమేమిటి? చాన్సే లేదని సమాధానం ఇచ్చారు. అయితే ఇంకో రాష్ట్రం ఇంకో రాష్ట్రం అయితే ఊరుకుంటుందేమో.. కానీ యూపీలో ఉన్నది బుల్ డోజర్ సర్కార్.. యోగి సర్కార్ ఊరుకుంటుందా.. అంటే ఊరుకోదనే సమాధానమే వస్తుంది ఎవరి నుంచైనా. ఈ తాఖీదుల వ్యవహారం చూస్తుంటే తాజ్ మహల్ కు తాళం తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

చంద్రబాబు కాపులకు ఇచ్చిన రిజర్వేషన్లు చెల్లుతాయి!

ఏపీ సీఎం జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కోర్టుల్లో చుక్కెదురౌతున్న పరిస్థితీ ఉంది. అదే తెలుగుదేశం హయంలో అంటే చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయం అన్ని విధాలుగా న్యాయ సమీక్షకు నిలబడే విధంగా ఉంటుంది. ఈ విషయం మరోసారి రుజువైంది. చంద్రబాబు హయంలో ఏపీలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన సంగతి తెలిసిందే. అలా రిజర్వేషన్లు కల్పించడం చట్టబద్ధమేననీ, చంద్రబాబు హయాంలో కాపులకు  ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు చెల్లుతాయనీ కేంద్రం విస్పష్టంగా చెప్పింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది.  దీంతో చంద్రబాబు హయాంలో ఇచ్చిన కాపు  రిజర్వేషన్ ఇప్పుడు అమలవుతుందని, జగన్ సర్కార్ అమలు చేస్తుందని అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటే.. ఆ రిజర్వేషన్లను జగన్ సర్కార్ రద్దు చేసింది.  మూడున్నరేళ్ల కిందట జగన్ అధికార పగ్గాలు చేపట్టగానే చంద్రబాబు హయాంలో కాపులకు ఇచ్చిన ఐదు శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది.  అయితే అప్పట్లో  కాపులు కానీ, ఆ సామాజిక వర్గానికి చెందిన వైపీసీ నేతలు కానీ దీనిపై ఎలాంటి  అభ్యంతరం వ్యక్తం చేయలేదు.  గతంలో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ..టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే అప్పట్లో కేంద్రం దీనిని అంగీకరించలేదు.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదన్న నిబంధన ను ప్రస్తావిస్తేూ పక్కన పెట్టేసింది.   కేంద్రం మాత్రం ఆర్థికంగా వెనుకబడిన ఓసీల కోసం పది శాతం రిజర్వేషన్లను అందుబాటులోకి తెచ్చింది.  దీంతో చంద్రబాబు ముందు చూపుతో  ఆలోచించి.. ఏపీలో ఆ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేశారు. అమలు కోసం జీవో కూడా జారీ చేశారు. ఇచ్చారు. గవర్నర్ ఆమోద ముద్ర కూడా పడింది.   అయితే ఎన్నికలు జరిగి జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే..  ఈ రిజర్వేషన్లు సాధ్యం కావని.. చెల్లుబాటు కావనీ పేర్కొంటూ   రద్దు చేసేశారు. భారీ మెజార్టీతో గెలిచిన ఊపులో ఉన్న వైసీపీ నేతలు.. చివరికి కాపు నేతలు కూడా   రిజర్వేషన్ల ఫలాన్ని తీసేస్తూంటే.. నోరెత్తలేదు. దాంతో కాపు సామాజిక వర్గం అంది వచ్చిన ఫలాన్ని జారవిడు చుకున్నట్లైంది. ఇప్పటికైనా వైసీపీలోని కాపు నేతలు  తమ ప్రజల ప్రయోజనాలు.. యువత ఉద్యోగావకాశాలు..విద్యావకాశాలు ఇతర విషయాల్లో మేలు జరిగేందుకు .. గత ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లను పునరుద్ధరించాలన్న డిమాండ్ చేయాలి. కాపు సామాజిక వర్గం కూడా గత ప్రభుత్వం తమకు కల్పించిన రిజర్వేషన్ ను ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించాలన్న డిమాండ్ తో జగన్ పై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 

