కరోనా కాషన్.. జాగ్రత్తలు తప్పని సరి
posted on Apr 4, 2023 @ 1:36PM
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. 2019 నాటి పరిస్థితి మళ్లీ పునరావృతమౌతుందా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. ఇటీవలి కాలంలో రోజు వారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. అదే సమయంలో మరణాలూ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో తొలి నుంచీ దేశంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయి? పాజిటివిటీ రేటు ఎలా ఉంది? రికవరీ రేటు అంటూ ప్రకటనలు గుప్పించడంతో సరిపెట్టకుండా కోవిడ్ ప్రొటోకాల్ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి విజృంభణపై అప్రమత్తమైన కేంద్రం కేవలం సూచనలు, హెచ్చరికలకే పరిమితమౌతోంది. ఇదే వ్యాప్తి తీవ్రత కొనసాగితే.. దేశంలో మళ్లీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పవేమోనన్న ఆందోళనను వైద్య నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశంలో అత్యధికులకు వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది కనుక అలాంటి పరిస్థితి తలెత్తే అవకాశాలు లేవన్న వాదనా వినిపిస్తోంది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి మరో సారి విజృంభిస్తోందన్న మాట అయితే వాస్తవమని అందరూ అంగీకరిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే కరోనా డేంజర్ బెల్స్ మెగాయి. అప్పట్లోనే అధికార వర్గాలు, వైద్య నిపుణులు కోవిడ్ జాగ్రత్తలు కొనసాగించడం తప్పని సరి అని హెచ్చరికలు జారీ చేశాయి.
కేసుల పెరుగుదలను ఎదుర్కోవడానికి దేశం యొక్క సంసిద్ధతను అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమావేశాలు నిర్వహించారు. ఇక తాజాగా కోవిడ్ కేసుల విజృంభణ దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందుగా అప్రమత్తమైంది. థియోటర్లలో మాస్కులను తప్పని సరి చేసింది.
మిగిలిన రాష్ట్రాలు కూడా అప్రమత్తమై కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా థియోటర్లు, కార్యాలయాలలో ఏసీల కింద కూర్చుని పని చేసే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. అలాగే భౌతిక దూరం పాటించడం, శుభ్రతకు పెద్ద పీట వేయడం వంటి చర్యలు తీసుకోవాలి.