బీజేపీలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు!
posted on Apr 4, 2023 @ 8:15PM
బీజేపీలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్ లు ఉన్నారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలవి కూడా పేక్ సర్టిఫికెట్లే అన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు.
అవి రాజస్థాన్, తమిళనాడు యూనివర్సిటీల నుంచి సంపాదించినట్లు తెలుస్తోందన్నారు. ఎలక్షన్ అఫిడవిట్ లో తప్పుడు సర్టిఫికెట్ల వివరాలు తెలిపి, గెలవడం నేరమే కదా అన్నారు. దీని ఆధారంగా ఆ ఇద్దరు ఎంపీలను డిస్క్వాలిఫై ఎందుకు చేయరని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ పై.. అలాగే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడంపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ రెండింటినీ కూడా కోడ్ చేసే విధంగా మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. బీజేపీపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తెలంగాణకు చెందిన ఫేక్ విద్యార్హత సర్టిఫికెట్ల మంత్రులెవరన్న దానిపై సామాజిక మాధ్యమంలో కూడా పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.