కరోనా విజృంభణ.. ఆందోళనలో ప్రపంచ దేశాలు

కరోనాపై మానవాళి విజయం అంటూ ప్రకటించి... ఇక మాస్కులు ధరించనవసరం లేదని ప్రపంచ ఆరోగ్య శాఖ చెప్పడం ఎంత తప్పిదమో ఇప్పుడు అర్ధమౌతోంది. కరనో మహమ్మారిపై జయంచేశామని  నిర్లక్యంగా వ్యవహరిస్తున్న వేళ చైనాలో మళ్లీ మొదలై ప్రపంచ దేశాలను చుట్టేయడానికి కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచం అంతా కరోనా నుంచి విముక్తి  పొందామని భావిస్తున్న వేళ చైనాలో  మహమ్మారి మళ్లీ కోరలు సాచింది. అక్కడ నుంచి జపాన్, కొరియా దేశాలకు విస్తరించింది. భారత్ లోనూ అడుగుపెట్టింది. స్వల్ప వ్యవధిలోనూ ప్రపంచాన్ని చుట్టేస్తుందన్న ఆందోళన వ్యక్తమౌతుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం వచ్చే 90 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 10 శాతం మంది జనాభాకు కోవిడ్ సంక్రమించే అవకాశం ఉంది.  ఇక భారత్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ జీరో కోవిడ్ పరిస్థితి  లేకపోగా కొత్తగా 112 కేసులు నమోదయ్యాయి. 3,490 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి.   ఈనేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.

జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్

సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ఆమెకీ వారంట్ ను రాంపూర్ స్పెషల్ కోర్టు జారీ చేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ సందర్భంగా ఆమె వరుసగా కోర్టుకు గైర్హాజర్ అవుతూ వచ్చారు. ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా ఆమె హాజరు కాకపోవడంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ సమయానికి ఆమెను కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు ఆదేశిస్తూ జయప్రదపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది.  తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాళీ, కన్నడ భాషల్లో 300కు పైగా సినిమాల్లో జయప్రద నటించారు.రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ తదితర హీరోలతో  నటించారు.  సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఏపీ ప్రజలకు సేవ చేయాలని భావించినా అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ కు వెళ్లారు. రాంపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు.

తెలంగాణలో తెలుగుదేశం.. అదే ఆదరణ.. అదే ప్రభంజనం

ఒక రాజకీయ పార్టీ తెలంగాణలో గత ఎనిమిదిన్నరేళ్లలో నామమాత్రంగానే కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఒక్క ఎన్నికలో గెలిచింది లేదు. ఉన్న నాయకులంతా వేరే వేరే పార్టీలోని జంపింగ్ చేసేశారు. కార్యకర్తలు దిశా నిర్దేశం లేక నిస్తేజంగా మిగిలిపోయారు. ఆ పార్టీ తెలుగుదేశం. తెలంగాణలో తెలుగుదేశం పనైపోయిందన్నవారే అందరూ. చివరకు స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం జెండా కనిపించని పరిస్థితి. తెలుగుదేశం ఉనికి తెలంగాణలో నామమాత్రమన్న విశ్లేషణలు వచ్చాయి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం జోరు తగ్గింది. హైదరాబాద్ సహా తెలంగాణ ప్రతి అభివృద్ధి మలుపులోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం చేపట్టిన కార్యక్రమాలు, అవలంబించిన విధానాలూ కారణమని అంతా అంగీకరిస్తారు. రాష్ట్ర ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒక సందర్భంలో స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు. అయినా తెలంగాణలో తెలుగుదేశం పని అయిపోయిందనే అంతా భావించారు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు చెక్కు చెదరలేదనీ, వారికి దిశా నిర్దేశం చేయడానికి రాష్ట్ర నాయకత్వమే లేదనీ కూడా చెబుతూ వచ్చారు.  ఔను నిజమే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ  తెలంగాణలో దాదాపుగా ఉనికి కోల్పోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు నేతలు అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరగా, మరికొందరు విభజన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. దాంతో తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ పుంజుకోవడంపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. పార్టీకి నాయకులు హ్యాండ్ ఇచ్చినా.. కార్యకర్తలు ఇంకా తెలుగుదేశంతోనే ఉన్నారని ఆయన నమ్మారు. ఆ నమ్మకమే నిజమని బుధవారం ఖమ్మంలో జరిగిన తెలుగుదేశం సభ నిరూపించింది. తెలంగాణలో తెదేపా ఎక్కడుందన్న వారికి ఈ సభే సమాధానం చెప్పింది. ఈ సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ఎక్కడా ఎవరినీ విమర్శించకుండానే.. తెలంగాణతో తెలుగుదేశం అనుబంధాన్ని గుర్తు చేశారు. విమర్శలు లేవు, పరుష వాక్యాలు లేవు.. ఆయన మాట్లాడిందంతా తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన విజన్ తో సాధించిన ప్రగతి, భవిష్యత్ తరాల ప్రయోజనం గురించి వేసిన బాటల గురించే. అయినా సభకు హిాజరైన అశేష జనవాహిని ఆయన ప్రసంగాన్ని శ్రద్ధగా వింది.జేజేలు  పలికింది.  తెలంగాణ ప్రగతిలో అడుగడుగునా తెలుగుదేశమే ఉదన్న విషయాన్ని ప్రస్తావించారు. మూడు దశాబ్దాలు ముందు చూపుతో భవిష్యత్ ను నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చాటారు. అసలు తెలుగుదేశం పుట్టిందే తెలంగాణ గడ్డపై అని ఉద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధి చరిత్రలో తెలుగుదేశందే సింహ భాగమని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రగతికి బాటలు వేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన ఐఎస్బీ హైదరాబాద్ కు రావడానికి కారణం తనేనని చెప్పారు.  బెంగళూరుతో పోటీపడి మరీ ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో అభివృద్ధి చేశామన్నారు. తాను కాలికి బలపం కట్టుకుని మరీ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చానన్నారు. ఇదంతా యువత భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే చేశానన్నారు. తన కృషి వల్లే ఐటీ ఆయుధం మన తెలుగుయువత చేతికి వచ్చిందన్నారు. సంపద సృష్టించి యువతకు ఉపాధి కల్పించేలా తీసుకు వచ్చిన విషయాన్ని చెప్పారు. కొవిడ్‌కు టీకా కనిపెట్టిన భారత్‌ బయోటెక్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చింది తెలుగుదేశమేనని వివరించారు. నాలుగు దశాబ్దాల తెలుగుదేశం భవిష్యత్  ప్రగతిని పునాదులు వేసిందని, వెస్తుందనీ చెప్పారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు శక్తి అన్నారు. ఆయన తెలుగుజాతి గుండె చప్పుడు. ఆయన విగ్రహం ముందు నిలబడి సంకల్పం చెప్పుకుంటే.. చాలు అది నెరవేరుతుందని చంద్రబాబు అన్నారు. ఇటీవలి కాలంలో మళ్లీ ఉభయ రాష్ట్రాలూ ఎకం అవుతాయంటూ కొందరు చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. బుద్ధి లేని వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. రెండు తెలుగు రాష్ట్రాలూ ఎప్పటికీ కలిసే అవకాశం లేదనని కుండ బద్దలు కొట్టారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. దేశంలోనే ఆదర్శ రాష్ట్రాలుగా నిలవాలన్నది తెలుగుదేశం అభిమతమన్నారు. తెలుగు రాష్ట్రాలు దేశంలో తొలి రెండు స్తానాల్లో నిలవాలన్నదే తన ఆకాంక్ష అన్నారు.  ఘనచరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఖమ్మంలో నిర్వహించిన తెలుగుదేశం శంఖారావం  సభ నాంది పలుకుతుందని చెప్పారు.  తానెప్పుడూ అధికారం కోరుకోలేదని..  ప్రజల అభిమానం మాత్రమే కోరుకున్నానన్నారు. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు చెప్పారు. వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల నాయకులను తయారు చేశామన్నారు.  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడుందని అడిగే వాళ్లకు ఖమ్మం బహిరంగ సభే సమాధానమిస్తుందని పేర్కొన్నారు.  ఎస్‌ఎల్‌బీసీ, బీమా, నెట్టెంపాడు, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, దుమ్ముగూడెం ప్రాజెక్టులు నిర్మించిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని వివరించారు.  వేర్వేరు కారణాలతో పార్టీని విడిచివెళ్లిన వారంతా మళ్లీ తిరిగి రావాలని ఆహ్వానం పలికారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లేకున్నా ఇంత ప్రజాబలం తెదేపాకు ఉందంటే అది కార్యకర్తల వల్లేనన్నారు.    ఖమ్మం శంఖారావం స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహించేందుకు తెలుగుదేశం నిర్ణయించింది.  బహిరంగ సభకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనశ్రేణిలో వచ్చిన చంద్రబాబుకు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.  అడుగడుగునా పార్టీ కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబుకు స్వాగతం పలికారు.  ఖమ్మంలో జరిగిన సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.  

