వైనాట్ 175.. జగన్ ధీమాకు కారణం ఇదేనా?
posted on Mar 14, 2023 @ 11:08AM
వైనాట్ 175.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కాన్ఫిడెన్స్ కు కారణమేమిటో తేలిపోయింది. వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరుతామంటున్న వైసీపీ భరోసా ఏమిటో అర్ధమైపోయింది. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఎలా గెలవబోతోందో.. పట్ట భద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ ట్రయలర్ చూపింది. ఆ ట్రయలర్ లోనే అందరికీ వైసీపీ గెలుపు వ్యూహాలేమిటో తేటతెల్లమయ్యాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏరి కోరి ఏర్పాటు చేసుకున్న వంలంటీర్ల వ్యవస్థ ఏం చేయబోతోందో ఎమ్మెల్సీ ఎన్నికలలో తేలిపోయింది. పేరుకు జరిగినవి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు కానీ పెద్ద సంఖ్యలో అండర్ గ్యాడ్యుయేట్లు ఓటు వేశారు. కేవలం ఆరో తరగతి, ఏడో తరగతి, మహా అయితే టెన్త్ చదివిన వారు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారు. వలంటీర్లు వారికి ఓటింగ్ స్లిప్పులు ఇచ్చారు. అధికారులు దగ్గరుండి ఓట్లు వేయించారు. అడ్డుకున్న వారిపై పోలీసులు కేసులు పెట్టారు. లాఠీ చార్జి చేశారు. మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికను ప్రజాస్వామ్మమే నిర్ఘాంతపోయేంత ప్రశాంతంగా జరిపించారు. కనీస విద్యార్హత లేకుండా ఓటు వేయడానికి వచ్చిన వారిని ప్రశ్నిస్తే.. వారి నుంచి వచ్చిన సమాధానాలు వ్యవస్థలను జగన్ సర్కార్ ఈ నాలుగేళ్ల కాలంలో ఎంతగా నిర్వీర్యం చేసిందో అవగతమౌతుంది. ఒక ఓటరేమో తాను చదివించి ఏడో తరగతేననీ, అయితే తమ వార్డులో ఈ ఎన్నికలలో ఓటు వేయడానికి తనతో పాటు మరో ముగ్గుర్ని ఎన్నుకున్నారనీ తెలిపారు. వారి విద్యార్హత కూడా ఆరు, ఏడు తరగతులేనట. ఓటింగ్ స్లిప్పులు ఎవరిచ్చారంటే ఇక్కడే ఇప్పుడే ఇచ్చారని చెప్పారు. మరి మీకు ఇక్కడకు వచ్చి ఓటేయాలని ఎవరు చెప్పారంటే.. ఫోన్ వచ్చిందన్నది వారి సమాధానం. ఇంతకీ తాను ఓటు వేస్తున్నది ఏ ఎన్నికకు అన్న సంగతి కూడా ఆమెకు తెలియదు. వచ్చి ఓటేయమన్నారట.. అంతే వచ్చి ఓటేశారు. ఇంత బహిరంగంగా వారి విద్యార్హతలపై వాస్తవం నిగ్గు తేలినా.. వారు ఓట్లు వేయకుండా అధికారులు నిలువరించలేదు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ మాత్రమే చదివిన వారిని కూడా ఓటర్లుగా ఓట్లు వేయించిన ఘనత జగన్ సర్కార్ ది. ఇందు కోసం ఆయన ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ఎంత గొప్పగా ఉపయోగించుకుందో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక అద్దంపట్టింది. ఎమ్మెల్సీ ఎన్నికలలోనే ఇంతకు తెగించిన వైసీపీ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఇంకెన్ని జగన్నాటకాలకు తెరతీస్తారో అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఎంత నిర్భయంగా, ఎంత నిస్సిగ్గుగా వైసీపీ నేతలు వ్యవహరించారంటే.. దొంగ ఓట్లు, దొంగ ఓటర్లను మీడియా లైవ్ లో చూపించినా వెనక్కుతగ్గలేదు. పోలీసుల సంపూర్ణ సహకారంతో దొంగ ఓట్లను యథేచ్ఛగా వేయించుకున్నారు. దొంగ ఓటర్లను గుర్తు పట్టే టీడీపీ నేతలు… పోలింగ్ ఏజెంట్లను పోలీసులు పోలీసు స్టేషన్లకు తరలించేశారు. ఈ సందర్భంగా తిరుపతి, పులివెందుల సహా పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఆటోడ్రైవర్లు, ఆరేడు తరగతులు చదువుకున్న వారు, ఇంటర్మీయట్ కురాళ్లు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలీసుల అండతో, వైసీపీ దన్నుతో ఓట్లు వేశారు. ఇక పోలింగ్ బూత్ ల వద్దే కౌంటర్లు పెట్టేసి మరీ సొమ్ములు పంచారు.
గెలవడం కావాలి, ఎలా గెలుస్తేం ఏం.. మమ్మల్ని అడ్డుకునే దమ్మెవరికి ఉందన్న ధీమా తప్ప వైసీపీలో కనిపించింది. ఈ మాత్రం అరాచకం లేకపోతే మనకు ఓటేసేదెవరు అన్న భావన కూడా వ్యక్తమైంది. దొంగ ఓట్లతో గెలిచేయగలమన్న ధైర్యం కనిపించింది. ఇదే పద్ధతిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా దున్నేస్తామన్న ధీమా వ్యక్తమైంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలు ఎలా జరుగుతాయో.. రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఒక ట్రయలర్, ఒక టీజర్ చూపించారు ముఖ్యమంత్రి జగన్