రాజకీయ నాయకులకు అవినీతి మరక.. మంచిదేనా?
posted on Mar 13, 2023 @ 1:13PM
అవినీతి ఆరోపణలను ఎదుర్కొనడం రాజకీయాలలో రాణించడానికి ఒక క్రెడిట్ గా నాయకులు భావిస్తున్నారా? అవినీతి మరక అంటితేనే జనంలో గుర్తింపు వచ్చినట్లుగా భావిస్తున్నారా? ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ నేతలకు ఈ మరక మంచిదేనా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే అనిపించక మానదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులను గమనిస్తే.. అవినీతి మరక అంటిన.. అంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులే గట్టిగా అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడటం, తమపై ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమేనంటూ ప్రకటనలు గుప్పించడం చూస్తుంటే.. ఆ మరకనే పాపులర్ లీడర్ గా మారే అవకాశాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న భావన కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతోంది.
మొత్తంగా చూస్తే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారిలో అత్యధికులు రాజకీయ నేతలే ఉంటున్నారు. మొత్తంగా పార్టీలకు పార్టీలు, ప్రభుత్వాలకు ప్రభుత్వాలు ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం విషయానికి వస్తే.. ఈ కుంభకోణంలో ఆరోపణలు చేస్తున్నవారూ.. ఆరోపణలను ఎదుర్కొంటున్న వారూ అందరూ రాజకీయ నేతలే. మొత్తంగా ఈ కుంభకోణమే ఒక ప్రభుత్వ మద్యం విధానానికి సంబంధించినది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం అమలు చేసి ఉపసంహరించుకున్న మద్యం విధానంలో లోపాలున్నాయంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫిర్యాదు ఈ తేనెతుట్టె కదలడానికి ఆధారభూతంగా మారింది.
మద్యం కుంభకోణానికి ముందూ తరువాతా కూడా ఇలా అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్న నేతలు పలువురు ఉన్నారు. ఎపి సిఎంగా ఉన్న జగన్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, తృణమూల్ మంత్రులు, ఆప్ నేతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుందనడానికి సందేహం అవసరం లేదు. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో నేరం రుజువు కాలేదు. ఆరోపణల మరకలు మాత్రమే పడ్డాయి.
అయితే ఆ మరక అంటుకున్న నేతలకు విపక్షాలు మద్దతుగా నిలుస్తున్నాయి. అదే మరక పడిన తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరైన క్రమంలో రాత్రికి రాత్రి జాతీయ రాజకీయాలలో ప్రధాన ఆకర్షణగా మారిపోయారు. ఆమె ఈడీ విచారణకు హాజరవ్వడానికి ముందు వరకూ ఆమె తండ్రి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానం కొండ ఎక్కదు.. కొండ దిగదు అన్నట్లుగా తొలి అడుగులోనే అటూ ఇటూ కదలకుండా స్థిరంగా ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సత్తా చాటుతామంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు వినా ఆ దిశగా కదలిక ఇసుమంతైనా కనిపించిన దాఖలాలు లేవు. అయితే ఎప్పుడైతే ఈ కుంభకోణంలో కవితను విచారణకు ఈడీ పిలిచిందో.. అప్పుడే జాతీయ స్థాయిలో రాజకీయ కదలిక ఆరంభమైంది. దాదాపు 18 పార్టీలు కవితకు మద్దతుగా ఢిల్లీలో ఏకతాటిపైకి వచ్చాయి.
తాను ఈడీ విచారణకు హాజరు కావడానికి ఒక రోజు ముందు.. అంటు శుక్రవారం ( మార్చి 9)న చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం ఆమె చేపట్టిన దీక్షకు మద్దతు పలికాయి. ఆమెతో పాటు ఆయా పార్టీల నాయకులూ దీక్షలో కూర్చున్నారు. ఆ దీక్షా వేదిక నుంచే మద్యం కుంభకోణంలో కవితను ఈడీ విచారణకు పిలవడాన్ని ఖండించారు. ఈ ఖండన, ఆయా పార్టీల మద్దతు కచ్చితంగా బీఆర్ఎస్ కు రాజకీయంగా జాతీయ స్థాయిలో ఒక ముందడుగు వేసేందుకు అవకాశం ఇచ్చిందనే చెప్పాలి. అలాగే కవితకు సంఘీ భావంగా హస్తిన వెళ్లిన బీఆర్ఎస్ అగ్రనేతలు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు బీఆర్ఎస్ జాతీయ ప్రస్థానానికి అవసరమైన అడుగులు వేయడానికి వీలుగా రోడ్ క్లియర్ చేసే కార్యక్రమం చేపట్టారని కూడా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కవిత తన ఒక్కరి తరఫునే కాకుండా ఈడీ, సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న విపక్షాలకు చెందిన అందరి నాయకుల తరఫునా వకల్తా పుచ్చుకున్నారు.
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలకు ముందు ప్రచారం కోసం మోడీ రావడానికి ముందుగానే ఈడీ, సీబీఐ, ఐటీలు వస్తాయన్న ఆమె వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్దం ఒక్కటే. ఈ వేధింపులు ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై లేవనీ, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న అన్ని రాష్ట్రాలలోనూ విపక్షాలకు ఈ వేధింపులు ఉన్నాయనీ, ఉంటాయనీ కవిత అంటున్నారు. దాదాపు విపక్షాలన్నిటిదీ అదే మాట. ఇప్పటి వరకూ వేటికవిగా ఉన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు కవిత ఈడీ విచారణ ఎపిసోడ్ ను వేదికగా చేసుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోందని అంటున్నారు. ఆ విధంగా చేస్తు కవితపై పడిన ఈ అవినీతి మరక మంచిదేనని బీఆర్ఎస్ భావిస్తోందా అన్నే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.