టీడీపీ రీఎంట్రీతో తెలంగాణలో మారుతున్న ముఖచిత్రం
posted on Dec 24, 2022 @ 2:00PM
తెలంగాణ రాష్ట్ర అవిర్భావం తర్వాత, రాష్ట్ర రాజకీయాలలో ‘గుణాత్మక’ మార్పులు చోటు చేసుకున్నాయి. ఉద్యమ పార్టీగా పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పుష్కర కాలం పైగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి సారధ్యం వహిచింది. కానీ, రాష్ట్ర విభజన జరిగి, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉద్యమ స్పూర్తిని తెరాస పక్కన పెట్టింది. ఉద్యమ వాసనలను వదిలేసి, ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీగా మారిపోయింది.
ఇక అక్కడి నుంచి తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తెలంగాణ అంటే తెరాస, తెరాస అంటే కేసీఆర్ అనే విధంగా రాష్ట్ర రాజకీయాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడచిన ఎనిమిదేళ్ళ కాలంలో చాలా వరకు తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ శాసించారు. రాజకీయ పునరేకీకరణ పేరిట ప్రతిపక్షం,ప్రజాపక్షం అనేది లేకుండా చేశారు. ఓవంక ఉద్యమ నాయకులను ఒకరి వెంట ఒకరిని బయటకు పంపారు.. మరోవంక ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేశారు. సామ ధాన భేద దండోపాయాలను ప్రయోగించి కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రా పార్టీ ముద్ర వేసి టీడీపీని నిర్వీర్యం చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు.
అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో, రాజకీయాల్లో బండ్లు ఓడలు ఓడలు బండ్లవుతాయనే నానుడి మరో మారు నిజమైంది. ఎనిమిదేళ్ళలో తెరాస రూపు రేఖలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. తెలంగాణ అస్తిత్వ పునాదులపై ఉద్యమ పార్టీగా పుట్టి కుటుంబ పార్టీగా మారిన తెరాస సహజంగానే ఉద్యమ స్పూర్తికి ప్రజలకు దూరమైంది. ఉప ఎన్నికల ఓటమితో మొదలైన తిరోగమనం తెరాస నాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేసింది. కుటుంబ పాలనా ముద్రను మురికి మరకను తుడిచేసుకునేందుకు అవతారం మార్చింది. అదే క్రమంలో జాతీయ పార్టీగా అవతరించే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితి (భారాస) గా పేరు మార్చుకుంది.
అదలా ఉంటే, తెరాస పేరు భారాసగా మారిన నేపధ్యంలో రాష్ట్ర రాజకీయాలలో మరో మారు, రాజకీయ పునరేకీకరణ ప్రక్రియ మొదలైంది.ఇంతవరకు సెంటిమెంటును అడ్డుపెట్టుకుని కేసీఆర్ సాగించిన రాజకీయాలకు తెర పడింది. ఈ నేపధ్యంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చింది. ఎక్కడ తగ్గాలో ఎక్కడ హెచ్చాలో తెలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమయం చూసి ఖమ్మం నుంచి తెలంగాణ శంఖారావం పూరించారు. ఇంత కాలం తాతకు దగ్గులు నేర్పుతున్నామనే భ్రమల్లో ఉన్న కేసేఆర్ అండ్ కో చంద్రబాబు శంఖారావంతో ఒక్క సారిగా ఉలిక్కి పడుతున్నారు. తెలంగాణ అస్తిత్వ వాదాన్ని ప్రాతీయ ఆకాంక్షలను అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందిన తెరాస పేరును భారాసగా మార్చుకుని దేశంలో జెండా ఎగరేస్తానంటూనే తెలంగాణలోకి మాత్రం తెలుగుదేశం పార్టీ రాకుడదాని అంటున్నారు.
అయితే, ప్రజలు మాత్రం పోటీ పడి మరీ టీడీపీకు పునః స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ రీఎంట్రీతో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పునరేకీకరణ,రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య మార్పులు తప్పవని అంటున్నారు.