తెలంగాణలో బీజేపీకి , ఏపీలో తెలుగుదేశంకు లైన్ క్లియరేనా?
posted on Dec 23, 2022 @ 11:45AM
తెలంగాణలో టీడీపీ ఇంకా బ్రతికే ఉందా?.. నాయకుడే లేని పార్టీ ఇంకా మనుగడ సాగిస్తుందా? క్యాడర్ మొత్తం ప్రత్యామ్నాయ పార్టీలలో దూరిపోగా ఇంకెక్కడ టీడీపీ!.. ఇవే మాటలు ఇంత కాలంగా విపినిస్తూ వచ్చిన మాటలు. వాటిని అందరూ నమ్ముతూ వచ్చారు కూడా.. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి చెప్పుకోదగ్గ నాయకుడు లేడు. దీంతో రెండో శ్రేణి నాయకత్వం ఊసే లేకుండా పోయింది. అయితే.. కార్యకర్తలు, అభిమానులకు మాత్రం కొదవే లేదు. అయినా వారిని పట్టించుకునే నాథుడే తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో లేకుండా పోయారు.
అయితే చంద్రబాబు ఖమ్మం సభ ద్వారా తెలంగాణలో టీడీపీ క్యాడర్ ను తట్టి లేపారు. సరైనా దిశా నిర్దేశం ఉంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ తిరుగులేని శక్తిగా నిలబడుతుందని, పడి లేచిన తరంగంలా ఉవ్వెత్తున లేస్తుందని చంద్రబాబు సభ ద్వారా నిర్ద్వంద్వంగా నిరూపితమైంది. ఖమ్మంలో తెలుగుదేశం శంఖారావం సభ సక్సెస్ తో అందరి దృష్టీ ఒక్క సారిగా టీడీపీపై పడింది. ఎనిమిదిన్నరేళ్ల తరువాత తెలంగాణలో చంద్రబాబు నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తారు. వెయ్యి కార్లతో చంద్రబాబు ర్యాలీ వెళ్తుంటే తెలంగాణ మొత్తం చూసింది. తెలంగాణ ప్రజలు అభిమానంతో తరలి రావడం చూసి రాష్ట్రంలో చంద్రబాబుకు ఇంకా ఈ రేంజ్‌లో ఆదరణ ఉందా అని రాజకీయ పార్టీలు అచ్చెరువోంది చూశాయి.
తెలంగాణలో అధికారం కోసం శాయశక్తులా కృషి చేస్తున్న బీజేపీకి చంద్రబాబు సభ సక్సెస్ తో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఓ దారి కనిపించింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తరువాత, కాంగ్రెస్ లో కుమ్ములాటలు తారస్థాయికి చేరిన తరువాత తెలంగాణలో బీజేపీ బలపడిందనడంలో సందేహం లేదు. అయితే ఆ పెరిగిన బలం రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సరిపోదేమో అన్న అనుమానం బీజేపీ అగ్రనాయకత్వంలో ఉంది. పట్టణ ప్రాంతాలలో పరిస్థితి బాగున్నా.. తెలంగాణ గ్రామీణంలో మాత్రం బీజేపీకి ఇంకా పట్టు చిక్కలేదు. అందుకే తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలంటే పొత్తులు కావాలి. కానీ తెలంగాణలో పొత్తుకు సరైన పార్టీ ఏదని ఇంత కాలంగా బీజేపీ అన్వేషిస్తోంది. వైఎస్సార్టీపీ, బీఎస్పీ లు ఉన్నా.. అవి బీజేపీకి బలం అయ్యే అవకాశాల కంటే బీజేపీయే వాటిని బలం అవుతుందనిపించే పరిస్థితులు ఉన్నాయి.
సరిగ్గా ఆ సమయంలో చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం బలం ఏమిటన్నది, ఎంతన్నది.. శంఖారావం సభ ద్వారా ప్రదర్శించారు. ఇంత కాలంగా తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తు విషయంలో బీజేపీ ముందు వెనుకలాడుతూ వస్తోంది. తెలంగాణలో ఉనికి, మనుగడే లేని టీడీపీతో పొత్తెందుకన్న భావనా ఆ పార్టీ అగ్రనాయకత్వంలో వ్యక్తమైంది. తాజాగా ఖమ్మం టీడీపీ శంఖారావం సభ రాష్ట్రంలో తెలుగుదేశం బలాన్ని చాటింది. దీంతో ఇప్పుడు బీజేపీ మిగిలిన అన్ని ఆప్షన్లనూ పక్కన పెట్టేసి తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తే.. తమకు రాష్ట్రంలో అధికార సోపానాన్ని అందుకోవడానికి రాచబాట అవుతుందన్న నిర్ణయానికి వచ్చేసింది.
ఖమ్మం శంఖారావం సభ వెనుక చంద్రబాబు వ్యూహం కూడా ఇదే. తెలంగాణలో తెలుగుదేశం సత్తా చాటితే బీజేపీ తన దరికి వస్తుందన్నది ఆయన ఎత్తుగడగా భావించవచ్చు. ఎందుకంటే.. ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే.. ఆ రాష్ట్రంలో జనసేన, బీజేపీ కూటమి (ఔను ఆ రెండు పార్టీలూ మిత్రపక్షాలు) అండ అవసరం. తెలంగాణలో బీజేపీకి తన అండ ఎంత అవసరమన్నది తెలియజేస్తే తప్ప బీజేపీ ఏపీలో తనకు అండగా నిలిచేందుకు ముందుకు రాదు. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు ఖమ్మం సభ ద్వారా తెలంగాణలో తెలుగుదేశం బలాన్ని చాటారు.
చంద్రబాబు ఖమ్మం సభపై కాంగ్రెస్, బీఆర్ఎస్ స్పందించాయి కానీ బీజేపీ మౌనంతోనే.. తెలుగుదేశంతో పొత్తువిషయంపై బీజేపీలో చర్చ జరుగుతోందని అవగతమౌతోంది. గోడ చేర్పులాగా బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో టీడీపీ అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీకీ బీజేపీ అసవరం ఉంది. ఖమ్మం శంఖారావం సభతో ఇరు పార్టీలూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అక్కడ మీకు మేము.. ఇక్కడ మాకుమీరు అన్నఒప్పందానికి వస్తాయా? ఇరు పార్టీలకు ఈ ఒప్పందం లాభదాయకమని భావిస్తున్నాయా అంటే రాజకీయ వర్గాలు ఔననే అంటున్నాయి.
ఏపీలో ఇప్పటికే జనసేన అధినేత వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పదేపదే చెబుతుండటంతో తన దారి ఏమిటి? తన వైఖరి ఏమిటన్నది చెప్పకనే చెప్పేశారు. ఇక ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం సత్తాచాటిన ఖమ్మం సభతో బీజేపీ కూడా జనసేనానికి వంత పాడి 2014 ఎన్నికల నాటి సమీకరణానికి సై అంటుందన్న అభిప్రాయమే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది.