జగన్ తానే మారెనా.. తీరే మారెనా?
posted on Apr 4, 2023 @ 12:13PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందా అంటే.. సోమవారం జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నియోజకవర్గ ఇన్ చార్జిలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగం విన్న వారంతా ఔననే సమాధానమిస్తున్నారు. వైనాట్ 175 నుంచి గ్రాఫ్ పెంచుకోకపోతే గెలుపు సులభ సాధ్యం కాదు అనే స్థాయికి ఆయన ధీమా దిగజారిపోయిందంటున్నారు.
దీంతో ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలు, నాయకులను బుజ్జగించడానికి త్వమేవ శరణం నాస్తి అన్నట్లుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ ఇంత కాలం ఎమ్మెల్యేలకు, మంత్రులకు హెచ్చరికలు మాత్రమే జారీ చేసిన జగన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు. ఇటీవలి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథ విజయానికి తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగే కారణమంటూ కనీసం వారి సంజాయిషీ కూడా కోరకుండా సస్పెన్షన్ వేటు వేసిన ఆయన ఇప్పుడు స్వయంగా తన నోటితోనే పార్టీలో దాదాపు 60 మంది వరకూ ఎమ్మెల్యేలలో అసంతృప్తి గూడుకట్టుకుని ఉందన్న విషయాన్ని వెల్లడించారు.
సరే ఇది విపక్ష తెలుగుదేశం ఆరోపణగా చెప్పారనుకోండి అది వేరే విషయం. అయినా అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉందని ఆయన అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుందని అందుకు ఆయన ఎవరినీ వదులు కోవడం తన అభిమతం కాదన అనడంతోనే తేటతెల్లమైందని పరిశీలకులు అంటున్నారు.
చాలాకాలం తర్వాత జగన్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో ఎలాంటి క్లాసులూ, హెచ్చరికలు, బెదరింపులూ లేకుండా.. బుజ్జగింపు మాటలు, బతిమలాడుకునేలా జగన్ ప్రసంగం ఉండటంతో జగన్ లో మార్పు ప్రస్ఫుటంగా కనిపించిందనీ, గతంలో పనిచేయకపోతే టికెట్లు ఇచ్చేది లేదని, మీకు అనేక అవకాశాలు ఇచ్చానని బెదిరింపు ధోరణితో మాట్లాడిన జగన్.. ఈసారి మాత్రం చాలా సాత్వికంగా, ప్రశాంతంగా ‘నేను మీ వాడిని’, ‘మిమ్మల్ని మళ్లీ గెలిపించడమే నా లక్ష్యం’ అంటూ మాట్లాడటంపై ఎమ్మెల్యేలలోనే ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బకు తమ అధినేత దిగి వచ్చాడన్న చర్చ మొదలైంది. ఇక ఎమ్మెల్యేలు ఏళ్ల తరబడి చేస్తున్న పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కూ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అన్నిటికీ మించి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఆయన సిట్టింగులందరికీ టికెట్లిస్తానని చెప్పారు.
ఈ సమావేశం అనంతరం పలువురు ఎమ్మెల్యేలు జగన్ దిగి వచ్చేశారనీ, గతంలోలా ఆయనలో వైనాట్ 175 ధీమా ఇసుమంతైనా కనిపించడం లేదనీ, బొటాబొటీగానైనా మెజారిటీ స్థానాలు సాధించి మళ్లీ అధికారంలోకి వస్తే అదే పదివేలు అన్న భావన వ్యక్తమైందని అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన నాలుగేళ్ల తరువాత ఆయనకు ఎమ్మెల్యేల విలువ ఏంటో తెలిసినట్లుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.