రాజ్ దీప్ పై పరవు నష్టం దావా వేస్తారా ?
posted on Apr 5, 2023 @ 9:40AM
ఎవరో అంటే ఏమో అనుకోవచ్చును కానీ, ఆ మాటన్నది ఎవరో దారిన పోయే దానయ్య,కాదు.. ఇండియా టుడే అంతటి ప్రతిష్టాత్మక టీవీ చానల్ కన్సల్టెంట్ ఎడిటర్ ... రాజ్‌దీప్ సర్దేశాయ్. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావు ఆర్థిక స్థోమత గురించి ఆయన సంచలన విషయం బయట పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దెదించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటై, ప్రతిపక్ష ఐక్య కూటమి నాయకత్వ పగ్గాలు తన చేతికి అప్పగిస్తే మరో పార్టీ, మరో అభ్యర్ధి జేబులో చెయ్యి పెట్టవలసిన అవసరం లేకుండా మొత్తం 545 లోక్ సభ నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార వ్యయం మొత్తం తానే ( బీఆర్ఎస్) భరిస్తానని ప్రైవేటు సంభాషణల్లో చెప్పినట్లు రాజ్ దీప్ పబ్లిక్ గా ప్రకటించారు.
రాజ్‌దీప్ తన వీక్లీ బ్లాగ్‌లో మోడీ వర్సెస్ ఆల్ అనే అంశం గురించి మాట్లాడారు. అందులో ఇటీవల రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై మాట్లాడిన రాజ్‌దీప్, 2024 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీకి అన్ని ప్రతిపక్ష పార్టీలకు మధ్య జరుగుతాయా? అనేది చూడాల్సి ఉందన్నారు. ఈ ప్రశ్నకు తన పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఫ్యాక్టర్స్ సమాధానం చెబుతాయని పేర్కొన్నారు.
అదే క్రమంలో ఆయన ప్రాంతీయ పార్టీల నాయకుల ఈగోల గురించి కూడా ప్రస్తావించారు. ప్రతి నేతా కూడా తనను తాము జాతీయ నేతగానే భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ను తీసుకుంటే.. ఆయన తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కోసం ప్రచారం మొదలుపెట్టారు. ప్రైవేట్ కాన్వర్సేషన్ లోకేసీఆర్.. తన సహచరులతో ప్రతిపక్షాల కూటమికి తనను చైర్ పర్సన్‌ను చేస్తే 2024 ఎన్నికల ఖర్చు మొత్తం భరించడానికి సిద్దంగా ఉన్నానని చెప్పాడు. అయితే ఇందుకు ప్రతిపక్షాలలో కేసీఆర్‌కు సమకాలీకులుగా ఉన్న నాయకులు అంగీకరిస్తారా? అని రాజ్‌దీప్ అనుమానం వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రతిపక్షాల కూటమి ఉంటుందా? అనే దానికి సంబంధించి వివిధ అంశాలను ఆ వీడియోలో రాజ్‌దీప్ ప్రస్తావించారు.
అయితే కేసీఆర్ ఇంత ఓపెన్ ఆఫర్ ఇచ్చినా, ప్రతిపక్ష పార్టీలు, నాయకులు అంగీకరిస్తారా లేదా చూడవలసి ఉందని రాజ్‌దీప్ పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు ఇతర ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ ఆఫర్ అంగీకరిస్తాయా? ఆయన్ని కూటమి నేతగా, ప్రధాని అభ్యర్ధిగా అంగీకరిస్తాయా ? అనేది కాదు ప్రశ్న. ఆయనకు ఇంత పెద్ద మొత్తం సొమ్ములు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నదే ప్రశ్న. ఈ ప్రశ్నకు సంధానం చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి సహా పలువురు డిమాడ్ చేస్తున్నారు. అదలా ఉంటే రాజ్‌దీప్ చెప్పినదాట్లో నిజం లేకుంటే, ఆయన వివరణ కోరాలి లేదా ఆయన పై పరువు నష్టం దావావేయాలని అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చి.. జాతీయ రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో కొన్ని విపక్ష పార్టీలతో ఐక్యతను మెయింటెన్ చేస్తున్నారు. అయితే జాతీయ స్థాయిలో బీజేపీని ఢీకొట్టేందుకు కేసీఆర్ వ్యుహాలు పక్కాగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్గాలు చెబుతుంటాయి. అయితే తాజగా కేసీఆర్‌కు సంబంధించి సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్‌దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.