సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి షాక్.. భారీగా తగ్గిన సీట్లు!
posted on Jun 4, 2024 @ 4:37PM
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి విజయం దిశగా దూసుకెళ్తున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో కమలం పార్టీ మాత్రం వెనుకబడింది. భారీగా నష్టపోయింది. ఎన్డీయే 297 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అదే సమయంలో విపక్ష ఇండియా కూటమిబలంగా పుంజుకుని 226 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 19 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.
రాష్ట్రాల వారీగా చూసుకుంటే తమిళనాడులో 36 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు సత్తా చాటుతుండగా, ఎన్డీయే కూటమి 2 స్థానాల్లోనే ముందంజలో ఉంది. అన్నాడీఎంకే మరీ దారుణంగా ఒకే ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో ఉంది.
ఇక ఉత్తర ప్రదేశ్ లో అయితే బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక్కడ మొత్తం 80 స్థానాలకు గాను 41 చోట్ల కాంగ్రెస్ కూటమి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తుంటే.. బీజేపీ నేతృత్వంలోని 38 చోట్ల ఎన్డీయే, ఒక స్థానంలో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు.
మహారాష్ట్రలోనూ ఇండియా కూటమి సత్తా చాటుతోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 48 స్థానాలు ఉండగా, ఇండియా కూటమి 29, ఎన్డీయే 18, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకి అనుకూలంగా చెప్పాయి. అయితే వాస్తవ ఫలితాలు మాత్రం పూర్తి రివర్స్ లో ఉన్నాయి. బెంగాల్ లో అధికారఅధికార టీఎంసీ దూసుకెళ్తోంది. రాష్ట్రంలో మొత్తం 42 స్థానాలు ఉండగా టీఎంసీ 28, బీజేపీ 12, కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
బీహార్‌లో మాత్రం ఎన్డీయే కూటమి సత్తా చాటుతోంది. అక్కడ మొత్తం 40 స్థానాలకు గాను ఎన్డీయే 31, ఇండియా కూటమి 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
కర్ణాటకలోనూ ఎన్డీయే హవా కొనసాగుతోంది. మొత్తం 28 స్థానాల్లో ఎన్డీయే 21, ఇండియా కూటమి 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
గుజరాత్‌లోనూ ఎన్డీయే జోరు కొనసాగుతోంది. ఇక్కడ మొత్తం 26 స్థానాలు ఉన్నాయి. 25 స్థానాల్లో ఎన్డీయే, ఇండియా కూటమి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్డీయే కూటమి 21, వైసీపీ 4 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
రాజస్థాన్‌లో ఇండియా, ఎన్డీయే కూటమి అభ్యర్థులు పోటీపోటీ ప్రదర్శన ఇస్తున్నారు. 25 స్థానాలకు గాను ఎన్డీయే 13, ఇండియా 11, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
ఒడిశాలోనూ ఈసారి ఎన్డీయే అనూహ్య ఫలితాలు సాధిస్తోంది. మొత్తం 21 స్థానాలకు గాను ఎన్డీయే 18, అధికార బీజేడీ 2, ఇండియా కూటమి ఒక స్థానంలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నాయి.
కేరళలో యూడీఎఫ్ తిరుగులేని ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 20 స్థానాలు ఉండగా యూడీఎఫ్ 16, ఎన్డీయే 2, ఎల్డీఎఫ్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
తెలంగాణలోనూ ఈసారి బీజేపీ గణనీయమైన సీట్లు సాధిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లోనూ, ఎంఐఎం ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉంది.
అలాగే, ఝార్ఖండ్, అస్సాం, చత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, అండమాన్ అండ్ నికోబార్ రాష్ట్రాలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా, మిగతా రాష్ట్రాలో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది.