ఏపీలో బీఆర్ఎస్ ప్రవేశం వల్ల ఏం జరుగుతుందంటే?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో రాజకీయంగా ఎదిగిన కేసీఆర్.. అలా ఎదిగేందుకు  ఏపీపైనా, ఏపీ నేతలపైనా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనా తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పించారు. అవహేళన చేశారు. చులకనగా మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బవించి ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఎప్పుడు తన పరపతి కాస్త తగ్గిందని భావించినా కేసీఆర్.. ఏపీ వ్యతిరేకతనే  ఉత్ప్రేరకంగా చేసుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పండించి పబ్బం గడుపుకున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ రాష్ట్రంలో ప్రచారానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ.. మళ్లీ ఆంధ్రపాలకులు తెలంగాణపై కన్నేశారంటూ విమర్శలు గుప్పించారు. అంతెందుకు కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసీఆర్, ఇప్పుడు అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటున్నారు. ఇందుకు ఆ రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారా? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును మరిచి పోతారా? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్ కు ఆ రాష్ట్ర ప్రజలు రెడ్ కార్పెట్  వేసి స్వాగతం పలుకుతారా?  కేసీఆర్, నేను మరిపోయాను అంటే, ఏపీ ప్రజలు నమ్ముతారా? కేసేఆర్ నమ్మించగలరా? తాను తెలంగాణలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించారు. 2018 ఎన్నికలలో మరోసారి అధికారం చేపట్టేందుకు తెలంగాణ సెంటిమెంట్ నే ఆ శ్రయించారు.

ఇప్పుడు జాతీయ రాజకీయాల పేరు చెప్పి.. తెలంగాణ రాష్ట్ర సమితిలోని తెలంగాణను తీసేసి.. భారత్ చేరిస్తే.. గత విమర్శలన్నీ మాయం అయిపోయినట్లేనా? పార్టీ పేరు మారినా.. నాయకుడు ఆయనేగా అని ఏపీ ప్రజలు నిలదీయరా? ఎవరో కొందరు నేతలో, పార్టీలో భారసకు ఏపీలో స్వాగతం పలికినంత మాత్రాన ప్రజలంతా సమ్మతం తెలిపినట్లేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ కు రాజకీయ టక్కుటమార గజ కర్ణ గోకర్ణ విద్యలు బాగా కొట్టిన పిండే అయినా,  ఏపీ ప్రజలను నమ్మించడం, వారి విశ్వాసం పొందడం సులభం అనుకుంటే అది పొరపాటే అవుతుంది. 

నిజానికి, కేసేఆర్ ఏపీలో ఎంటర్ అవ్వాలంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక సారి కాదు, వెయ్యిసార్లు ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పవలసి ఉంటుందని ఏపీ జనం అంటున్నారు. మరి కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? ఏపీ ప్రజలకు క్షమాపణలు చెపుతారా? అలా చేస్తే భరాసకు తెలంగాణలో నూకలు చెల్లినట్లే అవుతుంది. ఇప్పటికే ఆయన పార్టీ పేరులోని తెలంగాణ తీసేసిన తరువాత అక్కడ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కనుక ఏపీ ప్రజలకు సారీ చెప్పి తెలంగాణ ప్రజలలో మిగిలిన కొద్ది పాటి విశ్వాసాన్నీ పోగొట్టుకునే సాహసం చేయరు.  సో .. ఆయన  ఏపీలో ప్రవేశానికి దొడ్డి దారిని వెతుక్కుంటున్నారు.

ఏపీలోని పార్టీలలో అసంతృప్తులను, అవకాశాలు లేని వారిని ఎంచుకుని వారిని హైదరాబాద్ కు పిలిపించుకుని బీఆర్ఎస్ కండువా కప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే కొందరు నేతలు సోమవారం (జనవరి 2) హైదరాబాద్ లో బీఆర్ఎస్ కండువాలు కప్పుకోనున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం.. ఇది ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా.. ఆఖరికి కేసీఆర్ కూడా.. ఏపీ జనం విభజన వల్ల ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు, నష్టాలకు కాంగ్రెస్, కేసీఆర్ లే కారణమన్న భావనలో ఉన్నారు. విభజన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ కు విజయం సంగతి అలా ఉంచితే.. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. బీఆర్ఎస్ పేర కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టినా పరిస్థితి అందుకు భిన్నంగా ఉండదన్నది పరిశీలకుల విశ్లేషణ.

బీఆర్ఎస్ ను వైసీపీ స్వాగతించడం, ఆ పార్టీ రాజకీయ వ్యూహమే తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో పోటీ చేసే పార్టీలు పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి లబ్ధి పొందాలన్న భావనతోనే వైసీపీ కేసీఆర్ కు స్వాగతం పలుకుతోంది. అయితే ఏపీలో బీఆర్ఎస్ కు పట్టు చిక్కడం అంత సులువు కాదని అంటున్నారు. కేసీఆర్ గతంలో ఆంధ్రులను చులకన చేస్తూ చేసిన, పేడ బిర్యానీ వంటి వ్యాఖ్యలను ప్రజలు మరిచిపోయే అవకాశం లేదంటున్నారు. అన్నిటికీ మించి ఏపీలో బీఆర్ఎస్ ప్రవేశం వల్ల తెలంగాణలో ఆ పార్టీకి ఉన్ప పట్టు సడిలడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించే అవకాశం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. 

Teluguone gnews banner