మంగళగిరిలో నారా లోకేష్ స్ఫూర్తి దాయక ప్రస్థానం
posted on Jun 4, 2024 @ 3:42PM
ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల కౌంటింగ్ ఆరంభమైన క్షణ నుంచీ తెలుగుదేశం కూటమి విజయం దిశగా ప్రభంజనంలా దూసుకుపోతోంది. విపక్ష హోదా కూడా ప్రస్తుత అధికార పార్టీ వైసీపీకి దక్కే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దాదాపు నలభై సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించినా, అన్నిటిలోనూ కచ్చితంగా ఫలతాన్ని అంచనా వేసిన కేకే సంస్థ పేర్కొన్నట్లు వైసీపీ కంటే తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేనకే అధిక స్థానాలు దక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ప్రధానంగా ఎక్కువ ఆసక్తి కలిగించిన నియోజకవర్గాలలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం ఒకటి.
2019 ఎన్నికలలో తొలి సారిగా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగిన నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలో ఆయన పరాజయం పాలయ్యారు. అసలు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడమే సాహసం. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ఆవిర్భవించిన తరువాత తెలుగుదేశం అక్కడ రెండంటే రెండు సార్లు విజయం సాధించింది. 1985 తరువాత తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో గెలిచినదే లేదు. అలాంటి చోట ఒక సారి పరాజయం పాలైన తరువాత మళ్లీ అక్కడ నుంచే పోటీ చేయాలని లోకేష్ నిర్ణయించుకోవడం ద్వారానే నాయకుడిగా ఆయన ఒక మెట్టు ఎక్కేశారు. అంతే కాకుండా 2019 ఎన్నికలలో ఓటమి తరువాత ఆయన నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. అన్నివర్గాల ప్రజలతో మమేకమై అందరివాడుగా మారారు.
గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకూ ప్రతి ఒక్క నాయకుడిని వ్యక్తిగతంగా కలిసి దగ్గరయ్యారు. నియోజకవర్గ ప్రజలకు ఆత్మీయుడయ్యారు. తటస్థులనే వారే లేకుండా అన్ని వర్గాలనూ తెలుగుదేశం పార్టీకి చేరువ చేశారు. అందుకే ఆయన అత్యంత కీలకమైన ఎన్నికల సంవత్సరంలో నియోజకవర్గాన్ని వదిలిపెట్టి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు దాదాపు ఏడాది కాలం వెళ్లినా జనం మాత్రం ఆయనను తమ గుండెల్లో పెట్టుకున్నారు. ఫలితమే ఇప్పడు లక్ష ఓట్ల పై చిలుకు ఓట్ల మెజారిటీతో లోకేష్ మంగళగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.