హైదరాబాద్ లోకసభ నుంచి  అసదుద్దీన్  ఐదోసారి  గెలుపు 

హైదరాబాద్ లోకసభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదోసారి మజ్లిస్ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు. మూడు లక్షల 15 వేల పైచిలుకు మెజారిటీతో సమీప ప్రత్యర్థి బిజెపి నుంచి పోటీ చేస్తున్న  మాధవిలతపై గెలుపొందారు. గోషామహల్ నియోజకవర్గంలో మాధవిలత ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఓవైసీని ఓడించే మెజార్టీ తెచ్చుకోలేకపోయారు.    అసదుద్దీన్ ఒవైసీ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన రాజకీయ నాయుడు. 1969 మే 13న అసదుద్దీన్ జన్మించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. నిజాం కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, లండన్‌లోని లింకన్స్ ఇన్ కాలేజీలో బారిస్టర్ చదువుకున్నారు. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా గత నాలుగుసార్లు అసదుద్దీన్ ఒవైసీ గెలుపొందుతూ వచ్చారు.  ప్రస్తుతం ఆయన ఎంఐఎం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోసారి అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల బరిలో గెలిచి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. . హైదరాబాద్ ఎంపీ కాకముందు అసదుద్దీన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చార్మినార్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా  ఉన్నారు.  1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ ఛార్మినార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004 నుంచి హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి అసదుద్దీన్ ప్రాతినిథ్యంవహిస్తున్నారు. 2004, 2009,2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసద్ విజయం సాధించారు. తాజాగా మజ్లిస్ గెలుపు మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోగస్ వోట్లు,రిగ్గింగ్ వల్లే మజ్లిస్ గెలిచిందన్న అభిప్రాయం వ్యక్తమౌతుంది. 

సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి షాక్.. భారీగా తగ్గిన సీట్లు!

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో కమలం పార్టీ మాత్రం వెనుకబడింది. భారీగా నష్టపోయింది.  ఎన్డీయే 297 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అదే సమయంలో విపక్ష  ఇండియా కూటమిబలంగా పుంజుకుని 226 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.   ఇతరులు 19 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.   రాష్ట్రాల వారీగా చూసుకుంటే తమిళనాడులో 36 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు సత్తా చాటుతుండగా, ఎన్డీయే కూటమి 2 స్థానాల్లోనే ముందంజలో ఉంది. అన్నాడీఎంకే మరీ దారుణంగా ఒకే ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో ఉంది. ఇక ఉత్తర ప్రదేశ్ లో అయితే బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.  ఇక్కడ మొత్తం 80 స్థానాలకు గాను 41 చోట్ల కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తుంటే.. బీజేపీ నేతృత్వంలోని 38 చోట్ల ఎన్డీయే, ఒక స్థానంలో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలోనూ ఇండియా కూటమి సత్తా చాటుతోంది.  ఈ రాష్ట్రంలో  మొత్తం 48 స్థానాలు ఉండగా, ఇండియా కూటమి 29, ఎన్డీయే 18, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.   పశ్చిమ బెంగాల్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి అనుకూలంగా చెప్పాయి. అయితే  వాస్తవ ఫలితాలు మాత్రం పూర్తి రివర్స్ లో ఉన్నాయి.  బెంగాల్ లో అధికారఅధికార టీఎంసీ దూసుకెళ్తోంది. రాష్ట్రంలో మొత్తం 42 స్థానాలు ఉండగా టీఎంసీ 28, బీజేపీ 12, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. బీహార్‌లో మాత్రం ఎన్డీయే కూటమి సత్తా చాటుతోంది. అక్కడ మొత్తం 40 స్థానాలకు గాను ఎన్డీయే 31, ఇండియా కూటమి 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కర్ణాటకలోనూ ఎన్డీయే హవా కొనసాగుతోంది. మొత్తం 28 స్థానాల్లో ఎన్డీయే 21, ఇండియా కూటమి 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. గుజరాత్‌లోనూ ఎన్డీయే జోరు కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 26 స్థానాలు ఉన్నాయి. 25 స్థానాల్లో ఎన్డీయే, ఇండియా కూటమి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 21, వైసీపీ 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. రాజస్థాన్‌లో ఇండియా, ఎన్డీయే కూటమి అభ్యర్థులు పోటీపోటీ ప్రదర్శన ఇస్తున్నారు. 25 స్థానాలకు గాను ఎన్డీయే 13, ఇండియా 11, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. ఒడిశాలోనూ ఈసారి ఎన్డీయే అనూహ్య ఫలితాలు సాధిస్తోంది. మొత్తం 21 స్థానాలకు గాను ఎన్డీయే 18, అధికార బీజేడీ 2, ఇండియా కూటమి ఒక స్థానంలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి. కేరళలో యూడీఎఫ్ తిరుగులేని ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 20 స్థానాలు ఉండగా యూడీఎఫ్ 16, ఎన్డీయే 2, ఎల్డీఎఫ్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. తెలంగాణలోనూ ఈసారి బీజేపీ గణనీయమైన సీట్లు సాధిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లోనూ, ఎంఐఎం ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉంది. అలాగే, ఝార్ఖండ్, అస్సాం, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, అండమాన్ అండ్ నికోబార్ రాష్ట్రాలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, మిగతా రాష్ట్రాలో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.

ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం క్లీన్ స్వీప్

ఉమ్మడి విజయనగరం జిల్లాను తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసింది. ఈ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటు స్థానాన్ని కూడా తెలుగుదేశం కూటమి దక్కించుకుంది. జిల్లాలోని శృగవరపు కోట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి కోళ్ల లలిత కుమారి విజయం సాధించారు. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి లోకం నాగ మాధవి విజయం సాధించగా, విజయనగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పూసపాటి అదితి గజపతి రాజు విజయం సాధించారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకటరావు విజయం సాధించారు. ఇక్కడ ఆయన మంత్రి బొత్స సత్యానారాయణపై గెలుపొందారు.  అదే విధంగా  గజపతినగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస విజయం సాధించారు. అలాగే బొబ్బిలి నుంచి తెలుగుదేశం అభ్యర్థి బేబినాయన విజయం సాధించగా, పార్వతీపురం నుంచి తెలుగుదేశం అఢ్యర్థి బోనెల విజయ్ చంద్ర, సాలూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి విజయం సాధించారు.  కురుపాం నుంచి తెలుగుదేశం అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయం సాధించారు. జిల్లాలో గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాంలో విజయం సాధించిన అభ్యర్థులంతా తొలి సారి పోటీ చేసిన వారే కావడం గమనార్హం.  

తన గొయ్యి తానే తవ్వుకున్న గులాబీ పార్టీ!

తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లుగా ఉంది తెలంగాణ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి. కాంగ్రెస్ ని కట్టడి చేద్దామనుకొని, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించి, చివరికి తానే సున్నాకి పడిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్.. రాష్ట్రంలో తమకి ఎదురే లేదు, ముచ్చటగా మూడోసారి కూడా తమదే అధికారమని ధీమా వ్యక్తం చేసింది. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ కి ఊహించని షాక్ తగిలినట్లైంది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తాము గెలవడం కంటే కూడా.. కాంగ్రెస్ ని కట్టడి చేయాలన్న దానిపైనే బీఆర్ఎస్ ఎక్కువ దృష్టి పెట్టింది. ఓ రకంగా అదే బీఆర్ఎస్ కొంపముంచింది. లోక్ సభ ఎన్నికలు అంటే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ దూకుడుకి బ్రేక్ వేయడానికి బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల వీక్ కాండిడేట్స్ ని నిలబెట్టడమే కాకుండా, చాలా చోట్ల క్రాస్ వోటింగ్ చేసిందని పలువురి వాదన. ఫలితాల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతోంది. మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను కాంగ్రెస్, బీజేపీ చెరో 8 సీట్లలో సత్తా చాటగా, ఎంఐఎం తన ఒక్క స్థానాన్ని నిలుపుకుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఖాతా కూడా తెరవలేదు. ఖాతా తెరవడం సంగతి అటుంచితే.. కేవలం రెండు సీట్లలోనే రెండో స్థానం నిలిచి, మిగతా స్థానాల్లో మూడు నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఓ రకంగా, కాంగ్రెస్ ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ చేసిన తప్పిదమే.. ఈ స్థాయి ఘోర ఓటమికి కారణమైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలే లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమని.. కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశముందని కొంతకాలంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీల సంఖ్య సున్నాకి పడిపోవడం, మెజారిటీ స్థానాల్లో కనీస పోటీ ఇవ్వలేకపోవడం బీజేపీకి వరం కానుందని చెప్పవచ్చు. ఎందుకంటే, బీజేపీ ఎప్పటినుంచో తెలంగాణలో పాగా వేయాలని చూస్తుంది. ఇప్పుడు 8 సీట్లలో సత్తా చాటడంతో తెలంగాణపై బీజేపీ ఇక నుంచి ఫుల్ ఫోకస్ పెడుతుంది అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ కి పోటీగా.. బీఆర్ఎస్ నాయకులను తన వైపుకి తిప్పుకొని గులాబీ పార్టీని ఖాళీ చేసే ప్రమాదముంది. అదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి.. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశముంది. గతంలో బీజేపీకి తెలంగాణలో డోర్లు ఓపెన్ చేసి, కాంగ్రెస్ ని లేకుండా చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించారు. కానీ ఇప్పుడు అదే బీజేపీ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రమాదంలో పడింది.

చంద్రబాబు నివాసంలో ఆనందోత్సాహాలు!

ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆనందోత్సాహాలతో వేడుకలు జరుగుతున్నాయి. ఐదేళ్ళపాటు అవమానాలు, వేధింపులు, జైలు జీవితం అనుభవించిన చంద్రబాబు నాయుడికి ఈరోజు నిజంగానే ఒక అద్భుతమైన రోజు. ఆయనకు మాత్రమే కాదు.. చంద్రబాబుని గెలిపించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది అద్భుతమైన రోజు. ఈ అద్భుతమైన సందర్భాన్ని చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో వేడుకగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జూనియర్ చంద్రబాబుగా అందరూ పిలుచుకునే నారా దేవన్ష్ కేక్ కట్ చేసి తాత చంద్రబాబు నాయుడికి తినిపించారు. నారా దేవాన్ష్ చాలా చిన్నపిల్లాడు.. తన తాతయ్యకి, నాయనమ్మకి, నాన్నకి, అమ్మకి, తన కుటుంబం మొత్తానికీ జగన్ గ్యాంగ్ వల్ల జరిగిన అవమానాల గురించి తెలిసి వుండకపోవచ్చు. అతనికి తెలిసింది ఒక్కటే.. చాలాకాలం తర్వాత తన కుటుంబం మొత్తం సంతోషంగా వుంది. చాలాకాలం తర్వాత తన తాత ముఖంలో అపారమైన ఆనందం కనిపిస్తోంది. అది చాలు.... ఆ చిన్ని మనసు కుటుంబ వేడుకలో ఆనందంగా గడపడానికి. ఒక్క చంద్రబాబు కుటుంబంలో మాత్రమే కాదు.. రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలలో జగన్ పరిపాలన కారణంగా ఆనందం మాయమైంది. ఇప్పుడు చంద్రబాబు కుటుంబం ఎంత సంతోషంగా వుందో, రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు అంతే సంతోషంగా వుండి వుంటాయి. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు వచ్చాయి.

మాచర్లలో  టిడిపి అభ్యర్థి జూలకంటి ఘన విజయం 

ఎపిలో సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి  పోలింగ్ బూత్ లోకి  దూసుకెళ్లి దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుస విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గంలో గత  20 ఏళ్లుగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పిన్నెల్లిపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఘనవిజయం సాధించారు.  మాచర్ల అసెంబ్లీ స్థానంలో 21 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి జూలకంటి బ్రహ్మారెడ్డి 31,761 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. 21 రౌండ్ల  అనంతరం జూలకంటికి 1,18,290 ఓట్లు రాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 86,529 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మరొక్క రౌండ్ ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో, జూలకంటి విజయం ఖరారైంది.

