వైసీపీలో అసంతృప్తి.. నేతల్లో ఆందోళన
posted on Dec 31, 2022 @ 4:48PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు, చేయని ప్రయత్నం లేదు. నిజానికి, ఓటమి అంచున నిలిచినా , దింపుడు కళ్ళెం ఆశతో ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడంలేదు. తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని కోరుకుంటున్నారు. కోరుకోవడం కాదు, 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అనే లక్ష్యంతో ముందుకు సాగండి అంటూ, అతి విశ్వాసాన్ని ఉద్భోదిస్తున్నారు. ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లి, ప్రతి ఫ్యామిలీకి చేసిన మేళ్లను చెప్పుకోవాలని, తరుము తున్నారు. అయితే నిజంగా ప్రతి గాడపకు మేలు జరిగిందే నిజం అయితే, ఇంతలా హైరాన పాడడం ఎందుకు? అంటూ అటు ప్రజలు, ఇటు ప్రతి పక్ష నాయకులు, కార్యకర్తలు కూడా నవ్వు కుంటున్నారనుకోండి అది వేరే విషయం.
అలాగే చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందని జగన్మోహన్ రెడ్డి తనకు తాను తగిలించుకున్న భుజ కీర్తులను ఎత్తి చూపుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని చేసిన పనులను గడపగడపకు ప్రజల వద్దకు తీసుకెళ్లడి చాలు అంటూ కార్యకర్తలలో విశ్వాసం కలిగించేందుకు చాలా చాలా శ్రమిస్తున్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని(అతి ఎంత అక్రమ విజయమో వేరే చెప్పనక్కరలేదు) భూతద్దంలో చూపించి తెలుగు దేశం అధినేత్ చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలోనే గెలిచి నప్పుడు, మిగిలిన నియోజక వర్గాల్లో గెలవడం ఎంత పని, 175కు 175 నియోజక వర్గాల్లోనూ గెలుస్తాం .. గెలుస్తున్నాం .. అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయితే, జగన్ రెడ్డి కుప్పం గెలుపును ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకోవడం అది చూసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుకోవడం, తల్లి తండ్రులను హత్య చేసిన హంతకుడు, తల్లి తండ్రులు లేని అనాధను కరుణించి కాపాడండని న్యాయస్థానాన్ని వేడుకున్నట్లు ఉందని అంటున్నారు.
నిజమే అద్దాల మేడలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటే కనవచ్చును, కానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం ఆ భరోసా కనిపించడం లేదు. గతంలో అభ్యర్ధి ఎవరైనా, అన్నకు ఓటేయండి.. అన్నను అధికారంలోకి తీసుకువద్దాం!`` అని, అన్ని నియోజక వర్గాల్లో జగన్ రెడ్డే, వైసీపీ అభ్యర్ధి అన్నట్ల్గు ప్రచారం చేసిన కార్యకర్తలు, ఇప్పుడు మౌనంగా ఉండి పోతున్నారు. జగన్ రెడ్డి ఏమి చేశారంటే, చెప్పేందుకు సమాధానం లేక గడపగడప కర్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వైసీపే వెంట నడిచిన వైసీపీ కార్యకర్తలు చాలా వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 98 శాతం వరకు ఇచ్చిన హమీలను నేరవేర్చామని చెప్పుకోవడం, అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు వడ్డాణం చేయించానన్నట్లుగా ఉందని కార్యకర్తలే వాపోతున్నారు. ప్రజల సంగతి తర్వాత, కార్యకర్తలకు ఇచ్చిన హమీలకే దిక్కు లేదని నేతలను నడిరోడ్డు మీద నిలదీస్తున్నారు.
అలాగే కులం, మతం ఇతర ఇంటర్నల్ లింకుల కారణంగా ఇంకా వైసీపీని మోస్తున్న కార్యకర్తలు అయితే, ఇక ఇప్పడు చేయగలిగిందేమీ లేదనీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోతున్నారు. మరో వంక నాయకుల్లోనూ ఇంతకాలం అణచి పెట్టుకున్న అసంతృప్తి అగ్నిగోళంలా భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తుపాకిలోంచి తూటాలా ధిక్కారం దూసుకోస్తోంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఉమ్మడి కృష్ణాను తీసుకుంటే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, గుంటూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, తాడికొండ లో ఉండవల్లి శ్రీదేవి, కర్నూలులో ఎస్వీ మోహన్ రెడ్డి రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి, రాయచోటిలో శ్రీకాంత్రెడ్డి, గిద్దలూరులో అన్నా రాంబాబు బాపట్లలో కోన శశిధర్, శ్రీకాకుళం కిల్లి కృపారాణి, పేరాడ తిలక్.. ఇలా.. కీలక నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
ఒకరిద్దరు మినహా వీరంతా కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంట నడిచిన వారే, అయన విజయం కోసం కష్టపడిన వారే. ఆయన కోసం.. ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్నవారే. అప్పులు చేసి మరీ ఖర్చు చేసిన వారే. అయితే..ఇప్పుడు వీరికి ప్రాధాన్యం లేకుండా పోవడం.. జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం.. వారు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగడం వంటివి ఇప్పుడు వీరిని మనోవేదనను కలిగిస్తున్నాయి. దీనికి తోడు.. నియోజకవర్గాల్లో అభివృద్ధిలేక పోవడం కూడా.. వారిని తీవ్ర సంకట స్థితికి చేర్చింది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు పెరుగుతున్నాయి.
నిజానికి, వైసీపీలో ఏ ఇద్దరు కలిసినా ... జగన్ రెడ్డి మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదనే విషయాన్నే చర్చించుకుంటున్నారు. ఇటు కార్యకర్తల్లో, అటు నాయకుల్లోనూ భాగ్గుమనేదుకు సిద్డంగా ఉన్న అసంతృప్తి గురించే మాట్లాడు కుంటున్నారు. నిజానికి ఇప్పటికే చాల వరాకు జిల్లాల్లో అసంతృప్తి కర్యకలాపాలు జోరందుకున్నాయి... ఎన్నికలు దగరయ్యే కొద్దీ పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న అసంతృప్తి భగ్గుమంటోందని, వైసీపీ ముఖ్య నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు వెనకాడుతున్నారు.. పిల్లి మేడలో గంట కట్టేది ఎవరని వేచి చూస్తున్నారు.