నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
posted on Dec 23, 2022 8:47AM
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు. గత కొంత కాలంగా అస్వస్థతతో తీసుకుంటున్నా ఆయన శుక్రవారం (డిసెంబర్ 23) ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కైకాల సత్యనారాయణ మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా కౌతవరం లో జన్మించిన సత్యనారాయణ గుడివాడ లో గ్రాడ్యుయేషన్ చేశారు. నటనపై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వెండితెరపై తొలిసారిగా సిపాయి కూతురు సినిమాలో నటించారు. ఆ తర్వాత పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో హీరోగా, విలన్‌గా నటించారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి నటులతో సత్యనారాయణ నటించారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలుశనివారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కైకాల ప్రవేశించారు. తెలుగు దేశం పార్టీలో చేరి 1996లో మచిలీపట్నం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. రెండేళ్ల తర్వాత 1998లో లోక్ సభకు మళ్లీ ఎన్నికలు జరగ్గా పోటీ చేసి. కావూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన అటు రాజకీయాలలోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ వివాద రహితుడిగా పేరొందారు.