నారా లోకేష్.. మెజారిటీ ఒక చరిత్ర!

91,413 ఓట్ల మెజారిటీ. మంగళగిరి నియోజ‌క‌వ‌ర్గం ఏర్ప‌డిన తర్వాత ఇదే అత్య‌ధిక మెజారిటీ. 72 సంవత్సరాల మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో నారా లోకేష్ రికార్డ్  మెజారిటీ సాధించారు. 1952లో మంగళగిరికి జరిగిన తొలి ఎన్నిక నుంచి ఇప్పటివరకూ పోటీ చేసిన అభ్యర్థులలో అత్యధిక మెజారిటీ 91,413 ఓట్ల మెజారిటీ రికార్డు నారా లోకేష్ సాధించారు. ఒకప్పటి  మద్రాసు రాష్ట్రంలో భాగమైన మంగళగిరి నియోజకవర్గంలో 1952లో జరిగిన తొలి ఎన్నికలలో సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన డి లక్ష్మయ్య 17265 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే ఇప్పటివరకూ మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీ. ఈ ఎన్నికలలో నారా లోకేష్ మొత్తం 167710 ఓట్లు సాధించి, ప్రధాన ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై 91,413  ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మంగళగిరి నియోజకవర్గం 72 ఏళ్ల రికార్డుని అధిగమించారు.

పాతికేళ్ల నెగెటివ్‌ సెంటిమెంట్‌ కి బ్రేక్.. పయ్యావుల ఫుల్ హ్యాపీ!

రాజకీయాల్లో కొందరు నాయకులకు చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. పార్టీ అధికారంలోకి వస్తే వారు ఎమ్మెల్యేగా ఓడిపోతారు లేదా వారు ఎమ్మెల్యేగా గెలిస్తే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుంది. రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ ది అదే పరిస్థితి. 1999 నుంచి ఉరవకొండలో ఆయన, రాష్ట్రంలో టీడీపీ ఒకేసారి గెలవలేదు. కానీ ఎట్టకేళకు ఇన్నాళ్లకు ఆ సెంటిమెంట్ కి బ్రేక్ పడింది. 1994లో మొదటిసారి ఉరవకొండ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు పయ్యావుల కేశవ్. అప్పుడు రాష్ట్రంలో కూడా తెలుగుదేశమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత నుంచి పయ్యావులను నెగెటివ్‌ సెంటిమెంట్‌ వెంటాడింది. 1999లో పయ్యావుల ఓడిపోగా, టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 లలో పయ్యావుల గెలవగా, తెలుగుదేశం ప్రతిపక్షానికి పరిమితమైంది.  రాష్ట్ర విభజన తర్వాత కూడా అదే సెంటిమెంట్ కొనసాగింది. 2014 లో పయ్యావుల ఓడిపోగా, టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 లో పయ్యావుల గెలవగా.. రాష్ట్రంలో తెలుగుదేశం ఓడిపోయింది. దీంతో పయ్యావుల ఎమ్మెల్యేగా గెలవడం, టీడీపీ అధికారంలోకి రావడం.. రెండూ ఒకేసారి జరగడం కష్టమనే నెగటివ్ సెంటిమెంట్ ఏర్పడింది. అయితే ఆ సెంటిమెంట్ కి ఈ 2024 ఎన్నికల్లో బ్రేక్ పడింది. ఉరవకొండ నుంచి పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే టీడీపీ కూటమి ఏకంగా 160 పైగా సీట్లతో అధికారంలోకి వచ్చింది.

దొంగ సన్యాసి పరిపూర్ణానంద తప్పుడు అంచనాలు!

పేరుకే సన్యాసి... రాజకీయంగా అధికారంలోకి రావాలని తాపత్రయం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లాగా రాజకీయాల్లో రాణించాలని ఆశ.. అందుకే ఒకసారి తెలంగాణలో పోటీ చేసి తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. ఏపీలో కూడా బీజేపీ నుంచి హిందూపూర్ టిక్కెట్ ఆశించాడు. కుదరదు పొమ్మనేసరికి కూటమి మీద విషం కక్కడం ప్రారంభించాడు. ఎగ్జిట్ పోల్స్ మొత్తం కూటమి అధికారంలోకి వస్తుందని చెబితే, ఈయన తగుదునమ్మా అని ఎవరో పిలిచినట్టుగానే మీడియా ముందుకు వచ్చాడు. వైసీపీకి 123 సీట్లు వస్తాయని తన దగ్గర సమాచారం వుందని చెప్పుకొచ్చాడు. చివరికి ఏమైంది? సన్యాసికి చిరిగి చేటైంది.. అందుకే.. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే అందరికీ బాగుంటుంది. సన్యాసి సన్యాసి లాగా వుండకుండా సన్నాసిలాగా వ్యవహరించడం కరెక్ట్ కాదు కదా.

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా....

ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం కూటమి 165 స్థానాలను సొంతం చేసుకుంది. 10 స్థానాలతో వైసీపీ సరిపెట్టుకుంది. ఎన్నికల ఫలితాలను మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గంలో 5 స్థానాలు కూటమి, 2 స్థానాలు వైసీపీ గెలిచాయి. ఒంగోలు పార్లమెంట్ స్థానంలోని 6 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కూటమి, ఒక స్థానం వైసీపీ గెలిచాయి. రాజంపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని 4 అసెంబ్లీ స్థానాలు టీడీపీ కూటమి, 3 స్థానాలు వైసీపీ గెలిచాయి, కడప పార్లమెంట్ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం కూటమి, 2 స్థానాలు వైసీపీ గెలిచాయి. కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 5 స్థానాను తెలుగుదేశం కూటమి, రెండు స్థానాలను వైసీపీ కూటమి గెలిచాయి. ఇక మిగిలిన 20 పార్లమెంట్ స్థానాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, అనంతపురం, హిందూపురం, నంద్యాల పార్లమెంట్ స్థానాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను టీడీపీ కూటమి సొంతం చేసుకుంది.

మాజీ సీఎం జగన్ ప్రెస్‌మీట్... ఏడ్వలేక నవ్వు!

మాజీ ముఖ్యమంత్రి జగన్ మీడియా ముందుకు వచ్చారు. మీడియా ముందుకు వచ్చి కూర్చుని కాసేపు వయ్యారపు నవ్వులు నవ్వారు. కొద్ది క్షణాలు నానా రకాల మెలికలు తిరిగారు. ఆ తర్వాత మాట్లాడ్డం ప్రారంభించారు. ఇన్ని కోట్ల మందికి అది చేశాను.. ఇన్ని లక్షల మందికి ఇది చేశాను.. అక్క చెల్లెళ్ళు.. అవ్వతాతలు.. వీళ్ళందరి ప్రేమ ఏమైపోయిందో అంటూ సుదీర్ఘ సుత్తి కొట్టారు. ఈ ఫలితాలు తనకు అశ్చర్యం కలిగించాయని చెప్పారు.  ఇలాంటి ఫలితాలను ఎంతమాత్రం ఊహించలేదని అన్నారు. ఎలా జరిగిందో, ఏం జరిగిందో నేను మాట్లాడదలచుకోవడం లేదు.. గెలిచిన వారికి మాత్రం అభినందనలు అని అన్నారు. ప్రతి పక్షంలో వుండటం తనకి కొత్త కాదని, రాజకీయాల్లో బాధలు పడటం కూడా కొత్త కాదని, ముందు ముందు పోరాటం చేస్తానని, పేదవారికి అండగా వుంటానని చెప్పారు. జగన్ మాట్లాడుతున్నంతసేపూ ఇప్పుడు భోరుమని ఏడుస్తారేమో అన్నట్టుగానే పరిస్థితి వుంది. తాను మాట్లాడాల్సింది మాట్లాడేసి, మీడియాకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లేచివెళ్ళిపోయారు. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్‌కి తోకలాగా ఫాలో అయ్యారు.

రుషికొండ భవనాలపై తెలుగుదేశం జెండాల రెపరెపలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించింది. దాదాపు 160 స్థానాలలో తెలుగుదేశం కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముందునుంచీ తెలుగువన్ చెబుతున్నట్లుగానే వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ఫలితాల సరళిని బట్టి స్పష్టమౌతోంది.  రాష్ట్ర వ్యాప్తంగా  తెలుగుదేశం కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి.  తెలుగుదేశం కూటమి పార్టీల కార్యాలయాలు కళకళలాడుతుంటే.. వైసీపీ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ కూడా నిర్మానుష్యంగా మారిపోయింది. అటువైపు చూసే నాథుడు కూడా లేకుండా పోయాడు.  నిబంధనలన్నీ తుంగలోకి తొక్కి వందల కోట్ల రూపాయలతో  రుషికొండపై  జగన్‌ ప్రభుత్వం నిర్మించిన విలాసవంతమైన భవనాలపై తెలుగుదేశం కార్యకర్తలు పార్టీ జెండాలు ఎగురవేశారు.  ఇంత కాలం రుషికొండ పరిసరాలలోకి అన్యుల ప్రవేశం నిషిద్ధం.  జనసేనాని పవన్ కల్యాన్ గతంలో రుషికొండ పరిశీలనకు వెడితే  జగన్ సర్కార్ ఆదేశాల మేరకు పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు వచ్చిన పరిశీలకులకూ అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం పతనం ఖరారైన తరువాత పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను అడ్డుకోలేదు. వారు పార్టీ జెండాలతో రుషికొండపై జగన్ చేత జగన్ కోసం జగనే ప్రభుత్వ సొమ్ముతో నిర్మించుకున్న విలాసవంతమైన భవనాలకు చేరుకుని ప తెలుగుదేశం జెండాలు ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అలాగే జగన్ సర్కార్ ఏకపక్షంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్  వర్సిటీగా మార్చేసిన  సంగతి తెలిసిందే. ఎన్నికలలో జగన్ సర్కార్ పతనం ఖారరైన వెంటనే తెలుగుదేశం శ్రేణులు ఆ వర్సిటీ వద్దకు చేరుకుని డాక్టర్ వైఎస్ఆర్ అక్షరాలను తొలగించి ఎన్టీఆర్ అక్షరాలు అమర్చారు. దీంతో వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ కాస్తా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. జగన్ అడ్డగోలు నిర్ణయాలను చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి  చట్ట ప్రకారం ఎలాగూ మార్చేస్తారు. హెల్త్ వర్సిటీకి అధికారం చేపట్టిన తరువాత ఎన్టీఆర్ పేరునే పెడతామని చంద్రబాబు ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జనం మాత్రం ఆ మార్పు ఎలాగూ జరుగుతుంది. అంత వరకూ  మేం ఆగడం ఎందుకు అని తామే మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.   

