రేవంత్ సైకిలెక్కేస్తారా?
posted on Dec 24, 2022 @ 10:03AM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మళ్లీ సెకిలెక్కేయనున్నారా? తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం చేయడానికి తన శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తారా? ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయా? అందుకోసమే తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభ సమయంలో కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు వ పరిణామాలు కారణం. ఒకటి ఖమ్మంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శంఖారావం పేరిట నిర్వహించిన సభలో పార్టీని వదిలి వెళ్లిన వారు ఎవరైనా తిరిగి రావొచ్చునంటూ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. రెండోది తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్లు.. జూనియర్ల రచ్చ. కాంగ్రెస్ లో ఈ రచ్చకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డే. నిన్న కాక మొన్న తెలుగుదేశం పార్టీని వీడి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీపీ చీఫ్ పగ్గాలు కట్టబెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోయారు.
మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వచ్చే దాకా.. అడపాదడపా అసమ్మతి గళం విప్పినా ఓపికగా వేచి చూశారనే చెప్పాలి. అయితే మునుగోడు ఫలితం తరువాత సీనియర్ల అసమ్మతి గళం పెరిగింది. పీసీసీ కమిటీల నియామకంతో అది పతాక స్థాయికి చేరింది. దీంతో ట్రబుల్ షూటర్ గా దిగ్విజయ్ సింగ్.. హుటాహుటిన హైదరాబాద్ రావడం.. ఆయనకు అంతే వేగంగా.. రేవంత్‌పై సీనియర్లు ఫిర్యాదులు చేయడం చకా చక జరిగిపోయాయి.
ఇంకోవైపు తమను వలసవాదులన్నారంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేంద్రరెడ్డి లాంటి వారు పీసీసీ కమిటీల్లో తమ పదవులకు రాజీనామా చేసేశారు. అంతకు ముందే పీసీసీ చీఫ్ పదవి రేవంత్ కు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరి మునుగోడు ఉప ఎన్నికకు కారణమయ్యారు. ఆయన సోదరుడు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కూడా కాషాయం గూటికి చేరడానికి రెడీగా ఉన్నారు.
నిజమే రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నాయకుడన్న సంగతి విదితమే. అయితే ఓటుకు నోటు కేసు తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన తెలంగాణలో తెలుగుదేశం క్రీయాశీలంగా లేదన్న భావనతో కాంగ్రెస్ గూటికి చేరారు. అలా చేరడానికి ముందు రేవంత్ అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి ఆయన అనుమతి తీసుకున్నారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా జరిగింది. సరే మొత్తం మీద సైకిల్ దిగి ‘చేయి’ అందుకున్న రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో రెడ్ కార్పెట్ వెల్ కమ్ లభించింది. ఇలా పార్టీలో చేరారో లేదో అలా టీపీసీసీ పగ్గాలు అందుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతుకుముందు.. రేవంత్ రెడ్డి స్వయంగా అమరావతికి వెళ్లి... నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారన్న విషయం విదితమే. అలాగే రేవంత్ కూడా తెలంగాణలో కాంగ్రెస్ కు బలంగా మారారు. రేవంత్ టీపీసీసీ చీఫ్ పగ్గాలు చేపట్టిన తరువాతే అప్పటి దాకా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది.
అయితే కాంగ్రెస్ లో గ్రూపుల సంస్కృతికి చెల్లు చీటీ రాసే విషయంలో మాత్రం రేవంత్ సక్సెస్ కాలేకపోయారు. పైపెచ్చు సీనియర్లు తన పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరించడంతో రేవంత్ నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు చందంగా మారింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తెలుగుదేశం పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెరాస భారాసగా రూపాంతరం చెందిన తరువాత ఆ పార్టీ ఇక సెంటిమెంట్ ఆస్త్రాన్ని ఉపయోగించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిరోధించే అవకాశాలు లేవు. సరిగ్గా ఈ సమయంలోనే చంద్రబాబు ఖమ్మం సభ నభూతో అన్న చందంగా సక్సెస్ అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి మళ్లీ సైకిలెక్కే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.