పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మలి విడత మొదటి రోజు ..ఇలా వృధా
posted on Mar 13, 2023 @ 11:18PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్యంపై లండన్ లో చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ సమావేశాల్లో తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ కేంద్ర ప్రభుత్వం.. ఆయన క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించారని, క్షమాపణలు చెప్పాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని రాహుల్ విదేశాలను కోరారన్నారు.
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం (మార్చి 13) ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలవ్వగానే కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ భారత దేశాన్నిఅవమానించారు. ఆయన వ్యాఖ్యలను ఈ సభలోని సభ్యులంతా ఖండించాలి. రాహుల్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని రాజ్‌నాథ్ డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు బీజేపీ మిత్రపక్ష నేతలూ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి విమర్శలను కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకించారు. ప్రధాని మోడీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై విదేశాల్లో విమర్శలు గుప్పించారని గుర్తు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అదలా ఉంటే లండన్‌లో ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంటులో అధికారపక్షం డిమాండు చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వారే , ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని మాట్లాడుతుండటం దురదృష్టకరమని మండిపడ్డారు. పార్లమెంట్ బడ్జెట్ రెండో దఫా సమావేశాలు మొదలైన కొద్దిసేపటికే కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ నుంచి విజయ్ చౌక్ వరకు మల్లికార్జున ఖర్గే ర్యాలీ నిర్వహించారు. దేశంలో చట్టపరమైన పాలన లేదని.. ప్రధాని మోడీ దేశాన్ని ఓ నియంతలా పాలిస్తున్నారని ఆరోపించారు.
వారు (బీజేపీ)ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ నాశనం చేస్తున్నారు. మోదీ పాలనలో రాజ్యాంగానికి స్థానం లేదు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ విపక్షాలనూ అణచివేతకు గురిచేస్తున్నారు. ఇలాంటి వారు ప్రజాస్వామ్యం, జాతీయవాదం, దేశ గౌరవం గురించి మాట్లాడుతున్నారు అని కేంద్ర ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు బీజేపీ నేతలు వాస్తవాలను సరి చూసుకోవాలని హితవు పలికారు.
కేవలం అదానీ, హిండెన్‌బర్గ్ అంశం నుంచి దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ఇటువంటి వాదనలు చేస్తోందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. జేపీసీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న తనపైనా వివక్ష కొనసాగుతోందని.. సభలో మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించడంలేదని ఖర్గే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, వామపక్ష పార్టీలతోపాటు ఆమ్‌ఆద్మీపార్టీ ఎంపీలు ర్యాలీ నిర్వహించారు.
కాగా, ఓ వంక అధికార పక్షం రాహుల్ గాంధీ క్షమాపణల కోసం పట్టు పట్టడం, మరో వంక విపక్షాలు అదానీ, హిండెన్‌బర్గ్ అంశంపై జేపీసీ ఏర్పటు చేయాలని పట్టుపట్టడంతో, పార్లమెంట్ బడ్జెట్ మలి విడత సమావేశాలు మొదటి రోజు ... వృధా రోజుల ఖాతాలో చేరిపోయింది.