తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకేజీల జాతర? రెండో రోజూ టెన్త్ ప్రశ్న పత్రం లీక్
posted on Apr 4, 2023 @ 12:33PM
తెలంగాణలో ప్రస్తుతం ప్రశ్నపత్రాల లీకేజీల జాతర నడుస్తోంది. పరీక్ష ఏదైనా. పేపర్ ఏదైనా, పోటీ పరీక్షలైనా, పబ్లిక్ ఎగ్జామ్స్ అయినా ప్రశ్నపత్రం లీక్ అయి తీరాల్సిందే అన్నట్లుగా పరిస్థితి విరాజిల్లుతోంది. ఇటీవల టీఎస్పీఎస్పీ ప్రశ్న పత్రాల లీకేజీ సృష్టించిన సంచలనం ఇంకా కొనసాగుతుండగానే.. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన తొలి రోజు నుంచీ ఆ ప్రశ్న పత్రాల లీకేజీ మొదలైంది. తొలి రోజు సోమవారం టెన్త్ ప్రశ్నపత్రం లీకైంది.
వాట్సాప్ గ్రూపులో ప్రత్యక్షమైంది. ఇందుకు బాధ్యులుగా కొందరిపై చర్య తీసుకోవడమూ జరిగింది. పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం లేదు.. యథాతథంగా జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అంతలోనే మరో సంచలనం నమోదైంది. ఈ సారి ఏకంగా ప్రశ్న పత్రాలు లీక్ కావడం కాదు, విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు మాయమయ్యాయి. ఎలాగంటే ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థుల ప్రశ్నపత్రాలు మాయమయ్యాయి.
పరీక్షా కేంద్రం నుంచి ఓ ఆటోలో ఆన్సర్ పేపర్ల బండిల్స్ తరలిస్తుండగా.. పోస్టాఫీస్‌కు చేరుకునేలోపు అందులోంచి ఒక బండిల్ మిస్ అయింది. ఆ బండిల్‌లో దాదాపు 30 మంది విద్యార్థుల జవాబు పత్రాలు ఉన్నట్లు సమాచారం. దీనిపై ఊట్నూరు మండల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇక మంగళవారం కూడా టెన్త్ పరీక్ష పత్రం లీకైంది. తొలి రోజు తెలుగు ప్రశ్న పత్రం లీకైతే.. రెండో రోజు హిందీ ప్రశ్నపత్రం లీకైంది. పరీక్ష ప్రారంభమై అరగంట గడిచిందో లేదో ప్రశ్నపత్రం వాట్సప్ లో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది.
దీంతో తెలంగాణ ప్రభుత్వానికి అసలు పరీక్షలు నిర్వహించే సత్తా ఉందా అని విపక్షాల ప్రశ్నిస్తున్నాయి టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ విపక్షాలు పరీక్ష పత్రాల లీకేజీ సాధారణమే అన్నట్లుగా ఆయన మాట్లాడారని విమర్శిస్తున్నాయి. ఆయన మాటలకు తగ్గట్టుగానే తెలంగాణలో ప్రశ్న పత్రాల లీకేజీ జాతర జరుగుతోందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని విమర్శిస్తున్నారు.