మంగళగిరిలో నారా లోకేష్ స్ఫూర్తి దాయక ప్రస్థానం

ఆంధ్రప్రదేశ్ లో  ఓట్ల కౌంటింగ్ ఆరంభమైన క్షణ నుంచీ తెలుగుదేశం కూటమి విజయం దిశగా ప్రభంజనంలా దూసుకుపోతోంది. విపక్ష హోదా కూడా ప్రస్తుత అధికార పార్టీ వైసీపీకి దక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దాదాపు నలభై సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించినా, అన్నిటిలోనూ కచ్చితంగా ఫలతాన్ని అంచనా వేసిన కేకే సంస్థ పేర్కొన్నట్లు వైసీపీ కంటే తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేనకే అధిక స్థానాలు దక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ప్రధానంగా ఎక్కువ ఆసక్తి కలిగించిన నియోజకవర్గాలలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం ఒకటి.  2019 ఎన్నికలలో తొలి సారిగా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగిన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలో ఆయన పరాజయం పాలయ్యారు. అసలు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే సాహసం. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ఆవిర్భవించిన తరువాత తెలుగుదేశం అక్కడ రెండంటే రెండు సార్లు విజయం సాధించింది. 1985 తరువాత తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలిచినదే లేదు. అలాంటి  చోట ఒక సారి పరాజయం పాలైన తరువాత మళ్లీ అక్కడ నుంచే పోటీ చేయాలని లోకేష్ నిర్ణయించుకోవడం ద్వారానే నాయకుడిగా ఆయన ఒక మెట్టు ఎక్కేశారు. అంతే కాకుండా 2019 ఎన్నికలలో ఓటమి తరువాత ఆయన నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు.  అన్నివర్గాల ప్రజలతో మమేకమై అందరివాడుగా మారారు.    గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకూ ప్రతి ఒక్క నాయకుడిని వ్యక్తిగతంగా కలిసి దగ్గరయ్యారు. నియోజకవర్గ ప్రజలకు ఆత్మీయుడయ్యారు. తటస్థులనే వారే లేకుండా అన్ని వర్గాలనూ తెలుగుదేశం పార్టీకి చేరువ చేశారు. అందుకే ఆయన అత్యంత కీలకమైన ఎన్నికల సంవత్సరంలో నియోజకవర్గాన్ని వదిలిపెట్టి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు దాదాపు ఏడాది కాలం వెళ్లినా జనం మాత్రం ఆయనను తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఫలితమే ఇప్పడు లక్ష ఓట్ల పై చిలుకు ఓట్ల మెజారిటీతో  లోకేష్ మంగళగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 

ఎంత పని చేశావమ్మా షర్మిల!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన అన్నయ్య వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా బలంగా గళం వినిపించారు. అంతేకాదు తనకు వరుసకు సోదరుడు అయ్యే వైఎస్ అవినాష్ కి పోటీగా కడప నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తన బాబాయ్ వైఎస్ వివేకా ఆత్మకి శాంతి కలగాలంటే తనని గెలిపించాలని అభ్యర్థించారు. ఒకానొక సమయంలో కడప ఎంపీగా షర్మిల గెలిచే అవకాశముందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ ఆమె తన ప్రభావాన్ని అంతగా చూపలేకపోయారు. ఇక ఇప్పుడు ఫలితాల్లో పూర్తిగా వెనకబడిపోయి.. మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. ఇవాళ వెలువడుతున్న ఏపీ ఎన్నికల ఫలితాల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను కనీసం 10 కూడా గెలిచే పరిస్థితి లేదు. కంచుకోటగా భావించే రాయలసీమలోనూ వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఇలాంటి సమయంలో కడప ఎంపీగా షర్మిల గెలిస్తే ఆమె దశ తిరిగేదే. ఎందుకంటే ప్రస్తుత వైసీపీ కేడర్ అంతా ఒకప్పటి కాంగ్రెస్ కేడరే. రాష్ట్ర విభజన తరువాత ఏపీ లో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థం కావడంతో.. మెజారిటీ కేడర్ ఆ పార్టీని వీడి.. వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలడంతో.. ఒకవేళ షర్మిల ఎంపీగా గెలినట్లయితే, ఆమె నాయకత్వం మీద నమ్మకంతో మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశముండేది. కానీ ఎంపీగా కనీస పోటీ ఇవ్వలేక.. షర్మిల మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. మొత్తానికి రాష్ట్ర విభజన దెబ్బకి ఏపీలో 2014 లో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతే.. కాంగ్రెస్ పునాదుల మీద ఏర్పడిన వైసీపీ సరిగ్గా పదేళ్లకు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది.

