ముందస్తు లేదంటూనే.. ఎన్నికల మూడ్ లోకి బీఆర్ఎస్!
posted on Mar 14, 2023 @ 12:09PM
రాజకీయ నాయకుల వ్యూహాలు చిత్రంగా ఉంటాయి. నోటితో ఒకటి చెబితే.. చేతలలో మరోటి చేస్తుంటారు. నోటితో ఔనన్నదానినే నొసటితో కాదంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటువంటి వ్యూహాలు, ఎత్తులలో సిద్ధహస్తడని రాజకీయ వర్గాలలో ఒక టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవలబీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాలలో ముందస్తు ఎన్నికల ప్రశక్తే లేదని విస్పష్టంగా ప్రకటించారు.
ఆ వెంటనే పార్టీని మాత్రం ఎన్నికలకు సమాయత్తం చేయడం ప్రారంభించేశారు. రాష్ట్రంలో మరో సారి అధికారమే లక్ష్యంగా పార్టీని ఎన్నికల మూడ్ లోకి తీసుకు వెళ్లి పోయారు. ఎన్నికల వ్యూహరచనలో భాగంగా కేసీఆర్ పలు కార్యక్రమాలను ప్రకటించారు. ఆత్మీయ సమ్మేళనాలు, నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్చార్జీల నిమామకాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలను మొదలెట్టేశారు. షెడ్యూల్ ప్రకారమైతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. ఇదేం పెద్ద ఎక్కువ సమయం కాదు. సాధారణంగా రాజకీయ పార్టీలన్నీఈ సమయం వచ్చే సరికే ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోతాయి. కానీ కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కంటే రెండు మూడునెలల ముందే వస్తాయా అన్నట్లుగా తన ఎన్నికల సన్నాహకాల వేగాన్ని పెంచేశాయి.
గతంలో ఒక సారి సిట్టింగులందరికీ సీట్లు అని ప్రకటించేసి తరువాత తీరిగ్గా నాలుక కరుచుకున్న కేసీఆర్.. తూచ్ అందరికీ కాదు.. గెలుపు గుర్రాలకే అని సవరించుకున్నసంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సిట్టింగులకే సీట్లు అంటూ ప్రకటించారు. అదే సమయంలో 99 శాతం మంది సిట్టింగులకు మాత్రమే అని చెప్పారు. ఇది సిట్టింగులలోనే కాకుండా, ఆశావహుల్లో కూడా జోష్ నింపుతుంది. ఇక ఆత్మీయ సమ్మేళనాలకు షెడ్యూల్ ప్రకటించడంతో క్యాడర్ కు విరామం లేని కార్యక్రమాలు ఉంటాయి. జనంలోకి వెళ్లడమే ప్రజాప్రతినిథుల నిత్యకృత్యంగా మారిపోతుంది. ఈ పరిస్థితి ఇటీవలి పరిణామాలతో ఒకింత నైరాశ్యంలోకి వెళ్లిన శ్రేణులను వెంటనే యాక్టివ్ అవ్వడానికి ఆత్మీయ సమ్మేళనాలు దోహదం చేస్తాయనడంలో సందేహం లేదు.
మరోవైపు ప్రభుత్వ పథకాలైన దళిత బంధు, గొర్ల పంపిణీ, సొంతింటి జాగా లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాల అమలుకూ యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. విరామం లేని కార్యక్రమాలతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా లీడర్లు, క్యాడర్ కు చేతి నిండా పని కల్పించాలన్నది ఆయన ఉద్దేశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.