పెన్సిల్ పొట్టు గొంతులోకెళ్లి చిన్నారి మృతి
posted on Dec 22, 2022 @ 10:48PM
పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని పిల్లలు.. వారి అమాయకత్వంతో ఒక్కో సారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అందుకే చిన్నారులను ఎప్పుడూ తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పటి కప్పుడు వారు ఏం చేస్తున్నారు? అన్నది ఓ కంట కనిపెడుతూ ఉండాలి.
ఇళ్లల్లో ఆడుకునే టప్పుడు, చదువుకునేటప్పుడూ కూడా పిల్లలను గమనిస్తూనే ఉండాలి. ఆరేళ్ల పిల్ల హోం వర్క్ చేసుకుంటూ తెలియకుండానే చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. ఆ విషాద ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హమీర్ పూర్ కొత్వాలి ప్రాంతం పహాడీ వీర్ గ్రామానికి చెందిన నందకుమార్ కు ముగ్గురు పిల్లలు. అందరిలోకీ చిన్న పిల్ల ఆర్తిక (6) తన అన్న, అక్కతో కలిసి టెర్రస్ పై చదువుకుంటోంది. ఆ క్రమంలో తన పెన్నిల్ చెక్కుకుందామనుకుంది. షార్పనర్ ను నోట్లో పెట్టుకుని పెన్సిల్ చెక్కుకుంది. ఈ క్రమంలో పెన్సిల్ పొట్టు నోట్లోకి వెళ్లి గొంతులో ఇరుక్కుని ఉక్కిరి బిక్కిరైంది. తల్లి దండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. అప్పటికే ఆ పాప మరణించింది.