గుంటూరులో తొక్కిసలాట ముగ్గురు మృతి
posted on Jan 1, 2023 @ 11:47PM
గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్విర్యంలో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. అంతకు ముందు ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పేదలకు జనతా వస్త్రాల పంపిణీ ప్రారంభించి వెళ్లారు.
అనంతరం తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ 20లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కూడా తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోవడం బాధాకరం అని చంద్రబాబు అన్నారు.
పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోనే కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. పేదల ఇళ్లలో జరిగిన ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని...ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.