జాతీయ రాజకీయాలలో మళ్లీ చక్రం తిప్పనున్న చంద్రబాబు
posted on Jun 4, 2024 @ 3:12PM
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరో సారి జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ సమర్ధవంతంగా పని చేయడానికీ, భాగస్వామ్య పక్షాలు సమన్వయంతో మెలగడానికీ చంద్రబాబు చేసిన కృష్టే కారణం. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ప్రధాని వాజ్ పేయి పలు సందర్భాలలో చెప్పారు. ఇక అప్పటి ఉప ముఖ్యమంత్రి అద్వానీ అయితే నమ్మదగ్గ మిత్రుడు చంద్రబాబు మాత్రమేనని ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఆ తరువాత మళ్లీ ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా తెలుగుదేశం విభజిత ఆంధ్రప్రదేశ్ లో అధికారం లో ఉన్న సమయంలో మాత్రం వాజ్ పేయి హయాం నాటి సాన్నిహిత్యం బీజేపీ , తెలుగుదేశం మధ్య కానరాలేదు. అప్పట్లో భాగస్వామ్య పక్షాల మద్దతు లేకపోకయినా సొంతంగా ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైనన్ని స్థానాలున్నాయన్న ధీమా బీజేపీలో మెండుగా ఉండేది. దీంతో మిత్రధర్మం పాటించే విషయంలో మోడీ సర్కార్ పట్టనట్లుగా, లేక్కలేని తనంతో వ్యవహరించింది. దీంతో విభజన హామీల విషయంలో చంద్రబాబు పదేపదే డిమాండ్ చేయాల్సి వచ్చేది. అయినా కూడా మోడీ సర్కార్ పట్టించుకోకపోవడంతో అనివార్యంగా చంద్రబాబు ఎన్డీయే నుంచి వైదొలిగారు. ఆ తరువాత 2019 సార్వత్రిక ఎన్నికలలో కూడా బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైనన్ని స్థానాలు సాధించడంతో ఎన్డీయే చిక్కిపోయింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ ఒక్కటొక్కటికీ వైదొలిగాయి.
ఇక 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ వచ్చేసరికి అనివార్యంగా బీజేపీకి నమ్మదగ్గ భాగస్వామ్య పక్షాల అవసరం ఏర్పడింది. దాంతో ఆ పార్టీ పాత మిత్రులకు స్వాగతం పలికింది. ఇటు ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నికలలో అక్రమాలకు చెక్ పడాలంటే బీజేపీ అండ కావాల్సిన పరిస్థితి ఉండింది. దీంతో మరో సారి తెలుగుదేశం ఎన్డీయేలో చేరింది. సరే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అలాగే లోక్ సభ స్థానాలలో కూడా సింహభాగం విజయం సాధించింది. సార్వత్రి ఎన్నికలలో బీజేపీకి గత వైభవం మిగలలేదు సరికదా సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలు దక్కించుకోలేకపోయింది. దీంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనివార్యంగా మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడక తప్పని పరిస్థితి ఎదురైంది.
అన్నిటికీ మించి ఇప్పుడు ఎన్డీయే కూటమిలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం మాత్రమే. దీంతో సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగాలంటే బీజేపీ చంద్రబాబుపైనే పూర్తిగా ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. దీంతో బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుకు ఎన్డీయే కన్వీనర్ పదవిని ఆఫర్ చేసింది. ఈ విషయమై నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబు సమయం కోరారు. వాజ్ పేయి హయాంలో చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా చక్రం తిప్పారు.
ఆ సమయంలో కేంద్రంలో ప్రభుత్వం సజావుగా సాగేలా చూశారు. ఆక్రమంలోనే కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఆ కారణంగా కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన ప్రతి పైసా రాష్ట్రానికి చేరాయి. ఇప్పుడు తాజాగా అదే పాత్ర మరోసారి పోషించాల్సిందిగా బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబును కోరుతోంది. అంటే ఏపీ అభివృద్ధికి అవసరమైన అన్నీ అడగకముందే చేస్తానని బీజేపీ చెప్పకనే చెబుతోంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మిత్రుల మద్దతు అనివార్యం. ఎన్డీయే కూటమిలో బీజేపీ తరువాత పెద్ద పార్టీగా అవతరించిన తెలుగుదేశం కీలకంగా వ్యవహరించనుంది.