జగన్ ఆశలు ఆవిరి?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   జగన్  వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు.. అంటే అటు ఇచ్చాపురం నుంచి ఇటు తడ వరకు.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే చంద్రబాబు పోటీ చేసే కుప్పం, నారా లోకేశ్ పోటీ చేసే మంగళగిరితోపాటు జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే.. అన్ని స్థానాలు హోల్ సేల్‌గా ఫ్యాన్ పార్టీ ఖాతాలో గంపగుత్తగా పడిపోతాయంటూ కలలు కంటున్నారు. గడప గడపకు మన ప్రభుత్వ సమీక్షా కార్యక్రమంలో లీడర్ నుంచి కేడర్ వరకు అందరికీ ఇదే మాట పదే పదే చెబుతూ వస్తున్నారు. నేను బటన్ నొక్కుతూ సొమ్ములు పందేరం చేస్తున్నాను. ఓట్లు మనకు కాక ఇంకెవరికి పడతాయి.. మీరు గడప గడపకూ వెళ్లి నేను చేస్తున్న బటన్ నొక్కుడు సంక్షేమాన్ని వివరించండి అని చెప్పిందే చెబుతూ వస్తున్నారు. కానీ వాస్తవంగా జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు. ఆ పార్టీ పట్ల ఏ స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం పేరుకుపోయింది అన్నది ఆయన గమనించడం లేదు... తన పార్టీ  ఎమ్మెల్యేలు, నాయకులనూ కూడా గమనించొద్దు అంటున్నారు. అయితే జగన్ కంటున్నవన్నీ పగటి కలలేనని తాజా నివేదిక ఒకటి తేటతెల్లం చేసింది. కేంద్రానికి అందిన ఆ నివేదిక ప్రకారం జగన్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాల సంగతి అటుంచి ఓ 20 స్థానాలలో గెలవడం కూడా కష్టమేనన్నది ఆ నివేదిక సారాంశం. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ మహా గెలిస్తే ఓ 15 నుంచి 19 స్థానాలలో గెలవవచ్చని కేంద్ర నిఘావర్గాల నివేదిక పేర్కొందని అంటున్నారు. ఆ నివేదికలో జగన్ పార్టీ జాతకం అంతా పక్కాగా ఉందని సమాచారం. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉన్న ప్రజాదరణ.. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లేదని.. దీంతో గత ఎన్నికల నాటితో పోలిస్తే ఆయన గ్రాఫ్   22 శాతానికి పడిపోయిందని..   ప్రస్తుతం ఆయనకు 29 శాతం మేర ప్రజల మద్దతు ఉన్నా..  వచ్చే ఎన్నికల నాటికి ఈ శాతం మరింత తగ్గే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయనీ.. కేంద్ర నిఘా వర్గాల నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. నేను ఉన్నాను.. నేను విన్నానంటూ... ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ 341 రోజుల పాటు చేసిన పాదయాత్రలో ప్రతిరోజు చెప్పిందే .. చెప్పుకొంటూ వెళ్లారు... అలాగే అదే సమయంలో జనాన్ని హామీల సునామీతో ముంచేశారు. కానీ  జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. నాడు పాదయాత్రలో వైయస్ జగన్ చెప్పిన దానికి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న దానికి   ఫొంతన లేదు. ఈ విషయంలో ఇఫ్పటికే ప్రజలు ఓ క్లారిటీకి  వచ్చేశారు. అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ ఎంత అభివృద్ధి జరిగిందంటే.. అందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని ఆ సదరు నివేదిక స్పష్టం చేసిందని సమాచారం. అదీకాక వచ్చే ఎన్నికల వేళ.. ప్రజల్లోకి వెళ్లితే.. మేము చేసిన అభివృద్ధి ఇదీ అంటూ.. ప్రజలకు వివరించాల్సి ఉంటుందని... అలా వివరించేందుకు  జగన్ పాలనలో ఒక్కటంటే ఒక్క అంశం కూడా లేదని... అలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీకీ ఓట్లు పడే అవకాశం అయితే లేవని ఆ నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తోంది.   మరోవైపు.. గత ఎన్నికల వేళ.. జగన్ విజయం కోసం.. తల్లి,చెల్లే కాదు.. టాలీవుడ్‌లోని పలువురు నటీ నటులు, వివిధ రంగాల ప్రముఖులు  ముందుకు వచ్చి..  ప్రచారం చేశారని.. దీంతో జగన్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక అయిందని..  కానీ వచ్చే ఎన్నికల వేళ.. వైయస్ జగన్‌కు అంత సీన్   లేదని సదరు నివేదికలో స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసులు సైతం ఒక కొలిక్కి రాకుండా.. కొన.... సాగుతోండడంపై ఇప్పటికే..   జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో సందేహాల నీడలు అలుముకున్నాయని... అలాగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి క్రైమ్ రేట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. నెంబర్ వన్ స్థానంలో ఉందని.. ఇక విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి.. కేంద్ర  నుంచి రావాల్సిన వాటిపై పోరాటం చేయకపోవడం.. అలాగే విభజన కారణంగా.... తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై సీఎం కేసీఆర్‌ను సైతం వైయస్ జగన్ పెదవి తెరచి అడగకపోవడం వంటి అంశాలు సైతం సదరు నివేదికలో స్పష్టంగా పొందు పరిచి ఉన్నట్లు తెలుస్తోంది. సదరు నివేదిక కేంద్రానికి అందిన విషయం తెలుసుకొన్న అధికార ఫ్యాన్ పార్టీలోని పలువురు కీలక నేతలు.. కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదే అంశం బయటకు పొక్కి.. సోషల్ మీడియలో సైతం వైరల్ అవుతుండడంతో... నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. మరి వచ్చే 30 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీలో నేను సీఎంగా ఉండాలి.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు ఫ్యాన్ పార్టీ రెక్కలపై వాలి పోవాలంటే మాత్రం ఇంకా ఏదో ఒకటి చేయాలని ఆ పార్టీ అధినేత వైయస్ జగన్‌కు ఉచిత సలహా అందిస్తున్నారీ నెటిజన్లు. మరి వైయస్ జగన్ ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.