‘తెలుగువన్’ కార్యాలయంలో తెలుగుదేశం కూటమి విజయోత్సవం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి జగన్ పార్టీ చీకటి రోజులను పారద్రోలిన నేపథ్యంలో ‘తెలుగువన్’ కార్యాలయంలో విజయోత్సవం జరిగింది. సంస్థ కార్యాలయం ముందు భారీగా బాణాసంచాలను కాల్చారు. అనంతరం ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ సంస్థ కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు.  ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకుడు సువేరా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన అంతమైందని అన్నారు. జగన్ అక్రమాలను ప్రజలకు తెలియజేసినందుకు తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్‌ని టార్గెట్ చేసిన జగన్ ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించాడని, కంఠంనేని రవిశంకర్‌ని అరెస్టు చేసే ప్రయత్నం కూడా చేశాడని చెప్పారు. రవిశంకర్ అదృష్టవశాత్తూ జగన్ హింసల నుంచి తప్పించుకున్నారని అన్నారు. అమరావతి విషయంలో కంఠంనేని రవిశంకర్ ‘అమరావతి ఫైల్స్’ అనే సినిమా తీస్తే, దాని పేరు ‘రాజధాని ఫైల్స్’ అని మార్చేలా జగన్ కుట్ర చేశాడని, ఆ సినిమా విడుదల సమయంలో కూడా ఎన్నో కుట్రలు చేశాడని వివరించారు. అయినప్పటికీ ‘రాజధాని ఫైల్స్’ సినిమా తెలుగుదేశం పార్టీ విజయానికి అంతర్లీనంగా తనవంతు బాధ్యత నిర్వర్తించిందని సువేరా చెప్పారు. జగన్ పాలన అంతం కావడంతో ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు వచ్చాయని ఆయన అన్నారు. ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ, ‘జగన్‌ దుర్మార్గ పాలనను వ్యతిరేకించినందుకు జగన్ ‘తెలుగువన్’ కార్యాలయం మీద పోలీసుల చేత దాడులు చేయించాడని, తెలుగువన్ సర్వర్లు పోలీసులు తీసుకెళ్ళారని, అవి ఇంతవరకు తిరిగి ఇవ్వలేదని చెప్పారు. జగన్ తనను ఎన్నో ఇబ్బందులు పెట్టినా ‘రాజధాని ఫైల్స్’ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగానని చెప్పారు. చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్‌లో ఒక పెద్ద కార్యక్రమాన్ని యువతరం సహకారంతో నిర్వహించగలిగామని ఆయన చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసిన చంద్రబాబు, చంద్రబాబు అరెస్టు మీద వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, కేటీఆర్ ప్రభుత్వం మట్టిలో కలిసిపోయాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటకి హడావిడి చేయరు.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని మరోసారి నిరూపించారని చెప్పారు. తాను ‘రాజధాని ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించి, రామోజీరావు గారికి ఆ సినిమాని చూపించినప్పుడు ఆయన ‘ఇంత రిస్క్ ఎందుకు చేశారు’ అని అన్నారని, అప్పుడు తనకు ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్న సమయంలో, తన పక్కనే వున్న తన భార్య హిమబిందు (తెలుగువన్ డైరెక్టర్) ఎవరో ఒకరు ముందుకు రాకపోతే జగన్ దుర్మార్గాలను ప్రశ్నించేది ఎవరు అని అనడాన్ని ఈ సందర్భంగా కంఠంనేని రవిశంకర్ గుర్తు చేసుకున్నారు. జగన్ పాలనకు వ్యతిరేకంగా తెలుగువన్ చేసిన పోరాటానికి అండగా నిలిచిన తెలుగువన్ కుటుంబానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు వచ్చాయని ఆయన ఈ సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు.  

జాతీయ రాజకీయాలలో మళ్లీ చక్రం తిప్పనున్న చంద్రబాబు

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరో సారి జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్నారు.  గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అప్పట్లో  వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ సమర్ధవంతంగా పని చేయడానికీ, భాగస్వామ్య పక్షాలు సమన్వయంతో మెలగడానికీ చంద్రబాబు చేసిన కృష్టే కారణం. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ప్రధాని వాజ్ పేయి పలు సందర్భాలలో చెప్పారు. ఇక అప్పటి ఉప ముఖ్యమంత్రి అద్వానీ అయితే నమ్మదగ్గ మిత్రుడు చంద్రబాబు మాత్రమేనని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఆ తరువాత మళ్లీ ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం విభజిత ఆంధ్రప్రదేశ్ లో అధికారం లో ఉన్న సమయంలో మాత్రం వాజ్ పేయి హయాం నాటి సాన్నిహిత్యం బీజేపీ , తెలుగుదేశం మధ్య కానరాలేదు.  అప్పట్లో భాగస్వామ్య పక్షాల మద్దతు లేకపోకయినా  సొంతంగా ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైనన్ని స్థానాలున్నాయన్న ధీమా బీజేపీలో మెండుగా ఉండేది. దీంతో మిత్రధర్మం పాటించే విషయంలో మోడీ సర్కార్ పట్టనట్లుగా, లేక్కలేని తనంతో వ్యవహరించింది. దీంతో విభజన హామీల విషయంలో చంద్రబాబు పదేపదే డిమాండ్ చేయాల్సి వచ్చేది. అయినా కూడా మోడీ సర్కార్ పట్టించుకోకపోవడంతో అనివార్యంగా చంద్రబాబు ఎన్డీయే నుంచి వైదొలిగారు. ఆ తరువాత 2019 సార్వత్రిక ఎన్నికలలో కూడా బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని స్థానాలు సాధించడంతో ఎన్డీయే చిక్కిపోయింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ ఒక్కటొక్కటికీ వైదొలిగాయి.  ఇక 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ వచ్చేసరికి అనివార్యంగా బీజేపీకి నమ్మదగ్గ భాగస్వామ్య పక్షాల అవసరం ఏర్పడింది. దాంతో ఆ పార్టీ పాత మిత్రులకు స్వాగతం పలికింది. ఇటు ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నికలలో అక్రమాలకు చెక్ పడాలంటే బీజేపీ అండ కావాల్సిన పరిస్థితి ఉండింది. దీంతో మరో సారి తెలుగుదేశం ఎన్డీయేలో చేరింది. సరే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అలాగే లోక్ సభ స్థానాలలో కూడా సింహభాగం విజయం సాధించింది. సార్వత్రి ఎన్నికలలో బీజేపీకి గత వైభవం మిగలలేదు సరికదా సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలు దక్కించుకోలేకపోయింది. దీంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనివార్యంగా మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడక తప్పని పరిస్థితి ఎదురైంది. అన్నిటికీ మించి ఇప్పుడు ఎన్డీయే కూటమిలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. దీంతో సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగాలంటే బీజేపీ చంద్రబాబుపైనే పూర్తిగా ఆధారపడక తప్పని  పరిస్థితి ఉంది. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుకు ఎన్డీయే కన్వీనర్ పదవిని ఆఫర్ చేసింది. ఈ విషయమై నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు సమయం కోరారు. వాజ్ పేయి హయాంలో చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా చక్రం తిప్పారు.    ఆ సమయంలో  కేంద్రంలో ప్రభుత్వం సజావుగా సాగేలా చూశారు. ఆక్రమంలోనే కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఆ కారణంగా కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన ప్రతి పైసా రాష్ట్రానికి చేరాయి. ఇప్పుడు తాజాగా అదే పాత్ర మరోసారి పోషించాల్సిందిగా బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబును కోరుతోంది. అంటే ఏపీ అభివృద్ధికి అవసరమైన అన్నీ అడగకముందే చేస్తానని బీజేపీ చెప్పకనే చెబుతోంది.  ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మిత్రుల మద్దతు అనివార్యం. ఎన్డీయే కూటమిలో బీజేపీ తరువాత  పెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశం కీలకంగా వ్యవహరించనుంది. 

కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపు

కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్, బీజేపీ నుంచి వంశతిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న పోటీ చేశారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థిపై శ్రీగణేశ్ 9,725 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శ్రీగణేశ్ 2018, 2023లలో బీజేపీ నుంచి పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి టిక్కెట్ దక్కించుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బిఆర్ఎస్ అభ్యర్థి లాస్య గెలిచినప్పటికీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఉప ఎన్నిక అనివార్యం కావడంతో లాస్య సోదరికి బిఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. అనూహ్యంగా ఆమె ఓడిపోయింది. గత ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసిన శ్రీగణేష్ ఓడిపోవడంతో కాంగ్రెస్ లో జంప్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నెల ఓడిపోయింది. గద్దర్ కూతురు అయిన వెన్నెలకు ఈ ఉపఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. 

పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ విజయం

జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై  69 వేల 169 ఓట్ల ఆధిక్యతతో జయకేతనం ఎగురవేశారు. వైసీపీ అధినేత జగన్ పవన్ ను ఓడించడమే టార్గెట్ గా పిఠాపురంలో చతురంగ బలగాలను మోహరించిన విధంగా వైసీపీ మూకలను దించడమే కాకుండా పిఠాపురం బాధ్యతలను ప్రత్యేకంగా మిథున్ రెడ్డికి అప్పగించారు. అలాగే పవన్ వ్యక్తిగతంగా దూషించడం కోసం స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకుని మరీ పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఇవన్నీ చాలవన్నట్లు జగన్ తన చివరి ఎన్నికల ప్రచార సభను పిఠాపురంలోనే నిర్వహించి పవన్ ను వ్యక్తిగత అంశాలపై దూషించారు. అయితే జనం మాత్రం పవన్ వెంటే నిలిచారు. భారీ మెజారిటీతో పవన్ ను పిఠాపురంలో గెలిపించుకున్నారు. ఈ విజయం ద్వారా పవన్ కల్యాణ్ జగన్ కు గట్టి బదులిచ్చినట్లే చెప్పాలి. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషణలకు పాల్పడిన పవన్ కల్యాణ్ ఎక్కడా సంయమనం కోల్పోకుండా అంశాల ఆధారంగానే జగన్ పైనా, అధికార పార్టీపైనా విమర్శలు చేస్తూ వచ్చారు.  

జగన్ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో ముఖ్యమంత్రి జగన్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. మరి కొద్ది పేపటిలో  ఆయన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి తన రాజీనామా సమర్పించనున్నారు. వైనాట్ 175 అంటే ధీమా వ్యక్తం చేసిన జగన్  చివరకు వైసీపీ కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కనంత ఘోర పరాజయం ఎదురుకావడంతో ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. సరిగ్గా గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత కేసీఆర్ రాత్రికి రాత్రి తన ఫార్మ్ హౌస్ కు వెళ్లిపోయారు. ఓటమి అంగీకరించడం కానీ, విజయం సాధించిన కాంగ్రెస్ కు అభినందనలు తెలపడం కానీ చేయలేదు. అదే దారిలో ఇప్పుడు కూడా జగన్ తన రాజీనామా పత్రం సమర్పించి మిన్నకుండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.