పంత్ ను కాపాడిన డ్రైవర్ కు మాజీ క్రికెటర్ లక్ష్మణ్ కృతజ్ణతలు

ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ ను సకాలంలో రక్షించి ఆసుపత్రికి తరలించిన హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  అన్ని వర్గాలు సుశీల్ కుమార్ ను ప్రశంసించడమే కాదు.. కృతజ్ణతలు కూడా తెలుపుతున్నాయి.  
కుటంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తూ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

శుక్రవారం (డిసెంబర్ 30) తెల్లవారుజామున 5.30 గంటలకు పంత్ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ-డెహ్రాడూన్‌ జాతీయ రహదారిలో రూర్కీ నర్సన్ సరిహద్దు వద్ద  అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైంది. తీవ్రంగా గాయాలు అయిన అతడు ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని మరింత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించనున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే రిషబ్ పంత్‌ కారు మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్‌ఇ 43 4మ్యాటిక్ కూపేలో మంటలు చెలరేగాయి.

దాంతో కారు అద్దం పగలగొట్టి బయటకు వచ్చేందుకు పంత్ ప్రయత్నించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. కారు కిటికీలో నుంచి సగం బయటకు వచ్చిన పంత్‌ను బయటకు లాగాడు. ఓ బెడ్‌షీట్‌తో పంత్ శరీరాన్ని కప్పాడు.

వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించి.. అందులో ఆసుపత్రికి పంపించాడు.ఇంతకీ ఈ డ్రైవర్ సుశీల్ కుమార్ కు క్రికెట్ తెలియదు. పంత్ ఎవరో కూడా తెలియదు. అయినా సమయానికి ఆపద్బాంధవుడిలా రిషబ్ పంత్ ను కాపాడాడు, మంచి మనసుతో, సేవా దృక్ఫథంతో యువ క్రికెటర్ ప్రాణాలు కాపాడిన సుశీల్ కుమార్ కు మాజీ క్రికెటర్ హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ణతలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.మీ నిస్వార్థ సేవకు మేమంతా రుణపడి ఉంటామని లక్ష్మణ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అలాగే ఆ బస్సు కండక్టర్ పరంజిత్ కూడా లక్ష్మణ్ ఆ ట్వీట్ లో ధన్యవాదాలు తెలిపాడు. 

Teluguone gnews banner