జనం ఛీ కొట్టినా మారవా జగన్!
పాలన అంటే బటన్ నొక్కి సంక్షేమం పంచడమే.. అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి కల్పన ఏవీ అక్కర్లేదు అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాలన జరిగింది. విధ్వంసంతో ఆరంభమై విధ్వంసంతోనే ఐదేళ్లు కొనసాగిన జగన్ పాలనపై జనంలో పెల్లుబికిన ఆగ్రహ ప్రతిఫలమే ఈ ఫలితం అనడంలో సందేహం లేదు. అయితే తప్పులను ఒప్పుకోవడం, వాటిని సరిదిద్దుకుందామన్న జ్ణానం కానీ వైసీపీ నేతలలో, స్వయంగా జగన్ లో ఇసుమంతైనా కనిపించడం లేదు.
జగన్ పాలన అంతా వ్యతిరేకించిన వారిని ఎలిమినేట్ చేసుకుంటూ పోవడం, ప్రజలకు సంక్షేమం పేరిట కేవలం సంక్షేమ కార్యక్రమాలకు బటన్ నొక్కడమే అన్నట్లుగా కొనసాగింది. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు ప్రజలను పట్టించుకోవడం మానేసి.. ఐదేళ్ల తరువాత జరిగే ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వ సొమ్మును సంక్షేమం పేరిట పంచేస్తే చాలన్నట్లుగా వ్యవహరించారు. ఆ క్రమంలో జనానికి మోహం చాటేశారు. డబ్బులు సంగతి తరువాత ముందు అభివృద్ధి సంగతేంటో చెప్పు అని జనం నిలదీస్తారన్న భయం. అందుకే బటన్ నొక్కడానికి మాత్రమే బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ పరదాలు కట్టుకున్నారు.
సరే ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన తరువాత కూడా ఆయన తన విధానాలను జనం తిరస్కరించారని చెప్పడం లేదు. అమ్మ ఒడి , చేయూత, ఆసరా , జగనన్న విద్యా దీవెన, రైతు బంధు ఇలా పలు పథకాల పేర లక్షల రూపాయలు పంచాను, ఆ సొమ్ము తీసుకున్న వారు తనకు ఎందుకు ఓటు వేయలేదని ఆగ్రహిస్తున్నారు. ఆయన ఆగ్రహం సంగతి పక్కన పెడితే..
జగన్ తమకు సొమ్ములు పందేరం చేసి కట్టుబానిసలుగా బతకాలని ఆశిస్తున్నారని జనం గ్రహించారు. జగన్ తమకు సంక్షేమం పేర పందేరం చేస్తున్న సొమ్ములు ఆయన జేబులోంచి ఇస్తున్నవి కావనీ జనానికి స్పష్టంగా తెలుసు. అసలు సంక్షేమం అంటే ఎవరికైనా తొలుత గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీయే. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే పేర్లు మార్చి సొంత బుర్రలోంచి పుట్టిన పథకాలుగా జగన్ ప్రచారం చేసుకున్నారు.
గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నడూ సంక్షేమం అందిస్తున్నాం కదా? ఇక జనాన్ని పట్టించుకోనవసరం లేదని భావించలేదు. అభివృద్ధి ద్వారా సంపద సృష్టి చేసి, ఆ సంపదను పేదలకు పంచాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కార్ ముందుకు సాగింది. అయితే జగన్ మాత్రం సంపద సృష్టి, అభివృద్థి మాటలు మరిచిపోయి ఓట్ల కోసం మీకు సొమ్ములు పందేరం చేస్తున్నాం అన్న తీరులో జగన్ సర్కార్ వ్యవహరించింది. అందుకే వైసీపీ సంక్షేమ డప్పుపై జనంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయ్యింది. ఆ సంగతి గడపగడపకూ, మంత్రుల సామాజిక బస్సుయాత్ర సందర్భంలోనే ప్రస్ఫుటమైంది. అయితే జగన్ ప్రజాగ్రహాన్ని ఖాతరు చేయలేదు. పథకాలు అందవు అంటూ బెదరించి, అధికారులను ప్రయోగించి ఏపీకి జగనే కావాలని చెప్పించారు. వారికి తోడు... జగన్ కోసం జగన్ చేత జగనే నియమించుకున్న వాలంటీర్లతో పథకాల భయం పెట్టి జనాన్ని నోరు ఎత్తకుండా చేసి ఆల్ ఈజ్ వెల్ అనుకున్నారు.
ఇంత చేసుకున్న జగన్ ఓటమి తరువాత నాడు జగన్ కు జై అన్న జనం అంతా ఏమయ్యారు? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటమి పరిపూర్ణమైన తరువాత మీడియా సమావేశంలో నేను ఇచ్చిన సంక్షేమ సొమ్ము తీసుకున్న వారి ఓట్లన్నీ ఏమయ్యాయో అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నాయి. సంక్షేమం పేరిట పంచిన సొమ్ము నీ జేబులోది కాదనీ, అయినా సంక్షేమం సమృద్ధిగా అందించావు, రాష్ట్రం పురోగమిస్తోంది. అందుకే నువ్వే కావాలి జగన్ అని జనం అనాలి కానీ, నీకు నువ్వనేసుకుంటే ఎలా మాజీ సీఎం అంటూ నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు.
నిజమే ప్రజలు జగన్ కావాలనుకుంటే అది వాళ్ళే చెప్పాలి. వాళ్లు చెప్పేశారు. జగన్ నువ్వు మాకు వద్దు అని. అంత స్పష్టంగా ప్రజా తీర్పు వెలువడిన తరువాత కూడా నా సంక్షేమ లబ్ధిదారుల ఓట్లు మాకు దక్కకపోవడం వెనుక ఆధారాలు లేని కుట్ర ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన నైజాన్ని ఎత్తి చూపుతున్నాయి. తన వైఫల్యాలు, తప్పిదాలు, ఓటమి.. ఇలా ప్రతి అంశం వెనుకా ఎవరిదో కుట్ర ఉందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు అంటున్నారు.