హ్యాట్రిక్ లక్ష్యంగా మోడీ మంత్రివర్గంలో మార్పులు?
posted on Jan 1, 2023 @ 11:03PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణకు సిద్దమవుతున్నారా? కొత్త సంవత్సరంలో జనవరి 14 తర్వాత పెద్ద మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు మోడీ, షా మంత్రాంగం సాగిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కమలదళం కీలక నేతలు. అంతే కాదు ఈసారి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా కాషాయ కూటమి పెద్దలు చెబుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా, పార్టీ పదవుల్లోనూ సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగియనుంది. అదే సమయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జనవరిలో జరగనుంది. కాగా, వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు 2024లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. నిజానికి నడ్డాను 2024 ఎన్నికలవరకు అధ్యక్ష పదవిలో కొనసాగిస్తారని, ఆ మేరకు నిర్ణయం జరిగిందని పార్టీలో ప్రచారం జరిగింది. అయితే, అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. అయినా, పాతికేళ్ళ తర్వాత తొలిసారిగా, అధ్యక్ష ఎన్నికలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, నడ్డాకు ఎక్స్ టెన్షన్ ఇవ్వడాన్ని, తప్పు పట్టే అవకాశఇం లేదు. అలాగే, నడ్డా స్వరాష్ట్రం హిమాచల్’లో బీజేపీ ఓటమికి ఆయనే కారణమనే విమర్శలు వినవచ్చాయి. ఈ నేపధ్యంలో నడ్డాను కొనసాగించే విషయంలో పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో, పార్టీలో మార్పులు చేపట్టే విషయంలో పార్టీ పెద్దలు విభిన్న స్థాయిల్లో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కొంతమంది కొత్త ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అలాగే, మహా రాష్ట్రలో శివసేన చీలిక వర్గం ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభించే ఆకాశం ఉందని అంటున్నారు. గతంలో శివసేన ఎన్డీఎలో ఉన్నరోజుల్లో కేంద్ర మంత్రి వర్గంలో ముగ్గురు నలుగురికి స్థానం దక్కింది. అలాగే, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కడుపుతున్న బీజేపీ నాయకత్వం, రాష్ట్రం నుంచి మరొకరికి మంత్రి వర్గంలో స్థానం కలిపించే అవకాశం ఉంది. అదే విధంగా ఏపీ నుంచి కూడా ఒకరికి స్థానం దక్కుతుందని అంటున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే విషయంలో స్పష్టత రాలేదు.
మరో వంక పని తీరు ఆధారంగా కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న చర్చ కూడా సాగుతోంది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జులై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది. 12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు.
ఈసారి కూడా అంత పెద్ద ఎత్తున ఉద్వాసనలు ఉంటాయా, లేక కొద్ది మందితో సరిపెడతారా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే, ఏది జరిగినా, ఎన్నికల లెక్కలు ఆధారంగానే జరుగుతుందని, మోడీ సర్కార్ హ్యాట్రిక్ లక్ష్యంగానే మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. నిజానికి విపక్షాల బలహీనత, బీజేపీకి కలిసి వచ్చే అంశంగా అందరూ భావిస్తున్నా బీజేపీ నాయకత్వం మాత్రం మరోలా లోచిస్తోందని అంటున్నారు.
యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో బీజేపీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం పునరావృతమైంది. తాజాగా గుజరాత్‌లో కూడా భారీ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పరాజయం పాలైంది. మరో వంక మిత్ర పక్షాలు చాలా వరకు ఇప్పటికే దూరమయ్యాయి.. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడి కక్కడ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ పరిస్థితులు, పరిణామాలు అన్నింటినీ బేరీజు వేసుకుని మోడీ హ్యాట్రిక్ లక్ష్యంగా బీజేపీ మంత్రి వర్గంలో, పార్టీలో మార్పులకు భారీ కసరత్తు చేస్తోందని అంటున్నారు.