చంద్రబాబు నివాసంలో ఆనందోత్సాహాలు!
posted on Jun 4, 2024 @ 3:56PM
ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆనందోత్సాహాలతో వేడుకలు జరుగుతున్నాయి. ఐదేళ్ళపాటు అవమానాలు, వేధింపులు, జైలు జీవితం అనుభవించిన చంద్రబాబు నాయుడికి ఈరోజు నిజంగానే ఒక అద్భుతమైన రోజు. ఆయనకు మాత్రమే కాదు.. చంద్రబాబుని గెలిపించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇది అద్భుతమైన రోజు. ఈ అద్భుతమైన సందర్భాన్ని చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో వేడుకగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో జూనియర్ చంద్రబాబుగా అందరూ పిలుచుకునే నారా దేవన్ష్ కేక్ కట్ చేసి తాత చంద్రబాబు నాయుడికి తినిపించారు.
నారా దేవాన్ష్ చాలా చిన్నపిల్లాడు.. తన తాతయ్యకి, నాయనమ్మకి, నాన్నకి, అమ్మకి, తన కుటుంబం మొత్తానికీ జగన్ గ్యాంగ్ వల్ల జరిగిన అవమానాల గురించి తెలిసి వుండకపోవచ్చు. అతనికి తెలిసింది ఒక్కటే.. చాలాకాలం తర్వాత తన కుటుంబం మొత్తం సంతోషంగా వుంది. చాలాకాలం తర్వాత తన తాత ముఖంలో అపారమైన ఆనందం కనిపిస్తోంది. అది చాలు.... ఆ చిన్ని మనసు కుటుంబ వేడుకలో ఆనందంగా గడపడానికి. ఒక్క చంద్రబాబు కుటుంబంలో మాత్రమే కాదు.. రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలలో జగన్ పరిపాలన కారణంగా ఆనందం మాయమైంది. ఇప్పుడు చంద్రబాబు కుటుంబం ఎంత సంతోషంగా వుందో, రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు అంతే సంతోషంగా వుండి వుంటాయి. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు వచ్చాయి.