యధా రాహుల్ తధా సోనియా
posted on Nov 7, 2013 @ 7:25PM
కొన్ని రోజుల క్రితం రాహుల్ గాంధీ రాజస్తాన్ లో ఎన్నికల ప్రచార సభలో త్యాగమయమయిన తన వంశ చరిత్ర తిరగేసి, అందులో ఏదో ఒకరోజు తన పేరు కూడా ఉంటుందని కొంచెం సెంటిమెంటు జోడించారు. “కాంగ్రెస్ పాలన గురించి చెప్పుకోవడానికి ఏమే లేనందునే గురుడు అలా సెంటిమెంటుతో జనాలని కొడుతున్నాడని” బీజేపీ ఎద్దేవా చేసింది. అతనేదో మ్యాటర్ లేక అలా సరిబెట్టేసాడని అని అనుకొన్నా, కాంగ్రెస్ పార్టీని, యావత్ దేశాన్ని ఒంటి చేత్తో నడిపిస్తున్న సోనియమ్మ కూడా సెంటిమెంటు పాయింటే ఎత్తుకోవడం ఆశ్చర్యం కలిగించింది.
ఈ రోజు ఛత్తిస్ ఘర్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారసభలో ప్రసంగించిన ఆమె కూడా ముందుగా త్యాగమయమయిన తన వంశ చరిత్ర ఏకరువు పెట్టి, ఈ ఏడాది మే నెలలో ఆ రాష్ట్రంలో నక్సల్స్ దాడిలో మరణించిన కాంగ్రెస్ నేతలది కూడా ‘సేమ్ టు సేమ్ హిస్టరీ’ అని సర్టిఫై చేసారు. అయితే నక్సల్స్ దాడిలో మరణించిన వారు ఏవిధంగా త్యాగమూర్తుల కోవలోకి వస్తారో ఆమె వివరించలేదు. (రోడ్డు ప్రమాదాలలో మరణించిన వారు కూడా త్యాగమూర్తుల కోవలోకి వస్తారో లేదో కన్ఫర్మ్ చేసుకోవలసి ఉంది.) ఇక రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం అసమర్ధత వల్లనే రాష్ట్రంలో దారిద్ర్యం, నక్సల్స్ సమస్య వగైరాలు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు. (కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ అభివృద్ధి దిశలో పైపైకి దూసుకుపోతున్నాయని చెప్పడానికి నిన్న మన రాష్ట్రం నుండి అంగారక గ్రహంపైకి దూసుకుపోయిన పీ.యస్.యల్వీ. ఒక గొప్ప ఉదాహారణ).
కాంగ్రెస్ అంటేనే త్యాగాల పుట్ట అని, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ అని ఆమె అక్కడి ప్రజలకు వివరించారు. వారికి కూడా సుఖంగా జీవించాలని కోరిక ఉంటే ఈ నెల 11న జరగనున్న శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించేస్తే, ఇక వారి జీవితాలే మారిపోతాయని ఆమె హామీ ఇచ్చారు.
రేపు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడితే బహుశః ఇదే తరహ ఉపన్యాసం రిపీట్ అవుతుందేమో.