ఎంత పని చేశావమ్మా షర్మిల!
posted on Jun 4, 2024 @ 3:21PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన అన్నయ్య వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా బలంగా గళం వినిపించారు. అంతేకాదు తనకు వరుసకు సోదరుడు అయ్యే వైఎస్ అవినాష్ కి పోటీగా కడప నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. తన బాబాయ్ వైఎస్ వివేకా ఆత్మకి శాంతి కలగాలంటే తనని గెలిపించాలని అభ్యర్థించారు. ఒకానొక సమయంలో కడప ఎంపీగా షర్మిల గెలిచే అవకాశముందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ ఆమె తన ప్రభావాన్ని అంతగా చూపలేకపోయారు. ఇక ఇప్పుడు ఫలితాల్లో పూర్తిగా వెనకబడిపోయి.. మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు.
ఇవాళ వెలువడుతున్న ఏపీ ఎన్నికల ఫలితాల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ పూర్తిగా చేతులెత్తేసింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను కనీసం 10 కూడా గెలిచే పరిస్థితి లేదు. కంచుకోటగా భావించే రాయలసీమలోనూ వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇది వైసీపీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఇలాంటి సమయంలో కడప ఎంపీగా షర్మిల గెలిస్తే ఆమె దశ తిరిగేదే. ఎందుకంటే ప్రస్తుత వైసీపీ కేడర్ అంతా ఒకప్పటి కాంగ్రెస్ కేడరే. రాష్ట్ర విభజన తరువాత ఏపీ లో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నార్థం కావడంతో.. మెజారిటీ కేడర్ ఆ పార్టీని వీడి.. వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలడంతో.. ఒకవేళ షర్మిల ఎంపీగా గెలినట్లయితే, ఆమె నాయకత్వం మీద నమ్మకంతో మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరే అవకాశముండేది. కానీ ఎంపీగా కనీస పోటీ ఇవ్వలేక.. షర్మిల మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. మొత్తానికి రాష్ట్ర విభజన దెబ్బకి ఏపీలో 2014 లో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతే.. కాంగ్రెస్ పునాదుల మీద ఏర్పడిన వైసీపీ సరిగ్గా పదేళ్లకు ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడింది.