వెంకయ్యకు నిజంగానే అన్యాయం జరిగిందా?
posted on Mar 13, 2023 @ 12:22PM
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఒక సారి చెపితే వంద సార్లు చెప్పినట్లే.. సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఆయన చేసే వ్యాఖ్యలు, ఆయన చెప్పే సినిమా డైలాగుల్లానే భలే పేలుతుంటాయి. ఆయన అభిమానులు అయితే, ఆయన్ని దేవుడితో సమానంగా చూస్తారు. రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటారు. నిజానికి, ఒకప్పడు ఆయన రాజకీయ అరంగేట్రం గురించి చాలా పెద్ద ఎత్తున చర్చే జరిగింది. అభిమానుల అభిప్రాయ సేకరణ పేరిట అభిములు తమిళనాడులో అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. నిజానికి ఒక దశలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోను ఒక కాలు పెట్టేశారు కూడా. సొంత పార్టీ పెడుతున్నానని ప్రకటించేశారు కూడా. అయితే రెండవ కాలు పెట్టకుండానే ఆయన ముందు పెట్టిన కాలుని వెనక్కి తీసుకున్నారు. డ్రాపై పోయారు. సైలెంటైపోయారు. అనారోగ్యం కారణంగా రాజకీయ అరంగేట్రం చేయకుండానే, శుభం కార్డు వేశారు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల గురించి ఆయన ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.
అయితే ఇప్పుడు హఠాత్తుగా పాత పడిపోయిన రాజకీయ చర్చను ఫ్రెష్ గా తెరమీదకు తెచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి. కొత్త చర్చకు తలుపులు తెరిచాయి. నిజానికి వెంకయ్య నాయుడు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నసమయంలో ఆయన్ను ప్రధాని మోడీ ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం రజనీకాంత్ కు ఇప్పుడు నచ్చలేదేమో కానీ, అప్పట్లోనే చాలా మందికి నచ్చలేదు. ఆయన్ని క్రియాశీల రాజకీయలకు దూరం చేశారనే అభిప్రాయం, ఆవేదన ఇప్పుడు రజనీ కాంత్ వ్యక్తం చేశారు
కానీ అప్పట్లో నే చాలా మంది, ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో... చాలా గట్టిగా వ్యక్తమైంది. రాజకీయ విశ్లేషకులు, రాజకీయ ప్రముఖులు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వాళ్లు, వీళ్ల దాకా ఎందుకు స్వయంగా వెంకయ్య నాయుడు కూడా, ఒకటి రెండు సందర్భాలాలో క్రియాశీల రాజకీయాలకు దూరం కావడం ఒక విధంగా తనకు కూడా ఇష్టం లేదని, అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయాన్ని కాదనలేక పోయానని చెప్పుకొచ్చారు. అలాగే ఒక విధంగా ఇది దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయంగా భావించే వారు కూడా లేకపోలేదు.
ఇప్పడు అదే విషయాన్ని, సూపర్ స్టార్ రజనీకాంత్, తన దైన స్టైల్లో చెప్పు కొచ్చారు. వెంకయ్య నాయుడుకి, ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదని, ఒక గొప్పనాయకుడిని క్రియాశీల రాజకీయాల నుంచి దూరం చేశారని కుండ బద్దలు కొట్టారు. అది కూడా వెంకయ్య నాడు సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి దుమారం సృష్టించారు. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమానికి వెంకయ్య, రజనీకాంత్ అతిధులుగా వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన రజనీకాంత్, వెంకయ్య నాయుడు ఇంకొంత కాలం క్రియాశీల రాజకీయాల్లో, కేంద్ర మంత్రిగా కొనసాగి ఉంటే బాగుండేదని అన్నారు. అయితే, తాను ఉపరాష్ట్ర పదవిని చులకన చేయడం లేదని, వెంకయ్య నాయుడు మరికొంత కాలం కేంద్ర మంత్రిగా కొనసాగి ఉంటే బాగుండేదని మాత్రమే చెబుతున్నాననీ అన్నారు.
రజనీ కాంత్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో కానీ, వెంకయ్య నాయుడు ఐదేళ్ళ పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా వెంకయ్యనాయుడుకి అన్యాయం జరిగిందనే చర్చ జరగడం మాత్రం, నిజంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల మనోభావాలను అద్దంపడుతోందన్నది మాత్రం వాస్తవం. నిజానికి వెంకయ్యకు ఒకసారి కాదు, రెండు సార్లు అన్యాయం, అవమానం జరిగింది. దక్షణాది రాష్ట్రాల ప్రజల్లో ముఖ్య్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రదేశ్ ప్రజల మనసుల్లో నిలిచి పోయింది. ఉప రాష్ట్ర పదవి ఇచ్చి ఒకసారి, రాష్ట్రపతి పదవి ఇవ్వకుండా వెంకయ్యను రెండో సారి మోసం చేశారన్న అభిప్రాయం దక్షిణాది రాష్ట్రాల ప్రజల్లో ఉందనేది మాత్రం కాదన లేని నిజం.