ఏపీ ఆర్ధిక విధానాలు అధ్వానం

ఏపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం గురించి అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఆ ఆరచకత్వాన్ని నిరోధించడానికి చేయాల్సినది మాత్రం చేయడం లేదు. అప్పులు వాటిని తీర్చడానికి మళ్లీ అప్పులు, ఉచిత పందేరాలకు అప్పులు.. అవీ సరిపోక పథకాల లబ్ధిదారుల సంఖ్యలో కోతలు. బటన్ నొక్కితే ఓట్లు రాలే మంత్రం కనిపెట్టాశానంటున్న ముఖ్యమంత్రి జగన్.. ఉద్యోగులకు సమయానికి జీతం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించడం లేదు. పిఛనర్లకు పించన్ల విషయమూ పట్టించుకోవడం లేదు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని కూడా భావించడం లేదు. దీంతో రాష్ట్రంలో అన్ని వర్గాలూ ఆందోళన బాట పట్టాయి. గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. ఇది రహస్యం కాదు. అందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వానికి చెక్ పెట్టి నియంత్రించి దారిలో పెట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చోలేదు. అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా పేరెత్తకుండా రాష్ట్రంలో ఆర్థిక అస్తవ్యస్త పరిస్థితుల గురించి సన్నాయి నొక్కులు నొక్కుతూ పరోక్ష విమర్శలు చేస్తున్నది. తాజాగా పార్లమెంటులో కేంద్రం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పేరు ప్రస్తావించకుండా.. ఒక రాష్ట్ర ప్రభుత్వం అంటూ జీతాలు సమయానికి ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులంతా నిరసనలు చేస్తుంటే.. ఆ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తో.. తమ పథకాల ప్రచారానికి మాత్రం భారీ మొత్తం వెచ్చించి మరీ ప్రకటనలు గుప్పిస్తోందని విమర్శించారు. ఉచితాలను తప్పుపట్టడం లేదు కానీ.. ఆదాయం లేకుండా అప్పులు చేసి మరీ పందేరం చేయడం సరికాదన్నారు. ఏపీ పేరు ప్రస్తావించకపోయినా.. ఆమె ఈ విమర్శలు, వ్యాఖ్యలు చేసింది ఏపీని ఉద్దేశించేనని ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది. సభలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.   ఏపీలో ఆదాయం పెరగలేదు.. ఖర్చులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి.  కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా అప్పులు చేస్తోంది.  ఆర్బీఐకి దృతరాష్ట్రుడిలా అనుమతులు ఇచ్చేస్తోంది. ఈ విషయాలన్నీ తెలసీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం పరోక్ష విమర్శలతో సరిపెట్టేస్తోంది. ఇందుకు కారణం రాజకీయం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. పరోక్షంగా అన్ని విధాలుగా ఏపీ ఆర్థిక వినాశనానికి సహకరిస్తూ.. పరోక్షంగా విమర్శలు హెచ్చరికలతో సరిపెట్టేసి తమ నిర్వాకాన్ని  కప్పిపుచ్చుకోవాలని కేంద్రం చూస్తోందనడానికి తాజాగా విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు మరో నిదర్శనం.