ఏపీలో ముందస్తు తథ్యం.. మేలోనే ముహూర్తం
posted on Dec 30, 2022 @ 9:56PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. వచ్చారు. అయితే ఎందుకు వెళ్లారు? వెళ్లి ఏమి చేశారు? ఎవరిని కలిశారు, ఏమి మాట్లాడారు? ఏమి సాధించారు, ఏమి తెచ్చారు? అంటే మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టం. ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. గతంలో ఆ ఇద్దరికి ఇంకొందరు కేంద్ర మంత్ర్రులకు అనేక మార్లు ఇచ్చిన, వినతి పత్రం అనబడే కోర్కెల చిట్టా డేట్ మార్చి మరో మారు కేంద్ర నాయకులకు సమర్పించారు. నిజానికి ప్రదాని మోడీ, హోం మంత్రి అమిత్ షాకు ఇచ్చిన వినతి పత్రంలో ఏదైనా ఒకటీ అరా కొత్త కోర్కెలు ఉంటే ఉన్నాయేమో కానీ, మిగిలివన్నీ సేమ్ టూ సేమ్ అదే ఇది ఇదే అది. మూడున్నరేళ్ళుగా ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి ఢిల్లీ వెళ్లి పెద్దలకు ‘సమర్పించు’ కుంటున్న వినతులే ఇందులోనూ ఉన్నాయి.
అయితే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళింది, ఇప్పటికే అనేక మార్లు సమర్పించిన వినతి పత్రాన్ని మరోమారు సమర్పించడానికి కాదు ముందస్తు ఎన్నికలకు ‘పెద్దల’ అనుమతి తీసుకునేందుకేనని అంతర్గత వర్గాల సమాచారం. నిజానికి, ప్రజలు వైసీపీకి ఐదేళ్లకు అధికారం ఇచ్చినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అరాచక పరిపాలన, అన్నిటినీ మించి ఆర్థిక రంగంలో క్రమశిక్షణ రాహిత్యం పుణ్యాన మూడున్నరేళ్ళకే రాష్ట్రం దివాళా అంచులకు చేరుకుంది. పూర్తి కాలం బండి లాగడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి అయ్యే పని కాదని ఇప్పటికే తేలిపోయింది. అందుకే,. ముందస్తుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
నిజానికి మిగిలిన కాలం సంగతి ఎలా ఉన్నా, ముందున్న మూడు నెలలు మహా గడ్డు కాలం. జీతాలకు కాదు కదా, కనీసం చాయి బిస్కెట్ వంటి రోజువారీ ఖర్చులకు కూడా ఖజానాలో కాసులు లేవు. అందుకే ఈ మూడు నెలలు కొత్త అప్పుల కోసం కేంద్రం కరుణించి అనుమతి ఇస్తే మార్చిలో బడ్జెట్ ఓకే చేసుకుని, మే ఎన్నికల కసరత్తు ప్రారంభించాలనే ఆలోచన ముఖ్యమంత్రి చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
అందుకే ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి మోడీ, షాలకు పరిస్థితిని వివరించి...ఈ మూడు నెలలు ఆదుకుంటే ... కొత్త బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత కొత్త అప్పులతో ‘సంక్షేమ’ పథకాలు కొనసాగించి అక్టోబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళతానని, అందుకు అనుమతించాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే అందుకు మోడీ, షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. అందులో భాగంగానే, మచిలీపట్నం,రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం పేరిట రూ.12 వేల కోట్ల ఋణం ఇచ్చేందుకు, గ్రామీణ విధ్యుదీకర్ణ సంస్థ ( ఆర్ఈసీ), పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ ( పీఎఫ్’సీ) సూత్ర ప్రాయంగా అంగీకరించి నట్లు తెలుస్తోంది.
ఇందులో 20 శాతం అంటే, అంటే దాదపు రూ.2.400 కోట్లు తక్షణం ఏపీ మ్యారిటైం బోర్డుకు ఆర్ఈసీ ఇస్తుందని అధికార వర్గాల సమాచారంగా తెలుస్తోంది. ఏ నేపధ్యంలోనే వైసీపీ సర్కార్ నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం మార్చిలో ముగిసిన తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామాలు చోట చేసుకోబోతున్నాయని చెప్తున్నారు. అందుకు తగినట్లుగానే ప్రభుత్వం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నట్లు అర్ధమవుతోంది.
ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయారని అంటున్నారు. ఓ వంక మార్చిలో గడప గడప చివరి రివ్యూ తర్వాత అభ్యర్ధులను ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా పేర్కొన్నారు. మరో వంక ఆయన ప్యాలెస్ గడప దాటి, బయటకు వచ్చారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగాలను గమనిస్తే, ఎలక్షన్ టోన్ స్పష్టంగా వినిపిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతూనే, ప్రతిపక్ష పార్టీలు నాయకులు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి వైసీపీలో కీలక నేతలు అంతర్గతంగా సంకేతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బయటికి మాత్రం ముందస్తు ఎన్నికల సమస్యే లేదని ప్రకటనలు గుప్పిస్తున్న నేతలు అంతర్గంతగా మాత్రం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.
అదలా ఉంటే మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం(డిసెంబర్ 29) విజయనగరం జిల్లా రాజాం నియోజక వర్గం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ముందస్తు ఎన్నికలకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు. ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు, ఇద్దరు గృహ సారథులను నియమించాం..వీరి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అని కుండబద్దలు కొట్టారు. అంతే కాదు,జనవరి 1 నుంచి కన్వీనర్లు., గృహ సారథులు క్రియాశీలంగా వ్యవహరిస్తారని చెప్పారు. అంటే కొత్త సంవత్సరం తొలి రోజు నుంచే ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నామని బొత్స చెప్పకనే చెప్పారు.
అదలా ఉంటే జగన్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జనవరి 8న ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. జనవరి 26 తర్వాత బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న గ్రామీణ ప్రాంత పాదయాత్రలకు సన్నాహకంగా, జనవరి 8న కర్నూలులో.. హిందూపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో అమిత షా పాల్గొంటారని పార్టీ ప్రకటించింది. అలాగే, జనవరి 26 తర్వాత రాష్ట్రంలోని 13 వేల గ్రామాల్లో బీజేపీ చేపట్టే సంపర్క పాదయాత్రలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేసేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. సో .. అటు వైసీపీ, ఇటు బీజేపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ కదలికలు ముందస్తు ఎన్నికలకు స్పష్టమైన సంకేతాలని విశ్లేషకులు చెప్తున్నారు.
అయితే, ఏపీలో ముందస్తు ఎన్నికలు తథ్యమని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందుగానే పసిగట్టారు. వచ్చే ఏడాది మే లేదా అక్టోబర్‌లో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇటీవల ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మరోమారు ముందస్తు ప్రస్తావన చేశారు. ఓటమి భయంతోనే జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారని తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారం 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఓటమి భయంతో ముందస్తుకు వెళ్లనున్నారని అన్నారు. మరో వంక ముందస్తు ఎన్నికలను ముందుగా పసిగట్టిన చంద్రబాబు నాయుడు, ఇప్పటికే జిల్లాల పర్యటనలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. బాదుడే బాదుడు.. ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. సో.. అటు అధికార పార్టీ అడుగులను గమనించినా , ఇటు ప్రతిపక్షం దూకుడు గమించినా , ముందస్తు ఎన్నికలు తథ్యం ... అంటున్నారు విశ్లేషకులు.