డిగ్గీ ప్రవచనాలతో అసమ్మతి అగ్గి చల్లారేనా ?
posted on Dec 23, 2022 8:32AM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు పరిష్కరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం దూతగా మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ సింగ్ హైదరాబద్ వచ్చారు. గాంధి భవన్ లో గంటల తరబడి చర్చలు జరిపారు. విస్వసనీయ సమాచారం మేరకు ఒక్కొక్కరిని పిలిచి ఏమిటి విషయం, అని ప్రశ్నించారు. మీరేమిటి, మీరు చేస్తున్నదేమిటి? తెలంగాణలో భారాస ప్రభుత్వాన్ని, ఓడించడానికి మీ వద్ద ఉన్న వ్యూహం ఏమిటి? అంటూ, దిగ్విజయ సింగ్, ప్రతి ఒక్కరినీ పరిపరివిధాల ప్రశ్నించారు. అందరి నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు.
అలాగే, ఇంతకాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న విబేధాలు భగ్గుమనేందుకు కారణమైన కమిటీలపై వ్యక్తమైన అసంతృప్తి పైనా ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచి ఆరా తీశారు. కొందరికి కొంత ఘాటుగా చురకలు అంటించినట్లు తెలుస్తోంది. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం ఏమిటి? పార్టీని రక్షించాల్సిన మీరే.. సమస్యగా మారితే ఎలా? అంటూ కొందరు సీనియర్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏవైనా సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేతల అభిప్రాయాలను ఆయనే స్వయంగా నమోదు చేసుకున్నారు. అంతే కాదు పార్టీలో జూనియర్, సీనియర్ పంచాయితీ మంచిది కాదు. సమస్యలు ఉంటే అధిష్ఠానం దృష్టికి తీసుకురావాలి.. మీడియా ముందు మాట్లాడటం సరికాదు. కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో అధిష్ఠానం గమనిస్తోంది. ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే .. హై కమాండ్ చూస్తూ ఊరుకోదు. బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యూహం ఏమిటి? పార్టీ బలోపేతం కోసం మీ పాత్ర ఏంటి.. మీరు ఏం చేశారు? అంతర్గత సమస్యపై మీ అభిప్రాయం .. పరిష్కారం కోసం మీ సలహా ఏంటి? అని దిగ్విజయ్ సింగ్ నేతలను ప్రశ్నించినట్టు సమాచారం.
సరే..లోపల జరిగిన సంగతులు ఎలా ఉన్నా గాంధీ భవన్ ప్రాంగణంలో మీడియా కెమెరాల సాక్షిగా జరిగిన సంఘటనలు గమనిస్తే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుల మధ్య సాగుతున్న, ‘వార్’ డిగ్గీ రాజా ధర్మ ప్రవచనాలతో ముగిసేలా లేదని మాత్రం అందరికీ అర్థమైందని, కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా మీడియా ముందుకొచ్చి మరీ ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోవడం కాదు, రేవంత్ రెడ్డిని విలన్ లా చిత్రించేందుకు ఓయూ విద్యార్థి నేతలు ఏమాత్రం వెనకాడలేదు. తగ్గేదే లే అంటూ దూసుకు పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇంతవరకు నాలుగు గోడల వరకే పరిమితం అయిన యుద్ధం ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారింది. కొందరు కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టిస్తున్నారంటూ నాయకులపై విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల సీనియర్ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ పై ఓయూ విద్యార్థి నేతలు భౌతిక దాడికి ప్రయత్నించారు. దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అనంతరం గాంధీభవన్ నుంచి బయటకు వస్తున్న అనిల్ పై ఓయు విద్యార్థి నేతలు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న మల్లు రవి, ఇతర సీనియర్ నేతలు విద్యార్థులను అడ్డుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నామని.. అయినా, కమిటీల్లో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు.
ఈ పరిణామాలను గమనిస్తే, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కేంద్ర బిందువుగా సాగుతున్న రచ్చకు, రేవంత్ రెడ్డి మాత్రమే సమాధానం ఇవ్వగలరని కొందరు సీనియర్ నాయకులు అంటున్నారు. నిజంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీని రక్షించే యోచనే ఉంటే, ఆయన చేసిన తప్పులను ఒప్పుకుని, పదవి నుంచి తప్పుకుంటే హుందాగా ఉంటుందని అంటున్నారు. రేవంత్ సృష్టించిన సమస్యకు ఆయనే పరిష్కారం చూపాలని అంటున్నారు. అయితే, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని అనుకోలేమని, మరి కొందరు నాయకులు పేర్కొంటున్నారు. సో .. మొత్తంగా చూస్తే,కాంగ్రెస్ లో పాత కొత్త నేతల మధ్య భగ్గుమంటున్న విబేధాలు ఇప్పట్లో పరిష్కారం అయ్యేలా లేవనే పరిశీలకులు అంటున్నారు.