పిఠాపురంలో భారీ మెజారిటీతో పవన్ విజయం
posted on Jun 4, 2024 @ 2:57PM
జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69 వేల 169 ఓట్ల ఆధిక్యతతో జయకేతనం ఎగురవేశారు. వైసీపీ అధినేత జగన్ పవన్ ను ఓడించడమే టార్గెట్ గా పిఠాపురంలో చతురంగ బలగాలను మోహరించిన విధంగా వైసీపీ మూకలను దించడమే కాకుండా పిఠాపురం బాధ్యతలను ప్రత్యేకంగా మిథున్ రెడ్డికి అప్పగించారు.
అలాగే పవన్ వ్యక్తిగతంగా దూషించడం కోసం స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకుని మరీ పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించారు. ఇవన్నీ చాలవన్నట్లు జగన్ తన చివరి ఎన్నికల ప్రచార సభను పిఠాపురంలోనే నిర్వహించి పవన్ ను వ్యక్తిగత అంశాలపై దూషించారు. అయితే జనం మాత్రం పవన్ వెంటే నిలిచారు.
భారీ మెజారిటీతో పవన్ ను పిఠాపురంలో గెలిపించుకున్నారు. ఈ విజయం ద్వారా పవన్ కల్యాణ్ జగన్ కు గట్టి బదులిచ్చినట్లే చెప్పాలి. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి దూషణలకు పాల్పడిన పవన్ కల్యాణ్ ఎక్కడా సంయమనం కోల్పోకుండా అంశాల ఆధారంగానే జగన్ పైనా, అధికార పార్టీపైనా విమర్శలు చేస్తూ వచ్చారు.