టీపీసీసీ చీఫ్ రేవంత్ రాజీనామా?
posted on Apr 5, 2023 @ 12:18PM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొందరు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ తో పొత్తుకు తహతహ లాడుతున్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. కొద్ది రోజుల క్రితం కోమటి రెడ్డి వెంకట రెడ్డి, తరువాత తాజాగా సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి కూడా బీజేపీని ఓడించడం కోసం అనే ట్యాగ్ లైన్ యాడ్ చేసి మరీ అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవచ్చని స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. సరే ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అధికారికంగా చేతులు కలిపినా కలపక పోయినా కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ అనుకూల వర్గం ఉందనేది కాదన లేని నిజం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలో మూడింట రెండు వంతుల (12) మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేవలం ఒకొంతు మంది (6గురు) మాత్రమే కాంగ్రెస్ లో మిగిలారు. సో .. కాంగ్రెస్ బీఆర్ఎస్ రక్త సంబంధం గురించి కొత్తగా మళ్లీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు.
అదలా ఉంటే గత కొంత కాలంగా ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ వర్గాలలో ఉభయ పార్టీల పొత్తు గురించిన చర్చ జరుగుతూనే వుంది. ముఖ్యంగా పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించడం, ఆవెంటనే ఆయన లోక్ సభ సభ్యత్వం పై అనర్హత వేటు పడడం చకచకా జరిగిపోయిన నేపధ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బంధం మరింత బలపడిన సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇద్దరూ రాహుల్ గాంధీకి ఓపెన్ గా మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరాటం చేసేందుకు ఆమోదం తెలిపారు.
అయితే, బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తును గట్టిగా వ్యతిరేకిస్తున్న ఒకే ఒక్కడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఆయన మంగళవారం (ఏప్రిల్ 4) కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా ఆ విధమైన కుట్ర జరుగుతోందనే విషయం చెప్పకనే చెప్పారు. మీడియాతో చిట్ చాట్ చేసిన రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు అనేది జరిగితే అది తన రాజీనామా తర్వాతనేని కుండబద్దలు కొట్టేశారు. అలాగే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీలో పొత్తు దిశగా కదలికలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లు అయిందని పరిశీలకులు అంటున్నారు.
అయితే అదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉండదని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదన్నారు. తెలంగాణలో ధృతరాష్ట్ర కౌగిలికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.
అయితే రేవంత్ రెడ్డి ఎంత ధీమాగా ఉన్నా రాష్ట్రంలో దేశంలో జరుగతున్న పరిణామాలను గమనిస్తే, రోజులు గడిచే కొద్దీ, బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యత అనివార్యం అవుతున్నది. విపక్షాలు చేతులు కలపడం మినహా మరో మార్గం లేకుండా కేసులు, అరెస్టులతో విపక్షాలను ఒకటిగా కట్టి పడేస్తోంది. ఈనేపధ్యంలో మాజీ మిత్ర పక్షాల మధ్య మళ్ళీ పొత్తు పొడవదని చెప్పలేమని పరిశీలకులు అంటున్నారు. అయితే అదే జరిగితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి మళ్ళీ మాతృ సంస్థ (టీడీపీ) గూటికి చేరడమూ ఖాయమని అంటున్నారు.