జనసేనకు షాక్.. బీఆర్ఎస్ గూటికి తోట చంద్రశేఖర్

బీఆర్ఎస్ విస్తరణను  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపీ నుంచే ఆరంభించారు. ఇప్పటికే ఏపీలోని పలువురు నేతలపై దృష్టి సారించి  వారితో సంప్రదింపులు జరిపిన. కేసీఆర్.. పలువురు నేతల చేరికకు రంగం సిద్ధం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పొలిటికల్ ఎంట్రీతో తొలి షాక్ జనసేన పార్టీకే తగిలింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన క్షణం నుంచీ ఆ పార్టీ ఆంధ్రాలో అడుగుపెట్టడం ఖాయమన్న వార్తలు వినవస్తూనే ఉన్నాయి.

ఆ పార్టీ ఏపీ బాధ్యతలు తలసాని శ్రీనివాస యాదవ్ కు అప్పగించారనీ కూడా ఒక సందర్భంగా పెద్దగా ప్రచారం కూడా జరిగింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రకటన చేసిన సందర్భంలోనే త్వరలో ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఘనంగా ఎంట్రీ ఇస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ తరువాత బీఆర్ఎస్ విస్తరణ అడుగులు పడలేదు. లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసుల వల్లనో లేక.. కేసీఆర్ అనుకున్న విధంగా ఎటువంటి మద్దతూ రాకపోవడం వల్లనో కానీ.. బీఆర్ఎస్ విస్తరణ అడుగులు ఆగిపోయాయి. తాజాగా కొత్త సంవత్సరం ఆరంభంలో అనూహ్యంగా బీఆర్ఎస్ లోకి  ఆంధ్రప్రదేశ్ నుంచి చేరికలు ఆరంభమయ్యాయి.

అసలు   బీఆర్ఎస్ ప్రకటించిన క్షణం నుంచే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడితే ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీకి నష్టం అన్న చర్చలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ వల్ల తెలుగుదేశం నష్టపోతుందని కొందరూ, కాదు కాదు అధికార వైసీపీకే ఇబ్బందులు ఎదురౌతాయని మరి కొందరూ అంచనాలు వేశారు. ఒక దశలో వైసీపీ బీఆర్ఎస్ కు రాష్ట్రంలోకి వెల్ కమ్ చెప్పింది కూడా. అయితే కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ ఆంధ్రలో అడుగుపెట్టేస్తోంది. అయితే ఆ ఏపీ నుంచి ఆ పార్టీలోకి చేరుతున్న వారిలో తెలుగుదేశం, వైసీపీల నుంచి ఎవరూ లేరు కానీ అనూహ్యంగా జనసేన నుంచి కీలక నేతలు ఆ పార్టీలోకి జంప్ చేసేశారు.

 ముఖ్యంగా  పార్టీ ఆవిర్భావం నుంచీ జనసేనతో ట్రావెల్ చేసినా గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరడం ఆ పార్టీకి ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం చేరువ కావడానికి దోహదం చేసే అవకాశం ఉంది. గతంలో ప్రజా రాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ లో పనిచేసిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. జనసేనలో కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా ఉన్న ఆయన.. జనసేనలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. తోట చంద్రశేఖర్ హైదరాబాద్ లో సోమవారం(జవవరి2) కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.  గుంటూరు నుంచి భారీ ర్యాలీతో తోట చంద్రశేఖర్ హైదరాబాద్ చేరుకుంటారు. పార్టీలో చేరిన రోజునే తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.  

ఆయనే కాకుండా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా సోమవారం (జనవరి 2) కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. రావెల కిషోర్ బాబు  2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి  టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు.  2017లో మంత్రివర్గ విస్తరణలో పదవి పోవటంతో పార్టీకి రాజీనామా చేసారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. కొద్ది కాలం కిందట బీజేపీకి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థ సారథి కూడా బీఆర్ఎస్ లో చేరనున్నారు. అనంతరం కేసీఆర్ ఏపీ పర్యటన ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీ రాజకీయాలు బీఆర్ఎస్ ప్రవేశంతో మరింత వేడెక్కే అవకాశం ఉంది.  
 

Teluguone gnews banner