బీఆర్ఎస్ తో పొత్తా.. నో నెవ్వర్.. రేవంత్
posted on Apr 4, 2023 @ 5:21PM
తెలంగాణ కాంగ్రెస్ లో ఒక పక్క ఆ పార్టీ సీనియర్లు బీఆర్ఎస్ తో పొత్తుకు తహతహలాడుతుంటే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రశక్తే లేదని నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. మాఫియాతో కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ పొత్తు పెట్టుకోదని కుండబద్దలు కొడుతున్నారు. అసలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ కాంగ్రెస్ సీనియర్లలో అసంతృప్తి జ్వలిస్తూనే ఉంది.
అయితే హైకమాండ్ సీనియర్ల అసంతృప్తిని పెద్దగా పట్టించుకోకుండా రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేసే బాధ్యతను రేవంత్ పై పెట్టింది. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పార్టీలో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చారు. రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన అనంతరం జరిగిన ఉప ఎన్నికలలో పార్టీ విజయాలు సాధించకపోయినా.. శ్రేణుల్లో మాత్రం కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందన్నది మాత్రం నిర్వివాదాంశం.
అయితే సీనియర్లు మాత్రం రేవంత్ గమనానికి అడుగడుగునా అడ్డుపడుతూ వస్తున్నారు. అయితే మాణిక్యం ఠాకూర్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన మాణిక్‌రావు ఠాక్రే సీనియర్ల అసంతృప్తికి చెక్ పెట్టడంలో చాలా వరకూ కృతకృత్యులయ్యారు. అసంతృప్తి జ్వాలలు పూర్తిగా చల్లారిపోయాయని చెప్ప లేకపోయినా.. పార్టీలో మాత్రం గణనీయమైన మార్పు కనిపించింది. విభేదాలు ఉన్నా సీనియర్లు, జూనియర్లు.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రేవంత్ వర్గం, రేవంత్ వ్యతిరేక వర్గం కూడా ఎవరి దారిన వారు పార్టీ కార్యక్రమాలలో నిమగ్నమైపోయారు. దీంతో పార్టీలో ఆల్ ఈజ్ వెల్ అన్న వాతావరణం కనిపిస్తోంది. కానీ అడపా దడపా సీనియర్లు మాత్రం ఏదో ఒక పుల్ల విరుపు మాట అయితే అంటూనే ఉన్నారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అనంతరం అయినా సరే రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు అనివార్యమని వ్యాఖ్యలు చేసిన రేపిన సంచలనం ఇలా సర్దుమణిగిందో లేదో.. మరో సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు అవసరం అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని అన్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ అనర్హత విషయంలో బీఆర్ఎస్ బహిరంగంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిందని సో ... శత్రువు, శత్రువు మిత్రుడు, థియరీ ప్రకారం కాంగ్రెస్ బీఆర్ఎస్ చేతులు కలపవచ్చని వివరణ కూడా ఇచ్చారు.
అటు బీఆర్ఎస్ కూడా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ దూకుడును అడ్డుకోవాలంటే.. కాంగ్రెస్ అండ కావాలి అన్నట్లుగానే వ్యవహరిస్తోంది. ఇటీవల పలు సందర్భాలలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఇటీవల ఢిల్లీ వేదికగా బీజేపీని ఓడించాలంటే బీజేపీయేతర పార్టీలతో కాంగ్రెస్ కలిసి రావాలని వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రాహుల్ అనర్హత వేటుకు వ్యతిరేకంగా సమష్టి పోరుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే జానా రెడ్డి పోత్తు ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే టీపీసీసీ అధ్యక్షుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదని చెబుతున్నారు. తాను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండగా బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని, మాఫీయాతో కాంగ్రెస్ ఎప్పటికీ చేతులు కలపదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పరాజయం తథ్యమని, బీజేపీ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కే పరిమితమౌతుందని రేవంత్ అన్నారు.