తెలుగు వన్ చెప్పిందే జరిగింది!
posted on Apr 4, 2023 @ 2:28PM
తెలుగు వన్ ఏమి చెప్పిందో అదే జరిగింది. సోమవారం(ఏప్రిల్ 3) నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సమావేశంలో, ‘తెలుగు వన్’ ముందుగా చెప్పిన విధంగానే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్వరం మారిపోయింది. గర్జింపులు లేవు, గాండ్రింపులు లేవు. హెచ్చరికలు లేవు. ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు ,ఎన్ని గంటల ఎన్ని నిముషాలు ... ఎన్నెన్ని గడపలు తొక్కారు, ఏ గడపలో ఎంత సేపు కూర్చున్నారు.. అంటూ గంటల పంచాంగం విప్పలేదు. బెత్తం పట్టుకుని, బెంచీ ఎక్కించలేదు. పద్దతి మార్చుకుని చెప్పినట్టు చేస్తారా? మిమ్మల్నే మార్చ మంటారా అంటూ కళ్ళెర్ర చేసింది లేదు. అవును గతంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షకు, సోమవారం(ఏప్రిల్ 3) నిర్వహించిన సమీక్షకు ఎక్కడా పొంతన లేదు పోలిక లేదు.
అంతేకాదు, ఢిల్లీ పెద్దల ఆదేశం మేరకే, ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకే, ముఖ్యమత్రి గడప గడపకు మన ప్రభుత్వం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారని, తెలుగు వన్ ముందుగా చెప్పినట్లే ముఖ్యమంత్రి నిన్నటి సమావేశంలో ఎవ్వరినీ నొప్పించలేదు. ఒక విధంగా గతంలో తన ప్రవర్తన ఎవరినైనా నొప్పించే ఉంటే, క్షమించండి అన్న ధోరణిలో మాట్లాడారు. నేను ఎమ్మెల్యేలను వదులుకోను, కార్యకర్తలను పోగొట్టుకోవాలని అనుకోను.. రాజకీయాలంటే మనవ సంబంధాలని ‘నాన్న’ నుంచి నేర్చుకున్నాను అంటూ కొత్త స్వరాన్ని వినిపించారు. అందుకే , ఎమ్మెల్యేలు హా..శ్చర్య పోయారు . అవాక్కాయారు. నిజమా... ఇంత సౌమ్యంగా , నేను ఇంతగా ఎందుకు కష్టపడుతున్నాను. మిమ్మల్ని పిలిపించి ఎందుకు చెపుతున్నాంటే, కారణం, మీతో పనిచేయించి మిమ్మల్ని మళ్లీ గెలిపించాలానే కదా అంటూ చాలా ప్రేమగా, ‘పాథెటిక్’ టోన్’లో వివరణ ఇవ్వడం ఎమ్మెల్యేలకు ఎంత వినసొంపుగా ఉందో, అంతే కంగు తినిపించాయి. అందుకే, ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు.
అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రిలో ఒక్కసారిగా ఈ మార్పు ఏమిటి? ఎందు కొచ్చింది? అనే చర్చ వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజానికి సోమవారం (ఏప్రిల్ 24) సమీక్షా సమావేశంలోనూ షరా మాములుగా ముఖ్యమంత్రి గణాంకాలు చదివి వినిపించి అందరి ముందు పరవు తీస్తారనే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, సమావేశానికి డుమ్మా కొట్టారు.
గత సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చదివి వినిపించిన, మొద్దబ్బాయిల జాబితాలో ఉన్న ఇద్దరు మంత్రులతో సహా, ఓ పది నుంచి పదిహేను మంది వరకు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. కానీ, అవేవీ లేక పోగా, రాజకీయాలంటే మానవ సంబంధాలంటూ ముఖ్యమంత్రి పేర్కొనడం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే ఈ మార్పుకు కారణం, ఏమిటో తెలుగు వన్ ‘అసంతృప్తిని చల్లార్చడమే జగన్ అసలు ఎజెండా’ కథనంలో ముందుగానే చెప్పింది. అదే జరిగింది.
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించిన నేపథ్యంలో, అయన సుచన మేరకే జగన్ రెడ్డి బుజ్జగింపు ధోరణికి వచ్చారు.
అసంతృప్తిని చల్లార్చడమే జగన్ అసలు ఎజెండా?!