ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. మూడు రాజధానుల ముచ్చటే లేదు!
posted on Mar 14, 2023 @ 12:50PM
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మూడు రాజథానుల అంశం ప్రస్తావనే లేకపోవడంపై అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తమౌతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్ కానీ, ఆయన కేబినెట్ సహచరులు కానీ ఖాతరు చేయకుండా అవకాశం ఉన్నా లేకున్నా.. సందర్భం వచ్చినా రాకున్నా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు మా విధానం అంటూ ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి జగన్ సైతం తాను త్వరలో విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తానంటూ గ్లోబల్ సమ్మిట్ కు ముందూ, సమ్మిట్ వేదికగానూ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగంలో కచ్చితంగా మూడు రాజధానుల ప్రస్తావన ఉంటుందని అంతా భావించారు. జగన్ సర్కార్ కోర్టు ధిక్కరణ అన్న అంశాన్ని ఇసుమంతైనా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు కారణంగానే గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన జొప్పిస్తారని పరిశీలకులు సైతం అంచనా వేశారు. అయితే ఆశ్చర్యకరంగా గవర్నర్ ప్రసంగంలో ఆ ప్రస్తావనకు చోటు లేకుండా పోయింది. గవర్నర్ కు ఇచ్చే ప్రసంగ పాఠంలో ఆ అంశాన్ని జొప్పించే ధైర్యం జగన్ సర్కార్ చేయకపోవడానికి ఆయన సుదీర్ఘ కాలం సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేయడమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక వేళ ఆ అంశాన్ని జొప్పించినా గవర్నర్ అది చదవడానికి నిరాకరించి ఉండేవారన్న భావనతోనే జగన్ సర్కార్ వెనక్కు తగ్గిందని పరిశీలకులు చెబుతున్నారు.
ఆ ఒక్క అంశం వినా గవర్నర్ ప్రసంగం మొత్తం జగన్ పాలనను ఆకాశానికి ఎత్తేస్తూనే కొనసాగింది. ఏపీ సర్కార్ పారదర్శక పాలన అందిస్తోందని అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అవినీతి రహితంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నట్ల చెప్పారు. అర్హులైన లబ్ధిదారుల ఖాతాలలో పథకాల సొమ్ములు క్రమం తప్పకుండా జమ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో తన సర్కార్ సుపరిపాలన అందిస్తోందన్నారు. అర్థిక రంగంలో ఏపీ పురోగమిస్తోందనీ, వ్యవసాయం, పారిశ్రామిక రంగం సహా అన్ని రంగాలూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయనీ గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
. కాగా గవర్నర్ ప్రసంగంలో వృద్ధి రేటు ప్రస్తావన రాగానే తెలుగుదేశం సభ్యులు అభ్యంతరం తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో గణాంకాలన్నీ కల్పితాలేనని విమర్శించారు. గవర్నర్ నోట జగన్ సర్కార్ అబద్ధాలు పలికిస్తోందంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే సభ వాయిదా పడింది. అనంతరం జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను 9 రోజులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 16న సభలో విత్త మంత్రి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.