గులాబీ కారు స్టీరింగ్ కాంగ్రెస్ హస్తానికి దక్కుతుందా
posted on Nov 8, 2013 @ 9:31AM
కాంగ్రెస్ విలీనం అంటోంది. తెరాస అప్పుడే కాదంటోంది. ఇంకా గట్టిగా అడిగితే పో..పొమ్మంటోంది. ఎందుకు? ఎందుకంటే మంచి బలమయిన కారణాలే ఉన్నాయి. నరేంద్ర మోడీ రంగంలోకి దిగడంతో ఇప్పుడు రాహుల్ గాంధీ వెలవెలబోతున్నాడనేది ఎవరూ కాదనలేని సత్యం. మోడీ సారధ్యంలో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదా లేదా? అనే భేతాళ ప్రశ్నకు ఇప్పుడు జవాబు చెప్పడం కష్టమే. గానీ, ఆయన కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోగల సమర్ధుడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.
మళ్ళీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియని కాంగ్రెస్ పార్టీలో తెరాసను విలీనం చేయడం అంటే రాజకీయంగా ఆత్మహత్యతో సమానమే. రాహుల్ సుడి బాగుండి కాంగ్రెస్ గెలిస్తే పరవాలేదు. కానీ, కాంగ్రెస్ ఓడిపోయి మోడీ ప్రధాని కుర్చీలో కూర్చొంటే? అప్పటికే తెరాస కాంగ్రెస్ విలీనం అయిపోయుంటే? చేజేతులా ఒక సువర్ణావకాశాన్ని వదులుకొన్నట్లే! అందుకే కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఇష్టపడటం లేదు. మహా అయితే ఆ పార్టీతో ఎన్నికల పొత్తులకు అంగీకరించవచ్చేమో. తద్వారా 2014లో కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచినా కూడా తెరాస కారుకి అవసరమయినంత డీజిల్ సంపాదించుకోవచ్చును.
ఇక మరో న్యాయమయిన కారణం ఏమిటంటే పదేళ్ళు కష్టపడి ఉద్యమాలు చేసిన తరువాత, తీరా చేసి ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కాబోతున్న తరుణంలో తెరాసను కాంగ్రెస్ హస్తంలో పెట్టి, కేసీఆర్ తో సహా పార్టీ నేతలందరూ మంత్రి పదవుల కోసం సోనియమ్మ ముందు చేతులు కట్టుకొని నిలబడతారని ఎవరూ ఊహించలేరు. కానీ కాంగ్రెస్ మాత్రం అది సాధ్యమేనని నమ్మడం విచిత్రం! తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే గులాబీ కారు స్టీరింగు తిప్పే అవకాశం కళ్ళెదుట కనబడుతుంటే, ఆ అవకాశం కాదనుకొని కాంగ్రెస్ కి తమ కారు అప్పగించేసి దామోదర్, జానా రెడ్డి, గీతారెడ్డి వంటి వారు వంతుల వారిగా స్టీరింగు తిప్పుతుంటే , తాము మాత్రం ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ వెనుక సీటులో కూర్చోవలని ఎంత బుద్ది తక్కువ రాజకీయ నాయకుడయినా కోరుకోడు. మరి ఆవులిస్తే ప్రేగులు లెక్కజెప్పగల సమర్ధుడు కేసీఆర్ ఎలా ఒప్పుకొంటాడని కాంగ్రెస్ భావిస్తోందో మరి తెలియదు.
బహుశః తన పెంపుడు చిలుకలు సీబీఐ, ఆదాయపన్ను,ఈడీలను చూసుకొనే భరోసాగా ఉందేమో!