ఏపీలో బీజేపీ ట్రిపుల్ గేమ్.. సంపర్క్ యాత్రల మర్మమేంటో?
posted on Dec 31, 2022 @ 1:21PM
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ డబుల్ గేమ్ కాదు త్రిబుల్ గేమ్ ఆడుతోంది. ఒక వైపు జనసేన మిత్రపక్షమని చెబుతోంది. మరో వైపు తెలుగుదేశం పార్టీకి దగ్గర అవుతున్న సంకేతాలు ఇస్తోంది. అంతే కాకుండా అధికార వైసీపీకి కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ రకమైన తీరుతో బీజేపీ రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటోంది, ఏం సాధించాలనుకుంటోంది అన్నది పక్కన పెడితే.. రాష్ట్రంలో రాజకీయ కార్యాచరణకు రోడ్ మ్యాప్ ప్రకటించేసింది.
జనవరి 26 తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత పాదయాత్రలకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించి సన్నాహకంగా జనవరి 8న కర్నూలులో, హిందూపురంలో బహిరంగ సభలు నిర్వహించనుంది. ఆ సభలలో సాక్షాత్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. జనవరి 26 తర్వాత రాష్ట్రంలో 13 వేల గ్రామాల్లో బీజేపీ చేపట్టే సంపర్క పాదయాత్రలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేసేలా కార్యాచరణ రూపొందించేసింది. అయితే రాష్ట్రంలో బీజేపీ ఏం చేసినా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న జగన్ అనూకూల వైఖరి, కొందరు బీజేపీ రాష్ట్ర నేతల తీరు కారణంగా ఆ పార్టీని జనం విశ్వసించడం లేదు. జగన్ సర్కార్ పై ఎంత ఘాటు విమర్వలు చేసినా జనం పట్టించుకోవడం లేదు.
దీంతో జనవరి 26 తరువాత నుంచి బీజేపీ రాష్ట్రంలో చేపట్టనున్న సంపర్క పాదయాత్రలలో రాష్ట్రంలో బీజేపీ ఏం చేసినా, ఏ మాట్లాడినా జగన్ కు ప్రయోజనం చేకూర్చేందుకేనని అత్యధికులు విశ్వసి స్తున్నారు. దీంతో ఇప్పుడు బీజేపీ రూటు మార్చి సంపర్క యాత్రలలో వైసీపీ సర్కార్ వైఫల్యాలనే టార్గెట్ చేయనుంది. కనీసం అలా ప్రకటించింది. కానీ ఇంత కాలంగా రాష్ట్ర బీజేపీ చేస్తూ వచ్చిన వ్యవహారం అంతా జగన్ సర్కార్ వైఫల్యాలను చూసీ చూడనట్లు వదిలేయడమే. అదే బీజేపీ కార్యక్రమాలలో విపక్షాన్నే టార్గెట్ చేస్తూ విమర్శించడం మాత్రమే. అందుకే సంపర్క్ యాత్రలలో కూడా అధికార పార్టీపై పైపై విమర్శలకు మాత్రమే బీజేపీ పరిమితమౌతుందనే అంతా భావిస్తున్నారు. ఇందుకు వారు ఇటీవల ఏపీ సీఎం జగన్ హస్తిన పర్యటనలో ప్రధాని మోడీతో దాదాపు గంట పాటు భేటీ అవ్వడం, ఆ తరువాత అమిత్ షాతోనూ సమావేశం కావడాన్ని తార్కాణంగా చూపుతున్నారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో, కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం అసాధారణమేమీ కాదు. కానీ ఏపీ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం, లెక్కలకు అందని అప్పుల తీరు తెలిసీ రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు కలిగేలా.. మచిలీపట్నం,రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం పేరిట రూ.12 వేల కోట్ల ఋణం పొందేందుకు జగన్ హస్తిన పర్యటన ఇలా ముగిసిందో లేదో అలా అనుమతి వచ్చేయడం.. ఆ రుణం ఇచ్చేందుకు, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ( ఆర్ఈసీ), పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ ( పీఎఫ్ సీ) సూత్ర ప్రాయంగా అంగీకరించడాన్ని తార్కాణంగా చెబుతున్నారు.
ఈ ఆమోదం లభించిన రుణంలో ఓ 24వందల కోట్ల రూపాయలు ఆర్సీసీ వెంటనే ఏపీ మ్యారిటైం బోర్డుకు అందజేయడానికి అంతా సిద్ధమైపోవడం.. కేంద్రం, జగన్ సర్కార్ ల మధ్య ఉన్న అవినాభావ అనుబంధానికి నిదర్శనంగా రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ రుణమే కనుక అందకుంటే ఏపీ సర్కార్ రోజువారీ కార్యక్రమాల కొనసాగింపునకు కూడా ఒక్క రూపాయి లేక విలవిలలాడే పరిస్థితి ఎదురయ్యేది. బడ్జెట్ ఆమోదం వరకూ అంటే మార్చి వరకూ ఏపీ సర్కార్ ఖజానా ఖాళీగానే ఉండే పరిస్థితి అన్నమాట. ఆ పరిస్థితి నుంచి ఏపీ గట్టెక్కేందుకు కేంద్రం తన వంతు సహకారం అందించింది. ఇటువంటి వెసులు బాటు బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలలో కేవలం ఏపీకి మాత్రమే లభిస్తోంది.
పొరుగున ఉన్న తెలంగాణను ఆర్థిక చక్రబంధంలో బిగించేసి వేడుక చూస్తున్న మోడీ సర్కార్ ఏపీకి మాత్రం కోరిందే తడవుగా వరాలిచ్చేసి ఆదుకుంటోంది. నిజానికి ఏపీతో పోలిస్తే తేలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఎంతో మెరుగ్గా ఉంది. అయినా రాజకీయ కారణాలతో ఆ రాష్ట్రాన్ని మోడీ, షా ద్వయం ఇబ్బందుల్లోకి నెట్టి వేడుక చూస్తోంది. ఈ కారణంగానే ఏపీలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు, చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా విశ్వాసాన్ని పొందడం లేదు. రాష్ట్రంలో సొంత బలం ఇసుమంతైనా లేని బీజేపీ.. ఇతర పార్టీల బలహీనతల ఆసరాగా పరాన్న జీవిగా ఉన్నా కూడా చక్రం తిప్పేయాలని చూస్తోందని పరీశీలకులు విశ్లేషిస్తున్నారు.