మాచర్లలో టిడిపి అభ్యర్థి జూలకంటి ఘన విజయం
posted on Jun 4, 2024 @ 3:56PM
ఎపిలో సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మాచర్ల వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లి దౌర్జన్యం చేసిన సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుస విజయాల పరంపరకు అడ్డుకట్ట పడింది. ఈ ఎన్నికల్లో ఆయన ఓటమిపాలయ్యారు. పిన్నెల్లి మాచర్ల నియోజకవర్గంలో గత 20 ఏళ్లుగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పిన్నెల్లిపై టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఘనవిజయం సాధించారు.
మాచర్ల అసెంబ్లీ స్థానంలో 21 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి జూలకంటి బ్రహ్మారెడ్డి 31,761 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. 21 రౌండ్ల అనంతరం జూలకంటికి 1,18,290 ఓట్లు రాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 86,529 ఓట్లు వచ్చాయి. ఇక్కడ మరొక్క రౌండ్ ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలున్న నేపథ్యంలో, జూలకంటి విజయం ఖరారైంది.