రేవంత్ స్వగృహ ప్రవేశం త్వరలో టీడీపీలోకి ?
posted on Dec 24, 2022 @ 2:27PM
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవనానికి తొలి అడుగు పడింది. సుదీర్ఘ విరామమ తర్వాత తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖమ్మం నుంచి పూరించిన సమర శంఖారావం రాష్ట్ర రాజకీయాలలో కలవరం సృష్టిస్తోంది. ముఖ్యంగా రాజకీయ ప్రతికూల పరిస్థితిలో వేర్వేరు పార్టీలలో చేరిన తెలుగు తమ్ముళ్ళు తిరిగి సొంత గూటికి రావాలని చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు రాజకీయ వర్గాల్లో వేడిని పుట్టిస్తోంది.
నిజానికి తెలంగాణలో తెలుగు దేశం పార్టీ పూర్తిగా ‘అవుటై’ పోలేదు. నాయకులు అటూ ఇటూ వెళ్ళినా పార్టీ క్యాడర్ , ప్రజలు, మరీ ముఖ్యంగా తెలుగు దేశం పార్టీకి మొదటి నుంచి అండగా నిలిచిన బడుగు బలహీన వర్గాల ప్రజలు, మరోమారు టీడీపీకి జై కొట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఖమ్మం సభ సక్సెస్ అదే విషయాన్ని స్పష్టం చేస్తోందని, పరిశీలకులే కాదు. టీడీపీ ప్రత్యర్ధులు కూడా అంగీకరిస్తున్నారు. భారాస మంత్రుల కలవరం గమనిస్తే చంద్రబాబు పిలుపు ప్రభావం ఏ రేంజ్ లో వుందో అర్థమవుతుందని అంటున్నారు.
ఈ నేపధ్యంలో మరో దారి లేక తెరాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో చేరిన మాజీ టీడీపీ నేతలు ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి కొంచెం ఆలస్యంగానే అయినా టీడీపీని వదిలి వెళ్ళిన నాయకులు చాలా మంది నాయకులు అద్దె కొంపలో ఇమడ లేక తంటాలు పడుతున్నారు. ఒక విధంగా ఉక్కపోతకు గురవుతున్నారు. పూలమ్మిన చోట కట్టెలు అమ్మినట్లు అవమానం ఫీల్ అవుతున్నారు. అందుకే మోత్కుపల్లి నరసింహులు, నాగం జనార్ధన రెడ్డి వంటి మాజీ టీడీపీ సీనియర్ నాయకులు ఎక్కడా స్థిరంగా ఉండలేక పోతున్నారు.
ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి దూకి ప్రజల్లోనూ చులకనవుతున్నారు. ఇలాంటి నాయకులంతా ఇప్పుడు స్వగృహ ప్రవేశానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే, గతంలో తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితునిగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు కూడా తిరిగి సైకిల్ ఎక్కేందుకు సిద్దమవుతున్నారనే ప్రచారం అటు గాంధీ భవన్, ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వినిపిస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టింది మొదలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు చాలా చాలా ప్రయత్నాలు చేశారు.
ముఖ్యంగా కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే విధంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ప్రజల్లో నాయకుడిగా నిలబడడమే కాకుండా పార్టీ ఆదిస్థానం వద్ద కూడా మార్కులు కొట్టేశారు. అయితే, పార్టీలో సీనియర్లు అనుకునే పెద్దలు మాత్రం రేవంత్ ఎదుగుదలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమికి కాంగ్రెస్ సీనియర్ నాయకులే కారణమయ్యారు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపొతే రేవంత్ రెడ్డికి ఉద్వాసన పలక వచ్చనే వ్యూహంతో సీనియర్లు కాంగ్రెస్ అభ్యర్ధిని విజయవంతంగా ఓడించారు.
మరో వంక తాజాగా రేవంత్ రెడ్డి వర్గీయులను వలస వాదులంటూ చులక చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం ఏర్పాటు చేసిన కమిటీలలో తమకేదో అన్యాయం, అవమానం జరిగిందని సీనియర్ నాయకులు బజారున పడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిట్టనిలువున చీలిపోయే దిశగా అడుగులు వేస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. ఒక విధంగా చూస్తే పీసీసీ అధ్యక్షుడికే గాంధీ భవన్ లో ఉక్క పోసే పరిస్థితి ఏర్పడిందని అంటునారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఆయన వర్గానికి చెందిన మాజీ టీడీపీ నాయకుల అడుగులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైపు పడుతున్నాయనే మాట రెండు వైపులా నుంచి బలంగా వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ సీనియర్లకు తలంటినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేని విధంగా చిందరవందరగా సాగుతున్న నేపధ్యంలో చివరకు ఏమి జరుగుతుంది అనేది వేచి చూడవలసి ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.