పవన్ విజయం, చిరంజీవి సంతోషం!

పవన్ కళ్యాణ్ సాధించిన విజయం ఆయన సోదరుడు చిరంజీవిని ఆనందంలో ముంచెత్తింది. సోషల్ మీడియా ద్వారా చిరంజీవి తన స్పందనను తెలిపారు. ‘‘డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నన్ను తగ్గావని ఎవరు అనుకున్నా.. అది ప్రజలను నెగ్గించడానికే అని నిరూపించావ్. నిన్ను చూస్తుంటే ఓ అన్నగా గర్వంగా వుంది. నువ్వు ‘గేమ్ ఛేంజర్’ మాత్రమే కాదు.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అని కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, నీ కలల్ని, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాల్ని నిజం  చేసే దిశలో నిన్ను నడిపిస్తుందని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నువ్వు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నా’’ అని పేర్కొన్నారు.

బాబు చేతుల్లో మోడీ భవితవ్యం.. తెరవెనుక మొదలైన రాజకీయం!

400 సీట్లు గెలిచి, మళ్ళీ అధికారంలోకి వస్తామని లోక్ సభ ఎన్నికలకు ముందు నుంచి బీజేపీ చెబుతూ వస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 350 సీట్లు గెలిచే అవకాశముందని అంచనా వేశాయి. కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎన్డీయే కూటమి 300 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. దీంతో కాంగ్రెస్ రంగంలోకి దిగింది. మోడీని మూడోసారి ప్రధానమంత్రిని చేయకుండా ఉండటానికి తెరవెనుక తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272. ఎన్డీయే కూటమి 290 పైగా సీట్లతో మ్యాజిక్ ఫిగర్ ని అందుకుంటున్నప్పటికీ.. మోడీ పీఎం అవుతారా లేదా? అనే దానిపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎన్డీయేకి గట్టి పోటీ ఇచ్చి.. 230 పైగా స్థానాల్లో సత్తా చాటింది. ఈ స్థాయి పోటీ.. బీజేపీ అసలు ఊహించలేదు. కూటమితో సంబంధం లేకుండానే ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ దాటుతామని నిన్నటివరకు బీజేపీ ధీమాగా ఉంది. కానీ ఇప్పుడు కూటమితోనే బొటాబొటిగా మార్క్ ని దాటింది. 'చావు తప్పి కన్ను లొట్టబోయింది' అన్నట్టుగా చివరికి అంతోయింతో హ్యాపీగా ఉన్న బీజేపీకి.. ఇప్పుడు కాంగ్రెస్ ఊహించని షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఎన్డీయేలోని కీలక పార్టీలకు చెందిన నేతలతో సంప్రదింపులు జరుపుతోందట. అందులో ప్రధానంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత నితీష్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. తమకి మద్దతు ఇస్తే విభజన హామీలు నెరవేర్చడంతో పాటు..ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తామని చంద్రబాబుకి కాంగ్రెస్ రాయబారం పంపుతోందట. గతంలో ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మాట మార్చింది. కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా హోదా ఇస్తామని ఎప్పటి నుంచో చెబుతోంది. ఇప్పుడదే అస్త్రాన్ని చంద్రబాబుపై ప్రయోగిస్తోందట. ఏపీ కాంగ్రెస్ నాయకులు రఘువీరా రెడ్డి వంటి వారు ఇదే విషయాన్ని బహిరంగంగా కూడా చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక కేంద్రంలో జేడీయూ పార్టీకి కీలక బాధ్యతలు ఇవ్వడంతో పాటు, బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక వరాలు కురిపిస్తాయని కాంగ్రెస్ నేతలు నితీష్ కుమార్ కి రాయబారం పంపుతున్నారట. చంద్రబాబు, నితీష్ కుమార్ ఇద్దరు చాలా సీనియర్ నాయకులు. పైగా ఇప్పుడు వారి చేతిలో 30 సీట్లు ఉన్నాయి. ఎన్డీయే కూటమిలో ఇప్పుడు ఈ ఇద్దరే కీలకం. వారు మద్దతు ఇవ్వకుంటే.. మోడీ మళ్ళీ ప్రధాని అయ్యే పరిస్థితి లేదు. అందుకే కాంగ్రెస్ తెలివిగా ఈ ఇద్దరు నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందట.