రాహుల్ భారత్ జోడో యాత్రలో గులాంనబీఆజాద్.. హోం కమింగ్ కు సంకేతమేనా?
posted on Dec 31, 2022 @ 9:47AM
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సత్ఫలితాలను ఇస్తోంది. పార్టీ అధిష్ఠానంతో విభేదించి బయటకు వెళ్లిన వారు ఒక్కొక్కరుగా మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అన్న ప్రశ్నలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుల నుంచి ఔననే సమాధానం వస్తోంది. రాహుల్ పాదయాత్రతో పార్టీకి పునర్వైభవం సిద్ధిస్తుందని అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.
అలాగే కాంగ్రెస్ కు ఏ మాత్రం పట్టు లేని రాష్ట్రాలలో కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన లభించడం, జనం పెద్దగా రావడం దేశంలో కాంగ్రెస్ కు జనాదరణ పెరుగుతోందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఈ కారణంగానే పార్టీకి దూరమైన నాయకులు కూడా ఒక్కరొక్కరుగా ఘర్ వాపసీకి రెడీ అవుతున్నారని చెబుతున్నారు. గతంలో నేరుగా రాహుల్ గాంధీపైనే విమర్శలు గుప్పిస్తూ అప్పటి అధినేత్రి సోనియాగాంధీకి బహిరంగ లేఖ రాసి మరీ పార్టీ నుంచి బయటకు వెళ్లి సొంత కుంపటి పెట్టుకున్న గులాం నబీ ఆజాద్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ లో ప్రవేశించగానే గులాం నబీ ఆజాద్ ఆయనతో అడుగు కలుపుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా పార్టీలో అసమ్మతి వాదులుగా ముద్ర పడిన జీ-23 నాయకులు కూడా ఒక్కరొక్కరుగా తమ రాహుల్ నాయకత్వాన్ని ఆమోదిస్తూ పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని ప్రశంసిస్తున్నారు.
ఆ కారణంగానే జీ-23 నాయకుడు అఖిలేష్ ప్రసాద్ సింగ్ ను బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ హై కమాండ్ నియమించింది. అలాగే మరో అసమ్మతి నాయకుడు భూపీందర్ సింగ్ హుడాకు హర్యానా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించారు. ఇక పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొంది.. అధిష్టానం వైఖరిపై అసంతృపతి వ్యక్తం చేసి పార్టీ వీడిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అడుగులు కూడా మళ్లీ కాంగ్రెస్ దిశగానే పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 26న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాం నబీఆజాద్ డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. అయితే నాలుగు నెలల వ్యవధిలోనే ఆయన కాంగ్రెస్ దేశంలో బీజేపీని ఎదుర్కొనగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు.
అంతకు ముందు రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా ఆ యాత్ర కన్వీనర్ దిగ్విజయ్ సింగ్ గులాం నబీ ఆజాద్ ను కోరారు. అలాగే ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. గులాంనబీ ఆజాద్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలను బట్టి త్వరలో గులాం నబీ ఆజాద్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు,